Empower Women: డెయిరీ రంగంలోకి మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు డెయిరీ యూనిట్లు పెట్టి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని, అందుకు అవసరమైన రుణాలను మంజూరు చేసేందుకు సిద్ధమవుతున్నది. 6 నెలల్లో ఫలితాలు రాబట్టే ప్లాన్ చేస్తున్నది. అవసరమైతే (Vijaya Dairy) విజయ డెయిరీతో ముందుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం ఎంచుకున్నది.
అందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడం, మరోవైపు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, బీమా, పాడి పశువులు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, హాస్టళ్లకు సరుకుల సరఫరా, గోదాములు, సోలార్ ప్లాంట్లు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు డెయిరీ ఫాంలు, యూనిట్లు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Also Read: Allu Aravind: ఈడీ విచారణ.. అసలు విషయమేంటో చెప్పేసిన అల్లు అరవింద్..!
అందుకు అవసరమయ్యే ఆర్థిక రుణాలను సెర్ప్ ద్వారా ఇప్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే యూనిట్లు ఎక్కడ స్థాపించాలనే దానిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సెర్ప్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పరకాల డెయిరీ ఉండడంతో అక్కడ ఎలా నడుపుతున్నారనే అంశాలపై అధ్యయనం చేసినట్లు సమాచారం. దాని ప్రకారం (Dairy) డెయిరీ యూనిట్ స్థాపించి 6 నెలల్లోనే ఫలితాలు రాబట్టొచ్చని సెర్ప్ అధికారులు పేర్కొంటున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా మధిర
డెయిరీ (Dairy) యూనిట్‌కు పైలట్ ప్రాజెక్టుగా మధిరలో బల్క్ మిల్క్ యూనిట్‌ను ప్రారంభించేందుకు సెర్ప్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే స్థల పరిశీలన సైతం చేసినట్లు సమాచారం. యూనిట్‌కు అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని సంఘాలకు భాగస్వాములను చేయాలి? ఒక సంఘానికి బాధ్యత అప్పగిస్తే సక్సెస్ అవుతుందా? అనుసరించాల్సిన వ్యూహాలు, అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. మధిరలో యూనిట్ సక్సెస్ అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. యూనిట్ స్థాపనకు అయ్యే ఖర్చును మొత్తం సెర్ప్ రుణాలు ఇవ్వనున్నది.
నేషనల్ డెవలప్‌మెంట్ డెయిరీ సహకారం
డెయిరీ (Dairy) యూనిట్ స్థాపనకు, సక్సెస్ కోసం నేషనల్ డెవలప్‌మెంట్ డెయిరీ సహకారం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సెర్ప్ అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ సంస్థ డెయిరీ రంగంలో అనుభవం ఉంది. దీంతో వారి సూచనల మేరకు ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. మహిళలపై ఉన్న నమ్మకంతో డెయిరీ రంగంలోకి మహిళలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే పరకాలలోని డెయిరీ యూనిట్ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీతో కలిసి ముందుకు వెళ్తామని అధికారులు తెలిపారు.
డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు
=దివ్య, సెర్ప్, సీఈఓ
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా డెయిరీ యూనిట్లను స్థాపించి వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించబోతున్నాం. యూనిట్లకు అవసరమైన రుణాలను సెర్ప్ ద్వారా ఇవ్వనున్నాం. మధిరలో బల్క్ మిల్క్ యూనిట్ ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. దాని ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సూచనల మేరకు ముందుకు సాగుతున్నాం.
Also Read: Naga Chaitanya: ‘ఎన్‌సీ 24’ లేటెస్ట్ అప్డేట్.. పోస్టర్ అదిరింది