Chevireddy: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) వంతు వచ్చేసింది. మంగళవారం నాడు బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చెవిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చెవిరెడ్డి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద ఆయన్ను అడ్డుకుని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో చెవిరెడ్డి పాత్ర ఉందని సిట్ (Special Investigation Team) తేల్చడంతో నోటీసులు జారీ చేయడం జరిగింది. వాస్తవానికి.. పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇటీవల ప్రకాశం జిల్లాలోని పొదిలిలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి కూడా చెవిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి కేసులో అరెస్టయిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి చెవిరెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, సీఐ వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో అడ్డుకున్న తర్వాత, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బెంగళూరు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో చెవిరెడ్డి గన్‌మెన్ ఏఆర్ మదన్ రెడ్డిని (Madhan Reddy) ఇప్పటికే అధికారులు విచారించారు. మదన్ సిట్ అధికారులపై కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశారు.

భారీ కుట్ర!
లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇరికించేందుకు భారీ కుట్ర జరుగుతోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి (Manohar Reddy) ఆరోపించారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి దగ్గర గతంలో గన్‌మెన్‌గా పని చేసిన మదన్‌ను దారుణంగా హింసించారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారన్నారు. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్‌మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ మదన్‌ని చిత్రహింసలు పెట్టారని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. మదన్ 10 ఏళ్లు చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు మదన్‌పై ఒత్తిడి తెచ్చారని.. ఆయన మొహం మీద, వీపు మీద పిడిగుద్దులు గుద్దినట్లుగా మనోహర్ వెల్లడించారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారని.. సిట్ అధికారుల హింస వల్ల మదన్ ఆరు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారని చెప్పారు. ఈ చిత్రహింసలపై మదన్.. సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీకి లేఖ కూడా రాశారన్నారు. ఆ లేఖలో వివరాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయని.. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లబోతున్నట్లు మనోహర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. మరోవైపు.. సిట్ వేధింపులపై మదన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సిట్ అధికారుల నుంచి రక్షణ కల్పించాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. 68వ కేసుగా విచారించనున్నది.
Read Also- Banakacherla: తెలంగాణ నేతలకు గట్టిగా ఇచ్చిపడేసిన నిమ్మల