Shilpa Layout Phase-2 Flyover: విశ్వ నగరం విలువైన ప్రయాణం ఒకప్పుడు ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయి ప్రయాణికులకు నరకం చూపిన హైదరాబాద్ (Hyderabad) నగరం, ఇప్పుడు విశ్వనగరం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులైన అత్యాధునిక రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, స్కై వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మెట్రో రైలు (Metro train) విస్తరణతో పాటు పటిష్టమైన శాంతిభద్రతలు, కార్పొరేట్ పరిశ్రమలకు స్వర్గధామంగా మారడంతో నగర ప్రయాణం మరింత సులభతరం, వేగవంతంగా మారింది. ముఖ్యంగా కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల కారణంగా వాహనదారులు ఎలాంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు, ఇది నగరవాసులకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్నది.!
హైదరాబాద్ ( Hyderabad) ఐటీ కారిడార్‌లో అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి కొండాపూర్ (Kondapur) మార్గంలో ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే తెరపడనుంది. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన శిల్పా లేఅవుట్ ఫేజ్–-2 (పీజేఆర్) ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దీన్ని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే (Gachibowli) గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Child Protection Wing: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో.. 15 మంది అరెస్ట్!
ప్రాజెక్టు వివరాలు
రూ. 182.72 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ సుమారు 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడో స్థాయి ఫ్లైఓవర్. కింద (Gachibowli) గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్-–1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్-–2 ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 29 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించారు. వీటిలో 6 ఆస్తుల స్థలాలను జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయం సేకరించగా, మిగిలిన 23 ఆస్తుల నుంచి స్థానిక సర్కిల్, జోనల్ అధికారులు సేకరించారు. మూడు ఆస్తుల సేకరణకు రూ. 5.48 కోట్లు, మరో మూడు ఆస్తులకు రూ. 4.80 కోట్లను నష్టపరిహారంగా చెల్లించగా, మిగిలిన ఆస్తులకు జోనల్ స్థాయిలో నష్టపరిహారాలు చెల్లించారు. మరో మూడు ఆస్తులకు ఇంకా నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని సమాచారం.
మెరుగైన కనెక్టివిటీ..
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్, (Kondapur) హఫీజ్‌పేట్ (Hafizpet) మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఈ ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణ సమయం ఆదాతో పాటు, గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే సౌకర్యం ఈ ఫ్లైఓవర్‌తో లభిస్తుంది. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్ట్, అక్కడి నుంచి కొండాపూర్ (Kondapur) ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.
మాజీ కమిషనర్ ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ (RV Karnan) ఆర్‌వీ కర్ణన్‌లు ఈ ఫ్లైఓవర్ పనులను తరచుగా పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు గడువులను విధించడంతో నిర్మాణం వేగంగా పూర్తైంది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా అన్ని రకాల పనులు పూర్తి చేసి, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో హైదరాబాద్ (Hyderabad) మౌలిక సదుపాయాల అభివృద్ధి మరో అడుగు ముందుకు పడినట్టవుతుంది. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా మొత్తం 42 పనులను ప్రతిపాదించి, ఆమోదించగా, ఈ ఫ్లైఓవర్ పూర్తయితే మొత్తం 37 ప్రాజెక్టులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
Also Read: UK Ex PM Tony Blair Praises: రేవంత్ రెడ్డి విజన్ భేష్.. యూకే మాజీ పీఎం ప్రశంసలు!