Indus Water Treaty: జమ్మూ కశ్మీర్‌లోని ‘పహల్గామ్ ఉగ్రదాడి నరమేధానికి’ ప్రతీకారంగా, భారత్-పాకిస్థాన్ మధ్య దశాబ్దాలపాటు కొనసాగిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో దాయాది దేశం చుక్కలు చూస్తోంది. సింధు నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కాలువలు, రిజర్వాయర్ల నుంచి పాకిస్థాన్ వైపే వెళ్లే నీటి వాటా గణనీయంగా పడిపోయింది. దీంతో, పాక్‌లో ఖరీఫ్ కోసం విత్తనాలు నాటే ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటోంది. కొన్ని చోట్ల మొలకలు రావడం లేదు. మరికొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వమే ప్రకటించింది.
పాకిస్థాన్ సింధు నదీ వ్యవస్థ అథారిటీ ‘డైలీ వాటర్ సిచ్యువేషన్’ రిపోర్టును ఆ దేశ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ 2025 జూన్ 16న (సోమవారం) సింధు నది వ్యవస్థ నుంచి పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు 1.33 లక్షల క్యూసెక్కుల జలాలు మాత్రమే వచ్చాయని వెల్లడించింది. గతేడాది ఇదే రోజున 1.6 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయని, క్రితం ఏడాదితో పోల్చితే 16.87 శాతం తక్కువని వాపోయింది. పంజాబ్ ప్రావిన్స్‌కు రావాల్సిన నీరు కూడా కొంతమేర తగ్గిందని విచారం వ్యక్తం చేసింది. నిరుడు 1.29 లక్షల క్యూసెక్కుల నీరు రాగా, ఈ ఏడాది జూన్ 16న 1.26 లక్షల క్యూసెక్కులకు జలాలు తగ్గాయని వివరించింది. మొత్తంగా 2.25 శాతం మేర నీళ్లు తగ్గాయని రిపోర్టులో పేర్కొంది.
Read this- Iran-Israel Conflict: అక్కడి నుంచి వెళ్లిపోండి.. భారతీయులకు కీలక అడ్వైజరీ
ఖరీఫ్ పంటల విత్తనాలు విత్తే సమయంలో పాకిస్థాన్‌లోని సింధు నది వ్యవస్థకు అనుసంధానమై ఉన్న జలాశయాలలో నీరు చాలా తక్కువగా ఉందని రిపోర్ట్ పేర్కొంది. ఈ పరిణామం దేశంలోని రైతులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోందని వివరించింది. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి ఇంకా కనీసం రెండు వారాల సమయం పడుతుందని, దీంతో, సాగు సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పాక్‌కు వరదల ముప్పు!
సింధునదీ అనుసంధానిత జలాశయాల్లో నీరు తక్కువగా ఉందని గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్‌కు వరదల ముప్పు కూడా పొంచివుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసినప్పటి నుంచి నదుల నీటి మట్టాలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌తో భారత్ పంచుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన డేటాను విడుదల కూడా చేయండి. కాబట్టి, మన దేశంలోని సింధు నదీ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న నదుల నీటి మట్టాలు పెరిగినప్పుడు, ఆటోమెటిక్‌గా దిగువన ఉన్న పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది. వరదలు ఎప్పుడొస్తాయో పాకిస్థాన్‌కు అవగాహన ఉండదు కాబట్టి ఎల్లప్పుడు సన్నద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read this- Telangana Jagruthi Medak: బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత సంచలన కామెంట్స్
సింధు జలాల ఒప్పందం ఏమిటి?
భారత్, పాకిస్థాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. ప్రపంచ బ్యాంక్ దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ఇరు దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం సజావుగా అమలైంది. అయితే, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల నరమేధం తర్వాత కీలకమైన ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా సింధు నదీ వ్యవస్థలోని మూడు తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లపై భారత్‌కు సంపూర్ణ హక్కు ఉండేది. భారత్ నుంచి దిగువన ఉన్న పాకిస్థాన్‌కు ప్రవహించే మూడు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లపై దాయాది దేశానికి హక్కు ఉంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ సుమారుగా 135 మిలియన్ ఎకరాల అడుగుల (MAF) జలాలను పొందింది. ఈ జలాలన్నీ భారతదేశం నుంచే ప్రవహిస్తాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, ‘రక్తం, నీరు కలిసి ప్రవహించడం కుదరదు’ అంటూ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.