Pakistani Couple: మానవ జీవితంలో ప్రేమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రేమలో ఉన్న యువతి, యువకులు ఒక్కటయ్యేందుకు ఎలాంటి సాహసాలకైనా సిద్ధపడుతుంటారు. ఒకసారి పెళ్లి జరిగిన తర్వాత అందమైన జీవితాన్ని పొందేందుకు ఎన్నో కలలు కంటారు. పాకిస్థాన్ కు చెందిన మైనర్ జంట కూడా అలాంటి కలలే కన్నది. నిత్యం అల్లర్లు, ఆకలి దప్పికలతో కొట్టుమిట్టాడే పాక్ నుంచి ప్రశాంతమైన భారత దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంది. వీసాలకు అనుమతి లభించకపోవడంతో దొంగ మార్గంలో భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వారి ప్రయాణం విషాదాంతంగా మారింది. థార్ ఏడారిలో మైనర్ జంట విగతజీవులుగా మారారు.
వివరాల్లోకి వెళ్తే..
పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ (Sindh province)కు చెందిన 17 ఏళ్ల అబ్బాయి, 15 ఏళ్ల అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. భారత్ లో జీవనోపాధి పొంది సంతోషంగా జీవించాలని భావించారు. ఈ క్రమంలో బాలుడు వీసాకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. దీంతో ఆ జంట కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సరిహద్దుల్లోని థార్ ఎడారి గుండా భారత్ లోకి ప్రవేశించాలని సంకల్పించింది. ఇందుకు తగ్గట్లే పాక్ నుంచి బయలుదేరి అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొని భారత్ లోకి ప్రవేశించారు. రాజస్థాన్ జైసల్మేర్ లోని థార్ ఏడారిలోకి ప్రవేశించగలిగినప్పటికీ డీహైడ్రేషన్ కారణంగా.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
డీహైడ్రేషన్ కారణంగా..
జూన్ 28న థార్ ఏడారిలోని టానోట్ ప్రాంతంలో టీనేజర్ల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. బాలుడు సల్వార్, కుర్తా ధరించి ఉన్నాడని.. అతడి మృతదేహాం ఒక చెట్టుకింద కుళ్లిన స్థితిలో పడి ఉందని ఎస్పీ చౌదరి తెలిపారు. అతడి తల దగ్గర ఖాళీ జెర్రీ డబ్బా (చిన్నపాటి నీళ్ల డబ్బా) ఉందని చెప్పారు. దానితో పాటు పసుపు రంగు స్కార్ఫ్, మెుబైల్ ఫోన్ కూడా లభించినట్లు పేర్కొన్నారు. అబ్బాయి బాడీకి 50 అడుగుల దూరంలో బాలిక మృతదేహాం కనిపించిందని.. ఆమె పసుపు రంగు ఘాగ్రా కుర్తా వేసుకుందని అన్నారు. ఎరుపు, తెలుపు గాజులు ధరించినట్లు వివరించారు. రెండు మృతదేహాలు కుళ్లిపోవడంతో వారి ముఖాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని చెప్పారు. వారు చనిపోయి చాలా రోజులు అవుతున్నట్లు అర్థమవుతుందని ఎస్పీ చౌదరి చెప్పారు. వారి నుంచి పాకిస్థాన్ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
బంధువుల వద్దకు వస్తూ..
భారత్ లో పాక్ మైనర్ల మృతిపై దేశంలోని పాకిస్థాన్ మైనారిటీ వలసదారుల హక్కుల న్యాయవాద సమూహం స్పందించింది. సంఘటన్ జిల్లా ప్రతినిధి సీమంత్ లోక్ మాట్లాడుతూ ‘ఆ బాలుడు భారతీయ వీసా పొందాలన్న ఆశలు ఆవిరయ్యాయి. దీంతో తన భార్యతో కలిసి సరిహద్దు దాటాలని నిర్ణయించుకున్నాడు. ఏదో విధంగా భారత్ లోకి ప్రవేశించాడు కానీ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ మృతుల వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే బాలుడికి రాజస్థాన్ జైసల్మేర్ లో బంధువులు ఉన్నారని.. వారికి అతడి గుర్తింపు కార్డులను చూపించగా ధ్రువీకరించారని చెప్పుకొచ్చారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ వాళ్ళకి అంత బాధను మిగిల్చాడా.. గేమ్ ఛేంజర్ నిర్మాత సంచలన కామెంట్స్
కిలోమీటర్ల మేర నడక
బాలుడి బంధువుల కథనం ప్రకారం.. అతడు వేసుకొచ్చిన బైక్ మృతదేహాలకు 20 కిలోమీటర్ల దూరంలో కనుగొనబడింది. అంతేకాదు వారు పాక్ సరిహద్దుల నుంచి భారత్ లోకి 12-13 కిలోమీటర్ల మేర లోపలకి వచ్చేశారు. దీన్ని బట్టి చూస్తే వాళ్లు చాలా కిలో మీటర్లు ఎడారిలో నడిచినట్లు అర్థమవుతోంది. తమ వెంట తెచ్చుకున్న నీరు అయిపోవడంతో ఇద్దరూ పూర్తిగా డీహైడ్రెషన్ కు గురయ్యారని.. చివరికీ ప్రాణాలను సైతం కోల్పోయారని బాలుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దంపతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయినట్లు తెలుస్తోంది.