Fire Accident: హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పటాను చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు.. 100 మీటర్ల దూరం వరకూ ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందం.. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించింది. బాధితులకు పటాన్ చెరులోని ధ్రువ, చందానగర్ లోని అర్చన ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తున్నారు.
భారీగా ప్రాణ నష్టం!
సీగాచి కెమికల్స్ పరిశ్రమల్లో చెలరేగిన మంటల్లో ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. తీవ్రంగా గాయపడిన 14 మందిని ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అధికారికంగా నిర్ధరణ కాలేదు. మంటలను రెండు ఫైరింజన్లతో ఆర్పుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్.. పరిస్థితులను పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా ఎగసిపడుతున్న మంటలు
పేలుడు ధాటికి ఎగిరిపడిన కార్మికులు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది కార్మికులు
పలువురి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక… pic.twitter.com/w5GBAUkY9e
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025
పరుగులు పెట్టిన జనం!
అయితే పేలుడు సమయంలో సీగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో 100-120 కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో వారిలో చాలా మంది ప్రాణ భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులుపెట్టినట్లు సమాచారం. పెద్ద శబ్దం రావడంతో కంపెనీకి చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు, మృతుల వివరాలను తర్వాత ప్రకటించే అవకాశముంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాక.. రియాక్టర్ పేలడానికి గల కారణాలను సైతం పోలీసులు అన్వేషించే అవకాశముంది.
Also Read: Shefali Jariwala Death: నటి మృతిపై ప్రియాంక చోప్రా షాకింగ్ రియాక్షన్.. చాలా చిన్నదంటూ!
సీఎం రేవంత్ విచారం
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరికొద్ది సేపట్లో ఘటనా స్థలిని పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.