Watch Video: భూమి మీద నివసించే ప్రతీ జీవికి చెట్లతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. మనుషుల ప్రాణాలకు ఎంతో అవసరమైన ఆక్సిజన్ ను చెట్లు విడుదల చేస్తుంటాయి. అంతే కాదు వాతావరణంలో సమతౌల్యతను తీసుకొచ్చి.. వర్షాలు కురవడంలోనూ చెట్లు లేదా అడవులు ముఖ్య భూమిక పోషిస్తుంటాయి. నిత్యం మన చుట్టూ ఉండే చెట్ల గురించి చాలా విషయాలు మనకు తెలిసినప్పటికీ.. అంతుబట్టని విషయాలు కూడా ఉంటాయన్నది వాస్తవం. అయితే మనిషి లాగానే చెట్లు కూడా మూత్రం పోస్తాయంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. అది చూసి ప్రతీ ఒక్కరు షాకవుతున్నారు. అందులో నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం.
చెట్ల నుంచి ధారగా నీరు!
చెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో చెట్టు కొమ్మల నుంచి నీరు ధారగా కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మైదానాల్లో గడ్డిని పెంచేందుకు ఉపయోగించే స్పింక్లర్ వాటర్ సిస్టమ్ తరహాలో.. చెట్ల నుంచి నీటి జల్లులు రావడాన్ని వీడియోలో గమనించవచ్చు. సాధారణంగా చెట్లు నీటిని పీల్చుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా.. ఇలా బయటకు ధారలుగా వదలటం చాలా అరుదు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Why did I think this was a sprinkler system 😳 pic.twitter.com/Ey8c4pdLkR
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) June 28, 2025
మూత్రం పోస్తున్నాయా?
చెట్లు నీటిని విడుదల చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చెట్లు మూత్రం పోస్తున్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం మనుషుల్లాగే వాటికి కూడా అర్జంట్ గా వస్తుందేమో అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. మా ఇంటి వద్ద చెట్లు చాలానే ఉన్నాయిగానీ.. ఈ వింతను తానెప్పుడు చూడలేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాదు మరికొన్ని చెట్ల నుంచి కూడా నీరు ఇదే తరహాలో ధారగా వస్తున్న వీడియోలను సైతం పంచుకుంటున్నారు.
Also Read: Fire Accident: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. గాల్లోకి ఎగిరిపడ్డ జనాలు.. సీఎం విచారం!
వాస్తవం ఇదే!
చెట్టు లేదా దాని కొమ్మల నుంచి నీరు దారలుగా కారడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను వృక్షశాస్త్రం ప్రకారం గట్టేషన్ (Guttation) అని పిలుస్తారని స్పష్టం చేస్తున్నారు. ఆకులు లేదా కొమ్మల చివరల్లోని స్టోమాటా (stomata) లేదా హైడాథోడ్‌ల (hydathodes) ద్వారా చెట్లు ఇలా అదనపు నీటిని బయటకు విడుదల చేస్తాయని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియను గట్టేషన్ గా పిలుస్తారని వివరించారు. చెట్టు మూలాలు అధికంగా నీటిని గ్రహించినప్పుడు ఈ నీరు కాండం ద్వారా పైకి చేరి, ఆకులు లేదా కొమ్మల నుంచి (Root Pressure) బయటకు విడుదల అవుతాయి. పర్యావరణ మార్పులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల వల్ల కూడా కొమ్మలపై నీరు చేరి ధారలుగా కారవచ్చని వృక్ష శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి చెట్లు మూత్రం పోస్తున్నాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు.