Bengaluru Reddit: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ దానితో కనెక్ట్ అయ్యే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా నిమిషాల వ్యవధిలోనే అది సోషల్ మీడియాలోకి వచ్చేస్తోంది. అంతేకాదు ప్రజలతో కనెక్టివిటీకి వారధులుగా ప్రస్తుత సోషల్ మీడియా యాప్స్ వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, రెడ్డిట్ వంటివి ఉపయోగపడుతున్నాయి. ఇదిలా ఉంటే 20 ఏళ్ల క్రితం తనకు దూరమైన తండ్రిని ఓ కూతురు ఎలాగైనా కనిపెట్టాలని అనుకుంది. ఇందుకు సోషల్ మీడియా సాయం కోరగా.. ఆమెకు ఊహించని ఫలితం లభించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
25 ఏళ్ల ఓ యువతి.. తన రెండు సంవత్సరాల వయసులో తండ్రికి దూరమైంది. దీంతో అప్పటి నుంచి తండ్రి కోసం ఎదురుచూస్తూనే వచ్చింది. అయితే తన తండ్రిని చేరుకోవాలన్న ఆశతో ఆమె సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్ బెంగళూరు (Bengaluru Reddit) విభాగం సాయం కోరింది. తన తండ్రిని చూసి దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయని.. అతడి ఆచూకి కనుగొనేందుకు రెడ్టిట్ యూజర్లు సాయం చేయాలని అందులో పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా తన తండ్రికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. తన ఫాదర్ బెంగళూరులోని ట్రావెల్ మేనేజ్ మెంట్ కంపెనీలో వర్క్ చేసే వారని ప్రస్తుతం అతడి వయసు 45 నుంచి 50 ఏళ్ల వరకూ ఉండొచ్చని పోస్ట్ పెట్టింది. తనకు రెండేళ్లు ఉన్న వయసులో తల్లిదండ్రులు విడిపోయినట్లు పేర్కొంది. తండ్రిని కనిపెట్టేందుకు మీ సాయం కావాలని ఇటీవల రెడ్డిట్ లో నెటిజన్ల సాయం కోరింది
కేరళలో తండ్రి ఆచూకి
యువతి బాధను అర్థం చేసుకున్న రెడ్డిట్ యూజర్లు.. తండ్రిని కనిపెట్టేందుకు కావాల్సిన అదనపు సమాచారాన్ని ఆమెను అడిగి తెలుకున్నారు. ఈ క్రమంలో తన లక్ష్యాన్ని తాను చేరుకున్నట్లు తాజాగా అదే యువతి రెడ్డిట్ లో పోస్ట్ పెట్టింది. కొందరి సాయంతో తన తండ్రి ఆచూకి తెలుసుకోగలిగానని చెప్పుకొచ్చింది. తన తండ్రితో పాటు అతడి కుటుంబం గురించి కూడా తెలుసుకోగలిగానని చెప్పారు. ‘విచారకరమైన విషయం ఏంటంటే మా తాత, నాన్న సోదరుడు ప్రాణాలతో లేరు. నేను నా తండ్రితో మాట్లాడాను. ఒకే ఒక మామయ్య జీవించి ఉన్నారు. మలయాళం మాట్లాడే స్నేహితుడి సాయంతో నేను వారితో మాట్లాడాను. నేను వారి కోసం వెతికానని తెలిసి చాలా సంతోషించారు’ అని ఆమె రాసుకొచ్చింది.
తండ్రి భావోద్వేగం
తనతో మాట్లాడుతున్న సమయంలో తన తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు యువతి చెప్పుకొచ్చింది. ‘నా గొంతు విన్నప్పుడు నాన్న ఏడ్చారు. అమ్మతో విడిపోయాక ఆయన మళ్లీ వివాహం చేసుకోలేదని తెలిసింది. ప్రస్తుతం నా తండ్రి చెన్నైలో పనిచేస్తున్నారు. ఆయన 4 ఏళ్లుగా కేరళకు వెళ్లలేదు. ఇది చాలా భావోద్వేగ క్షణం. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. రెడ్డి ద్వారా తన తండ్రి ఆచూకి తెలిసింది’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. అయితే వచ్చే వారం ఆమె తన తండ్రిని కలుసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రిని గట్టిగా హగ్ చేసుకోని ఇంతకాలం తాను ఏమి మిస్ అయ్యానో చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Man Kills Partner: మరో ఘోరం.. ప్రేయసిని చంపి.. శవంతో రెండు రాత్రులు గడిపిన ఉన్మాది!
నెటిజన్లు సంతోషం
తమ సాయం కోరిన యువతి.. చివరికీ తన తండ్రి ఆచూకి కనుగొనడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘డ్యూడ్.. ఇది చాలా గొప్ప వార్త’ ఓ వ్యక్తి రెడ్డిట్ లో పోస్ట్ చేశారు. ఇంటర్నెట్ మ్యాజిక్ పనిచేస్తుందని తాను ఆశించానని.. నీ విషయంలో జరిగిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా పవర్ తో 20 ఏళ్ల తర్వాత తండ్రిని కలుసుకోబోతున్నందుకు అభినందనలు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తం సోషల్ మీడియాను మంచిగా ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఈ యువతి ఉదంతం చెప్పకనే చెప్పింది.