Astrazeneca: కొవిడ్ టీకాపై మరోసారి ఆందోళనకర చర్చలు మొదలయ్యాయి. తమ టీకా దుష్ప్రభావాన్ని కలిగించే ఛాన్స్ ఉన్నదని కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించిన తర్వాత తాజాగా మరో సంచలన ప్రకటన బయటికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తమ కొవిడ్ టీకాను ఉపసంహరించుకుంటున్నట్టు యూకేకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా బుధవారం వెల్లడించింది. అదే సమయంలో ఆ టీకాను ఉపసంహరించుకోవడానికి గల కారణాన్ని కూడా తెలిపింది. వాణిజ్య కారణాలతో టీకాను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ఈ మహమ్మారి ప్రబలినప్పుడు ‘వుహాన్’ నుంచి వచ్చిన వైరస్‌కు విరుగుడుగా తమ టీకాను తెచ్చామని, కానీ, ఇప్పుడు రూపాంతరం చెందిన ఈ వైరస్‌కు తగినట్టుగా అప్‌డేటెడ్ వ్యాక్సిన్‌లు సరిపడా అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఈ కారణంగా తమ టీకాకు డిమాండ్ పడిపోయిందని, అందుకే తమ టీకా తయారీ లేదా పంపిణీ జరగడం లేదని తెలిపింది.
యూకే సహా అంతర్జాతీయంగా తమ టీకా మార్కెటింగ్ అనుమతులను రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. టీకా ఉపసంహరణకు మార్చి 5న దరఖాస్తు చేసుకుంది. ఈ నిర్ణయం మే 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు ‘ది టెలిగ్రాఫ్’ రిపోర్ట్ చేసింది. ఇప్పుడు పెద్దగా వాడకంలో లేని టీకాలను ఉపసంహరించుకునే నిర్ణయాలను తాము ముందుగానే అంచనా వేశామని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీలో వ్యాక్సిన్స్ హెడ్ మార్కో కావలేరి తెలిపారు. ఒరిజినల్ కొవిడ్ 19 స్ట్రెయిన్ (వుహాన్ వైరస్)ను డీల్ చేసే మోనోవలెంట్ వ్యాక్సిన్ల ఉపసంహరణ ఉంటుందని తాము ముందే ఊహించామని వివరించారు.
Also Read: బండి విజయం కన్ఫామ్.. రాజన్న దర్శనం నా అదృష్టం
ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కొవిడ్ టీకాను డెవలప్ చేశాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. కొవిషీల్డ్‌గా మన దేశ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
ఇటీవలే ఆస్ట్రాజెనెకా ఓ కోర్టులో వెల్లడించిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనే చాలా మంది టీకా వేసుకోవడానికి అయిష్టత చూపారు. ఈ టీకాతో వేరే సమస్యలు తలెత్తుతాయేమోనని భయపడ్డారు. ఆ తర్వాత మహమ్మారి పలుచబడ్డ తర్వాత పలుచోట్ల ఆకస్మిక మరణాలు ఆందోళనలు కలిగించాయి. ఇవి టీకా దుష్ఫలితాలేననే వాదనలు బలంగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యూకే కోర్టులో ఆస్ట్రాజెనెకా టీకాపై విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది. చివరకు కోర్టులో ఆస్ట్రాజెనెకా తమ టీకాతో అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడే ముప్పు ఉన్నదని వెల్లడించింది. చాలా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసిస్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్‌కు కారణం కావొచ్చని అంగీకరించింది. ఈ అంశానికి వ్యాక్సిన్ ఉపసంహరణకు సంబంధం లేదని ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ఉపసంహరణ నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నట్టు తెలుస్తున్నది.