Trending News: మారిషస్‌లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సుమారు రూ.14 కోట్లు విలువైన మాదకద్రవ్యాల పట్టివేతలో (Trending News) అనూహ్యంగా ఓ ఆరేళ్ల బాలుడు పట్టుబడ్డాడు. గత ఆదివారం లండన్ గాట్విక్ నుంచి మారిషస్‌లోని ‘సర్ సీవూసాగర్ రామ్‌గూలం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’కు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో డ్రగ్స్ తీసుకొచ్చిన ఆరుగురు వ్యక్తులు అడ్డంగా దొరికారు. వీరిలో ఐదుగురు బ్రిటిష్ పౌరులు, ఒక రొమేనియాకు చెందిన వ్యక్తితో పాటు బాలుడిని (బ్రిటిష్) కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
161 కేజీల గంజాయి పట్టివేత
మానవ అక్రమ రవాణా నిరోధక ఆపరేషన్‌లో భాగంగా ఎయిర్‌పోర్టులో స్నిఫర్ డాగ్స్‌తో కస్టమ్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తుండగా ఈ భారీ డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ ముఠా సూట్‌కేసుల్లో ఏకంగా 161 కేజీల గంజాయిని దాచివుంచినట్టు అధికారులు గుర్తించారు. ఆశ్చర్యకరంగా, ఆరేళ్ల బాలుడి లగేజీలో సుమారుగా 14 కేజీల గంజాయి ఉన్న 24 ప్యాకెట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బాలుడి తల్లి (35 ఏళ్లు) బ్యాగులో 29 ప్యాకెట్లు, ఆమె దందా భాగస్వామి ( రొమేనియా పౌరుడు) లగేజీలో 32 ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. స్థానిక మార్కెట్లో ఈ మాదకద్రవ్యాల విలువ సుమారుగా 1.6 మిలియన్ యూరోలుగా (దాదాపు రూ.14 కోట్లు) అక్కడి అధికారులు లెక్కగట్టారు.
Read Also- Viral News: నడిరోడ్డుపై పోలీసులకు చెమటలు పట్టించిన ముసలావిడ.. వీడియో ఇదిగో
మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ ఆరుగురిని (పెద్దవాళ్లు) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేబర్గ్‌లోని ఒక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిపై మాదకద్రవ్య నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, నిందితులంతా పోలీసుల కస్టడీలోనే ఉండాల్సి వచ్చింది. ఆరుగురిలో ఐదుగురు మహిళలు, ఒకే ఒక్క మగ వ్యక్తి ఉన్నారు. పురుష వ్యక్తి రొమేనియాకు చెందినవాడు కాగా, మిగతావారంతా బ్రిటీష్‌కు చెందినవారే కావడం గమనార్హం.
యూకే తిరిగి వెళ్లిన బాలుడు
చిన్న పిల్లాడు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డాడనే వార్త సంచలనం సృష్టించింది. అతడి యోగక్షేమాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో, మారిషస్‌లోని బ్రిటిష్ హైకమిషన్ వెంటనే రంగంలోకి దిగింది. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి బాలుడిని సురక్షితంగా తిరిగి యూకేకి పంపించింది. ఏర్పాట్లన్నీ చేసి బుధవారం ఒక విమానంలో పంపించారు. బాలుడి తండ్రి వచ్చి ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నారు. బాలుడి వయసు ఆరు లేదా ఏడు సంవత్సరాలని పలు కథనాలు పేర్కొన్నాయి.
Read Also- Jeff Bezos Wedding: 61 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి బెజోస్
ఈ ఘటనపై యూకే విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఒకరు స్పందించారు. మారిషస్‌లో అరెస్ట్ అయిన బ్రిటిష్ పౌరులకు సంబంధించి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సాయంగా నిలుస్తున్నామని తెలిపారు. చిన్న పిల్లలను మాధక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించడం ‘అమానవీయం’ అని సదరు అధికారి ఖండించారు. బీఏ 2065 ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే ఆ బృందాన్ని కస్టమ్స్, పోలీసు అధికారులు పరిశీలించారని, సామాన్లు ఎక్స్-రే ద్వారా పరిశీలించగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయని వివరించారు. అంతర్జాతీయ స్థాయి స్మగ్లింగ్‌లో మైనర్‌ను వాడుకోవడాన్ని మారిషస్ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. మాదకద్రవ్యాల ప్యాకెట్లలో ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌లు గుర్తించామని, టెక్నాలజీని ఉపయోగించి కళ్లుగప్పాలని చూశారని పేర్కొన్నారు.