Rajnath Singh: చైనా వేదికగా ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించబోదని, ఉగ్రవాద స్వర్గధామాలపై తిరిగి దాడి చేయడానికైనా ఏమాత్రం వెనుకాడబోమని తీవ్రంగా హెచ్చరించింది. చైనాలోని కింగ్‌డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఈ మేరకు గట్టి హెచ్చరికలు చేశారు. ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదానికి, సీమాంతర తీవ్రవాదానికి వ్యతిరేకంగా సభ్య దేశాలు ఐక్యంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల చేతుల్లో విధ్వంసక ఆయుధాలు ఉన్నంతవరకు శాంతి, అభివృద్ధి సాధ్యంకాబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఉగ్రవాదుల స్వర్గధామాలు సైతం ఇకపై సురక్షితం కాబోవని మేము నిరూపించాం. తిరిగి లక్ష్యంగా చేసుకునేందుకైనా వెనుకాడబోము’’ అని ఆయన హెచ్చరించారు.
ఇటీవలి జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారత్ స్పందనపై షాంఘై సహకార సంస్థ సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తీరు చూస్తుంటే దీని వెనుక లష్కరే తోయిబా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ దాడికి ప్రతిస్పందనగా, మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి సరిహద్దు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం’’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్, తనను తాను రక్షించుకునే హక్కును ఉపయోగించుకుందని అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని సమర్థించే దేశాలను జవాబుదారీగా నిలబెట్టాలని పరోక్షంగా దాయాది దేశంపై మండిపడ్డారు. సరిహద్దు ఉగ్రవాదానికి పురిగొల్పినవారిని, మద్దతు ఇచ్చినవారిని, ఆర్థిక సాయం చేసినవారిని మనం చట్టం ముందు నిలబెట్టాలని ఆయన సూచించారు. ఉగ్రవాదం వంటి సమస్యను ఏ దేశమూ ముప్పులను ఒంటరిగా ఎదుర్కోలేదని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అందుకే, షాంఘై సహకార సంస్థ దేశాలు బలమైన సహకారాన్ని అందించుకోవాలని పిలుపునిచ్చారు.
Read this- Team India: రెండవ టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్
సంతకం చేయబోను..
సమావేశం ముగిసిన తర్వాత రూపొందించిన ‘జాయింట్ డాక్యుమెంట్’పై సంతకం చేసేందుకు రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు. డాక్యుమెంట్‌లో పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై తన మాటల ప్రస్తావన లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని స్పష్టంగా ప్రతిబింబించడంలో విఫలమైంది. పైగా, బలోచిస్థాన్ అంశంలో భారత్‌పై నింద వేసే ప్రయత్నం చేశారు. అందుకే, ఈ డాక్యుమెంట్‌పై రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేయలేదు. దీంతో, సంయుక్త ప్రకటనను రద్దు చేశారు. తీవ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న ఆ డాక్యుమెంట్‌పై సంతకం చేయబోనని చెప్పారు. ఈ వ్యవహారంపై సదస్సులో విభిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో, రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. కీలకమైన ఈ సదస్సుకు భారత్, పాకిస్థాన్, చైనాతో పాటు పది సభ్య దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యారు. జాయింట్ డాక్యుమెంట్‌లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావనను ఉద్దేశపూర్వకంగానే మినహాయించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, 2020లో గల్వార్ ఘర్షణ తర్వాత నుంచి భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంస్థలో బెలారస్, చైనా, భారత్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.
Read this- Shubhanshu Shukla: శుభాంశు చరిత్ర.. అంతరిక్ష కేంద్రంలో అడుగు