Newton 4th law: ఇండియన్ సిలికాన్ సిటీగా పిలుచుకునే బెంగళూరు (Bangalore) నగరంలో ట్రాఫిక్ కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల దైనందిన జీవితాలను ట్రాఫిక్ ఇబ్బందులు నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. నగరవాసుల రోజువారీ జీవితంలో ట్రాఫిక్ వెతలు భాగమయ్యాయంటే అతిశయోక్తి కాదేమో. రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకొని చాలామంది ముఖ్యమైన పనులను సైతం సకాలంలో చక్కబెట్టుకోలేకపోతున్నారు. అలాంటివారు ట్రాఫిక్ కష్టాలను తిట్టుకొని ఊరుకుంటారు. కానీ, బెంగళూరు ట్రాఫిక్ నరకయాతనపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పెట్టిన ఓ పోస్టు తెగ వైరల్‌గా మారింది.
Read also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
నగరంలో ప్రఖ్యాత బ్రూక్‌ఫీల్డ్ సమీపంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న లలిత్ గౌర్ అనే ‘ఎక్స్’ యూజర్ ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ స్క్రీన్‌షాట్ తీసి తన ప్రయాణానికి పట్టే సమయం అంచనాను షేర్ చేశాడు. కేవలం 3.6 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 48 నిమిషాల సమయం పడుతుందని గూగుల్ మ్యాప్స్‌లో కనిపించింది. ఈ పోస్టుకు ‘న్యూటన్ నాలుగవ గమన నియమం: బెంగళూరులో ఆగివున్న ఆటో విశ్రాంతిలోనే ఉంటుంది’ అని లలిత్ గౌర్ క్యాప్షన్ ఇచ్చాడు. వ్యంగ్యంగా అతడు ఇచ్చిన ఈ క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. పలువురు హాస్యాస్పద కామెంట్లు చేయగా, మరికొందరు తమకు ఎదురైన ట్రాఫిక్ అనుభవాలను పంచుకున్నారు.
Read also- Shefali Jariwala: పాపం.. సింగర్ షెఫాలికి ఆ వ్యాధి ఉంది.. స్వయంగా ఆమె చెప్పారు
19 కిలోమీటర్లు.. 50 నిమిషాలు
లలిత్ గౌర్ పోస్ట్‌పై స్పందించిన ఓ నెటిజన్, తన ప్రయాణ కష్టాలను వెల్లడించాడు. ‘19 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఆఫీసుకు కారులో వెళ్లడానికి ఏకంగా 50 నిమిషాలు పట్టింది’ అని వాపోయాడు. మరొకరు స్పందిస్తూ, ‘బెంగళూరు ట్రాఫిక్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవు’’ అని వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి మరింత హాస్యాస్పదంగా స్పందించాడు. ‘‘పిచ్చెకించే విషయం ఇది. ఒక ఇంటర్వ్యూయర్ ఎవరైనా, రాబోయే 5 ఏళ్లలో మిమ్మల్ని మీరు ఏ స్థాయిలో ఊహించుకుంటున్నారు? అని నన్ను అడిగితే.. బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉంటానని చెబుతా’’ అని కామెంట్ చేశాడు. ప్రయాణం మొదలుపెడితే గమ్యస్థానానికి ఏ సమయంలో చేరుకుంటామో అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని చాలామంది వాపోయారు. ఒక యూజర్ స్పందిస్తూ, ‘‘3.6 కిలోమీటర్ల దూరానికి 48 నిమిషాల సమయం పడుతోందా?. ఓరి దేవుడా!. నేను ఉన్న చోట కేవలం 2-3 నిమిషాలు మాత్రమే సరిపోతుంది’’ అని పేర్కొన్నాడు.
Read also- Trending News: ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిన 6 ఏళ్ల బాలుడు.. అతడి బ్యాగులో..
ఎక్స్‌లో ఈ పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో మరోసారి తేటతెల్లమైంది. కాగా, నగరంలోని బ్రూక్‌ఫీల్డ్-సిల్క్ బోర్డ్-ఎలక్ట్రానిక్ సిటీ బెల్ట్‌లో ట్రాఫిక్ కష్టాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. రోజువారీ ఉక్కిరిబిక్కిరి అవుతుందంటే అతిశయోక్తికాదు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనాదారులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ప్రయాణానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తోంది.