Bandi Sanjay: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వేములవాడ వెళ్లిన మోదీ.. నేరుగా రాజరాజేశ్వర ఆలయం చేరుకున్నారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చిన ఆయన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టం అని అన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి మోదీ వేములవాడ సభలో మాట్లాడారు.
ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడుతూ ప్రారంభించారు. ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘రాజరాజేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం నా అదృష్టం’ అని అన్నారు. మూడో విడత పోలింగ్‌లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయిందని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం కన్ఫామ్ అని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ అత్తాపత్తా లేదని, కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని అన్నారు. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద మొత్తంలో జనం తరలిరావడం సంతోషం అని, వచ్చిన ప్రతి ఒక్కరికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీకి వేసిన ఓటుతో దేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచామని, 360 అధికరణాన్ని రద్దు చేశామని, రక్షణ ఆయుధాలను దిగుమతి చేసుకునే దశ నుంచి ఎగుమతి చేసే స్థితికి ఎదిగామని మోదీ తెలిపారు. బీజేపీకి దేశమే తొలి ప్రాధాన్యత అని, అదే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత అని చెప్పారు. ఈ కుటుంబ పార్టీల నుంచి తెలంగాణను రక్షించాలని సూచించారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసం ఏమీ చేయలేదని, కుటుంబ ప్రయోజనాల కోసమే పని చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కుటుంబం కోసమే సంపాదించుకుందని తెలిపారు. దేశం కోసం ఎంతో పని చేసిన పీవీ నరసింహరావును కాంగ్రెస్ దారుణంగా అవమానిస్తే.. తాను భారత రత్ని పురస్కారం అందించామని వివరించారు. మూడు తరాల పీవీ కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
Also Read: Sanju Samson: సంజూ బ్యాడ్ లక్
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కుంభకోణాల్లో తేడా ఏమీ లేదని, అవి రెండు తోడుదొంగలని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజుకు ఇస్తున్నారని అన్నారు. తమ పార్టీ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినట్టుగా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నదని, రిజర్వేషన్లను చీల్చి కాంగ్రెస్ లబ్ది పొందాలని చూస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను చీల్చి ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ అభ్యర్థులను గెలిపించి తనను సంతృప్తి పరచాలని కోరారు.
మోదీ.. ఆరడుగుల బుల్లెట్
ఇదే జనసభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ ఆరడుగుల బుల్లెట్ అని స్తుతించారు. నరేంద్ర మోదీ మేడిన్ ఇండియా అని, రాహుల్, సోనియా గాంధీలు నాన్ లోకల్ అని ఆరోపణలు చేశారు. మోదీ పదవి అయిపోగానే జబ్బకి బ్యాగ్ వేసుకుని బయటికి వచ్చేంత గొప్పవాడని అన్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధాని మోదీనే అని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.