India Vs Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పర్యావసానాలతో భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ నటులను బహిష్కరించాలంటూ, దాయాది జట్టుతో ఇకపై క్రికెట్ సంబంధాలను కొనసాగించవద్దంటూ బలమైన డిమాండ్లు వినిపించాయి. వీటిపై పెద్ద చర్చే నడిచింది. ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్), ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడించవద్దంటూ బీసీసీఐకి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు అందాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025 (Asia Cup) నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కొత్త కథనాలు వెలువడుతున్నాయి.
Read this- RCB: పెళ్లి చేసుకుంటానంటూ అమ్మాయిని మోసం చేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను నిర్వహించేందుకు యోచిస్తోందని ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, యూఏఈ దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయని తెలిపింది. ‘‘అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం ఖరారు కానప్పటికీ, వచ్చే వారం నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జులై మొదటి వారంలోనే ఆరు జట్లతో కూడిన టోర్నమెంట్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తోంది’’ అని వివరించింది. టోర్నమెంట్ ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని, ఆతిథ్యానికి పోటీ పడే దేశాలలో యూఏఈ ముందంజలో ఉందని పేర్కొంది. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంపై కొంత చర్చ జరుగుతోందని ప్రస్తావించింది. నిజానికి, ఆసియా కప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏసీసీ కొత్త ఆతిథ్య దేశాన్ని అన్వేషించవచ్చని పేర్కొంది.
Read this- Pakistan: పాక్‌లో భారీ ఉగ్రదాడి.. ప్రకటన విడుదల చేసిన భారత్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలో ఉంది. కాబట్టి, వేదిక మార్పుపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆసియా కప్ రద్దు అయినా, లేక, వాయిదా పడిన ఆగస్టులో పాకిస్థాన్, యూఏఈ, ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి ముక్కోణపు సిరీస్ నిర్వహించాలని పీసీబీ భావిస్తున్నట్టు గతంలో కథనాలు వెలువడ్డాయి. ముందుగా ప్లాన్ చేసినట్టుగా ఇండియాలో ఆసియా కప్ నిర్వహించే అవకాశం లేదు కాబట్టి, ట్రై-సిరీస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు పీసీబీ వర్గాలు తెలిపాయి.
కాగా, లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ కవరేజ్ సందర్భంగా, ఆసియా కప్ 2025 ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక తరపున చరిత్ అసలంక, బంగ్లాదేశ్ నుంచి నజ్ముల్ హొస్సేన్ శాంటో కనిపించారు.
Read this article – Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్