Electricity Department: విద్యుత్ డిమాండ్-సరఫరా-అంతరాయాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత ఇంజినీర్లను అప్రమత్తం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(Musharraf Farooqui) తెలిపారు. ఈ వివరాలను విశ్లేషించడం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలు అందించే వీలుంటుందని ఆయన అన్నారు. ఇప్పటికే సబ్‌స్టేషన్, ఫీడర్లలో ఫీడర్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలులో ఉందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సరఫరా, లోపాలను గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత సేవలు దోహదం చేస్తాయని సీఎండీ(CMD) అభిప్రాయపడ్డారు. మింట్ కాంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు, వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రతి బుధవారం బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలతో ముఖాముఖి చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Thammudu: నలుగురు హీరోయిన్స్ తో తమ్ముడు డైరెక్టర్ రచ్చ.. మహేష్ బాబును బాగా వాడేశారుగా?
సరఫరా పర్యవేక్షణ, వేసవి ప్రణాళికలు
ప్రస్తుతం సంస్థ పరిధిలో 8681, 11 కేవీ ఫీడర్లు ఉండగా, వాటిలో 6885 ఫీడర్ల పరిధిలో ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా విద్యుత్ సరఫరా పర్యవేక్షణ జరుగుతుందని ఫరూఖీ వివరించారు. మిగతా ఫీడర్లను కూడా ఈ సిస్టమ్ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా, ప్రతి రోజు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ స్థాయిలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించిన సీఎండీ, తరచుగా సమస్యలు ఎదుర్కొంటున్న ఫీడర్లపై, డీటీఆర్(DTR)లపై డివిజనల్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వేసవి డిమాండ్‌కు చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు.
సంస్థ పరిధిలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ ప్రతీ ఏటా భారీగా పెరుగుతోందన్నారు. దానికి తగినట్లుగా చేపట్టాల్సిన పనులపై ఆగస్టు 15 లోగా నివేదికలు రూపొందించాలన్నారు. నూతన సర్వీసుల మంజూరు వంటి సేవలు ఎస్ఓపీ(FOP) ప్రకారం నిర్ణీత సమయంలో మంజూరు చేయాలని, వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శివాజీ, నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి, జోనల్ చీఫ్ ఇంజినీర్లు సాయిబాబా, పాండ్య, బాలస్వామి, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Anchor Swetcha: తట్టుకోలేకపోతున్నా.. పచ్చి నిజాలు చెప్పిన పూర్ణచందర్ భార్య