Health Tips: పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు (బెల్లీ ఫ్యాట్) కరిగించడం ఒక ప్రసహనంలా మారిపోయింది. చాలామందికి పెద్ద ఫిట్‌నెస్ సవాలుగా మారింది. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చునేవారికి, అధిక ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో బెల్లీ ఫ్యాట్ పేరుకుపోతుంది. దీన్ని కరిగించేందుకు జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అంతకష్టపడ్డా ఫలితాలు అందుకోలేనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే, చాలామందిలో కనిపించే ఈ సమస్యను చాలా ఈజీగా, రోజుకు కేవలం 10 నిమిషాల శారీరక వ్యాయామం చేసి తగ్గించవచ్చని పాట్రిక్ హాంగ్ అనే వ్యాయామ నిపుణుడు చెబుతున్నాడు. ఈ మేరకు జూన్ 27న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో షేర్ చేశాడు. ఎలాంటి పరికరాలు లేకుండా రోజుకు 10 నిమిషాల సులభమైన వ్యాయామాలు చేస్తే సరిపోతుందని పేర్కొన్నాడు.
Read this- Prada Sandals: కాపీ కొట్టిన డిజైన్‌తో చెప్పులు.. రేటు తెలిస్తే గుండె గుభేలుమంటుంది ?
“ఈ వ్యాయామాలను పాటిస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతున్నట్టు మీరు గుర్తించలేరు. కానీ, క్రమంగా తగ్గుతుంది. సులభంగా ఉండే ఈ 10 నిమిషాల ఎక్సైజ్‌లు చేస్తే కేలరీలు బర్న్ అవుతాయి. కావాలంటే వెంటనే ఈ కోర్సును ప్రారంభించి మీరే గమనించండి’’ అని పాట్రిక్ అన్నాడు. వారానికి 3-4 సార్లు చేసినా సరిపోతుందని, సరైన ఆహారం తీసుకోవాలని సూచించాడు. ఈ విధానాన్ని ఆచరిస్తే సన్నగా, బలమైన శరీరాన్ని పొందే మార్గంలో ఉన్నట్టేనని ఆశాభావం వ్యక్తం చేశాడు.
చేయాల్సిన వ్యాయామాలు ఇదే
1. బాడీ వెయిట్ స్క్వాట్స్
బాడీ వెయిట్ స్క్వాట్స్ అంటే కూర్చుని, లేచే వ్యాయామం. కుర్చీలో కూర్చున్నట్టుగా శరీర బరువుని కిందకు వంచి పైకి లేవాలి. ఈ విధంగా రోజుకు 15 సార్లు చేయాలి.
2. జంపింగ్ జాక్‌లు
రక్తాన్ని పంపింగ్ చేయడానికి అత్యంత ముఖ్యమైన వ్యాయామం ఇది. కాళ్లను దగ్గరికి, దూరంగా ఉంచుతూ దూకుతూ, తదనుగుణంగా చేతులను కదల్చాలి. చేతులను తలపైన కలుపుతూ కాళ్లు దగ్గరకి తీసుకురావాలి. ఈ ప్రక్రియను 30 సెకన్లపాటు చేయాలి.
3. మౌంటేయిన్ క్లైంబర్స్
మెట్లు ఎక్కుతున్నట్టుగా చేతులు నేలపై పెట్టి, కాళ్లు చురుగ్గా ముందుకు, వెనక్కు కదిలిస్తూ చేసే వ్యాయామం ఇది. భుజాలు, కాళ్లను లక్ష్యంగా చేసే ఈ వ్యాయామంలో కేలరీలు బాగా బర్న్ అవుతాయి. ఈ వ్యాయామాన్ని 30 సెకన్లపాటు చేయాలి.
4. ప్లాంక్-టు-నీ ట్యాప్స్
చేతులు, కాళ్లతో నేలపై వాలి శరీరాన్ని వ్యాయామ స్థితిలో ఉంచే ప్రక్రియ ఇది. తల నుంచి కాళ్ల వరకు శరీరం స్ట్రెయిట్ లైన్‌లా ఉండేలా చూసుకోవాలి. మోకాలిని కదిలించి మోచేతితో తాకాలి. ఈ విధంగా రెండు వైపులా చేయాలి. తద్వారా కండరాలు బలపడుతాయి.
గమనిక: పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.