Shefali Jariwala: దాదాపు 23 ఏళ్ల క్రితం ‘కాంటా లగా’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో సంచలన రీతిలో దేశాన్ని ఒక ఊపుఊపిన ప్రముఖ పాప్ సింగర్ షెఫాలి జరివాలా (42) (Shefali Jariwala) కన్నుమూశారు. జూన్ 27న రాత్రి ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి గుర్తించిన వెంటనే షెఫాలిని ఆసుపత్రికి తరలించారు. కానీ, హాస్పిటల్‌కు చేరుకునే సరికే ఆమె ఊపిరిపోయింది. దీంతో, వైద్యులు నిస్సహాయులుగా మిగిలారు. షెఫాలి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె అకాల మరణం చాలామంది సినీ పరిశ్రమ ప్రముఖులను, ఫ్యాన్స్‌ను పెద్ద షాక్‌కు గురిచేసింది. చాలామంది సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. 2000 దశకం ఆరంభంలో ‘కాంటా లగా’ పాటతో ప్రతి ఒక్కరి చూపు తనవైపు తిప్పుకున్నారని గుర్తుచేసుకున్నారు.
షెఫాలి ఏం చెప్పారంటే?
షెఫాలి జరివాలా ‘బిగ్ బాస్ సీజన్ 13’లో (హిందీ) కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆ షో సమయంలో తన మానసిక ఆరోగ్యం గురించి ఆమె మాట్లాడారు. ఒత్తిడి, ఆందోళనలను తాను ఎదుర్కొన్నానని ఆమె వివరించారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నానని ఆ సమయంలో విచారం వ్యక్తం చేశారు. మూర్ఛ వ్యాధి తన కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఏవిధంగా ప్రభావితం చేసిందో ఆమె వివరించారు. ఒత్తిడి కారణంగా 15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధి బారిన పడి బాధపడ్డానని అన్నారు. సామాజిక జీవితాన్ని, విద్య, తన పనితీరును ఈ వ్యాధి ప్రభావితం చేసిందని వాపోయారు. ముఖ్యంగా, ‘కాంటా లగా’ ఆల్బమ్ సక్సెస్ తర్వాత కెరీర్ ప్రారంభ దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మూర్ఛను నియంత్రించేందుకు చాలా పాట్లు పడ్డానని, ఎన్నో ఇబ్బందికర అనుభవాలను ఎదుర్కొన్నానని వివరించారు.
మూర్ఛ అంటే ఏమిటి?
మూర్ఛ అనేది దీర్ఘకాలిక మెదడు వ్యాధి. ఒక వ్యక్తి మెదడులో అసాధారణ ఎలక్ట్రికల్ యాక్టివిటీ సంభవించినప్పుడు మూర్ఛ వస్తుంది. మూర్ఛ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మెదడు కొద్దిసేపు పట్టేస్తుంది (seizures). దీంతో, కొద్దిసమయం పాటు ఆ వ్యక్తి ప్రవర్తన, ఆలోచనలు మారిపోతాయి. గాయం లేదా జ్వరం కారణంగా ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు మూర్ఛలకు గురైతే అది మూర్ఛ వ్యాధిగా నిర్ధారిస్తారు. మూర్ఛ వచ్చినప్పుడు వ్యక్తులు అచేతనంగా పడిపోవడం, శరీరం కొట్టుకోవడం, శ్వాస ఆగిపోవడం లేదా నెమ్మదించడం, కళ్లు స్పష్టంగా కనిపించకపోవడం, ఒకే బిందువును చూడగలగడం, జ్ఞాపకశక్తి తాత్కాలికంగా తగ్గిపోవడం, అయోమయానికి గురవ్వడం, వింత అరుపులు అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.