China Robo Football League: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులు చేసే పనులను రోబోలు చాలా ఈజీగా చేసేస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో సేవలు అందిస్తూ.. అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన రోబోటిక్ పరిశోధకులు అద్భుతం చేశారు. రోబోలతో ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అచ్చం మనుషుల్లాగే రోబోలు.. గేమ్ ఆడుతున్న దృశ్యాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మానవ ప్రేమయం లేకుండా
చైనా రాజధాని బీజింగ్ లో జూన్ 28న రోబో లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. తొలిసారి స్వయంచాలక (fully Autonomous) AI-పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోలతో ఈవెంట్ ను నిర్వహించి డ్రాగెన్ పరిశోధకులు చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఆగస్టు 15, 16, 17 తేదీల్లో బీజింగ్ లో జరగనున్న ‘వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్’కు ప్రివ్యూగా దీనిని నిర్వహించారు. బూస్టర్ రోబోటిక్స్ (Booster Robotics) సంస్థ రూపొందించిన T1 హ్యూమనాయిడ్ రోబోట్లు ఇందులో పాల్గొన్నాయి. మానవ జోక్యం లేకుండా అవి పూర్తిగా ఏఐ ఆధారంగా సొంతంగా వ్యూహాలు రచించుకొని ఆకట్టుకున్నాయి.
విజేతగా ఆ రోబో జట్టు
ప్రివ్యూ కింద నిర్వహించిన రోబో ఫుట్ బాట్ లీగ్ లో మెుత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి. వీటిలో ప్రముఖంగా ట్సింగ్‌హువా యూనివర్శిటీ (THU రోబోటిక్స్), చైనా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (మౌంటైన్ సీ టీమ్), బీజింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ జట్లు బరిలో నిలిచాయి. 3-ఆన్-3 ఫార్మెట్ లో నిర్వహించిన ఈ గేమ్ లో ప్రతి టీమ్‌లో మూడు హ్యూమనాయిడ్ రోబోలు, ఒక సబ్ స్టిట్యూట్ ను ఆడించారు. ట్సింగ్‌హువా యూనివర్శిటీ చెందిన THU రోబోటిక్స్ జట్టు.. చైనా అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన మౌంటైన్ సీ టీమ్‌ను 5-3 స్కోర్‌తో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.
రోబోల సెన్సార్ల సామర్థ్యం
బూస్టర్ రోబోటిక్స్ సంస్థ.. ఫుట్ బాల్ టోర్నీ కోసం రూపొందించిన రోబోలోనూ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించింది. ఆప్టికల్ కెమెరాలు, సెన్సార్లతో బంతిని 20 మీటర్ల దూరం నుంచి 90% ఖచ్చితత్వంతో గుర్తించేలా తయారు చేసింది. వీటి కారణంగా మ్యాచ్ సందర్భంలో రోబోలు అచ్చం మానవుల లాగానే ప్రవర్తించాయి. నడవడం, బంతిని తన్నడం, ఆటోమేటిక్ గా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయగలిగాయి. అంతేకాదు మ్యాచ్ సమయంలో కింద పడిపోయిన రోబోలు వాటంతట అవే పైకి లేవగలిగాయి. గాయపడ్డ రోబోలను స్ట్రెచర్ పై తీసుకెళ్లడం కూడా మ్యాచ్ సందర్భంగా చూడవచ్చు.
Also Read: Range Rover at low cost: కొత్త రూల్స్ ఎఫెక్ట్.. కార్లు అమ్మేసుకుంటున్న ధనవంతులు.. ఎందుకంటే?
గతంలోనూ రోబోలతో క్రీడలు
రోబోలతో క్రీడలు ఆడించడం.. ఇదే తొలిసారు. గతంలో ఈ తరహా ఈవెంట్స్ ను చైనా నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో హ్యుమానాయిడ్ హాఫ్ మారథాన్ ను చైనా నిర్వహించింది. మానవులతో పాటు 21 రోబోలు మారథాన్ లో పాల్గొనగా.. 6 మాత్రం గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. అలాగే మేలో హాంగ్‌జౌలో సిటీలో రోబోల కిక్ బాక్సింగ్ ఈవెంట్ నిర్వహించారు. గతేడాది జరిగిన రోబో కప్ ఆసియా పసిఫిక్ ఈవెంట్ లో 200కు పైగా జట్లు పాల్గొన్నాయి. ఇందులో రోబో ఫుట్ బాల్ కూడా ఒక భాగంగా ఉంది.