Rangareddy District: రైల్వే ట్రాక్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం రైళ్ల రాకపోకలతో రైలు పట్టాలు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. దీంతో చాలా మంది పట్టాలపై నడిచేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఏ ట్రైన్ ఎప్పుడు వచ్చి ఢీ కొడుతుందోనన్న భయంతో.. అసలు ట్రాక్ మీదకే ఎక్కరు. అటువంటిది ఓ మహిళ ఏకంగా పట్టాలపై కారు నడిపి అందరినీ షాక్ గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని కొండకల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో ఓ కారు రైల్వే గేట్ క్రాసింగ్ ను దాటుకొని పట్టాలపైకి ఎక్కింది. దీంతో రైల్వే గేట్ వద్ద ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ప్రమాదవశాత్తు జరిగిందేమోనని వారంతా భావించారు. కానీ, ఆ కారు అంతటితో ఆగకుండా రైల్వే పట్టాల మీద నుంచి ముందుకు సాగడం ప్రారంభించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు.
రైల్వే ట్రాక్ పై దూసుకెళ్లిన కారు
రంగారెడ్డి జిల్లా కొండకల్లో వింత ఘటన
ఉదయం 7 గంటలకు రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా పట్టాలు ఎక్కి ఒక్కసారిగా దూసుకెళ్లిన కియా కారు
కొండకల్ నుంచి శంకర్పల్లి వరకు రైల్వే ట్రాక్ పైనే వెళ్లిన కారు
గమనించి కారును అడ్డుకున్న రైల్వే సిబ్బంది
కారు… pic.twitter.com/CxNwiETIWz
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025
కారులో యువతిని చూసి షాక్
కొండకల్ గ్రామం నుంచి శంకర్ పల్లి వరకూ పట్టాలపై నుంచే కారు ప్రయాణించింది. ఇది గమనించిన రైల్వే సిబ్బంది.. వెంటనే కారును అడ్డుకున్నారు. కారులో ఎవరు ఉన్నారని చూడగా.. అందులో మహిళ ఉండటాన్ని గమనించి రైల్వే సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతిని కారులో నుంచి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు 20మంది కలిసి ఆమెను బలవంతంగా కారులో నుంచి దించాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు.
రైల్వే ఎస్పీ స్పందన ఇదే
పట్టాలపై యువతి కారు నడిపిన ఘటనపై రైల్వే ఎస్పీ చందన దీప్తి స్పందించారు. ఆమెను యూపీకి చెందిన మహిళగా గుర్తించినట్లు చెప్పారు. నిందితురాలు లైసెన్స్, పాన్ కార్డులను పరిశీలించామని తెలిపారు. యువతి మానసిక స్థితి సరిగా లేదని స్పష్టం చేశారు. అయితే ఆత్మహత్య చేసుకోవడం కోసం ఆమె పట్టాలపై కారులో ప్రయాణించిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మహిళ పట్టాలపై హల్ చల్ చేసిన నేపథ్యంలో దాదాపు 10-15 ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
Also Read: Mini Godowns: ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోదాముల బాధ్యతలు!
సినిమాల్లో మాత్రమే..
సాధారణంగా రైల్వే ట్రాక్ పై వాహనాలు నడవటాన్ని.. సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగా హీరోలు.. రైల్వే ట్రాక్ పై వాహనంలో ప్రయాణించి.. విలన్ ను ఛేజ్ చేస్తుంటారు. కొన్ని చిత్రాల్లో హీరోను పట్టుకునేందుకు విలన్ మనుషులు సైతం రైల్వే ట్రాక్ పై కార్లు నడుపుతుంటారు. కానీ నిజ జీవితంలో ఆ తరహా ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యువతి కారు నడుపుతున్న సమయంలో ఎదురుగా రైలు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.