Banakacherla: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్రంగా స్పందించారు. ఏది పడితే అది మాట్లాడొద్దని.. ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. బనకచర్లపై తెలంగాణ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ గత 50 ఏళ్లుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచర్లకు తరలించాలని అనుకున్నాం. మూడు సెగ్మెంట్‌లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు (1).. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు సెగ్మెంట్ (2) వరకు.. బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు సెగ్మెంట్ (3) ఇలా మూడు సెగ్మెంట్‌లలో నిర్మాణం జరుగుతుంది. బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాలు కోసమే. సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారు’ అని నిమ్మల స్పష్టం చేశారు.
Read Also- Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ ఏం తేల్చుకుంటారో?
ఎవరికేం నష్టం లేదు!
‘ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అసత్యాలు చెబుతున్నారు. అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకొని నిర్మాణం జరుపుతాం. సీడబ్ల్యూసీకి ఇప్పటికే ప్రాధమిక నివేదిక కూడా ఇచ్చాం. ఆమోదం లేకుండా డీపీఆర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక నివేదిక ఆమోదం తెలిపాక డీపీఆర్ ఇస్తాం. పోలవరం, బనకచర్ల అనుమతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. ఏపీ జలదోపిడి అని చెబుతున్నారు. వరద జలాలు ఉపయోగించుకోవడం హక్కు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు ఉంటాయి. నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాలు ఉపయోగిస్తున్నాం. తద్వారా ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదు. ప్రతి ఏడాది 3వేల టీఎంసీ నీరు సముద్రంలోకి పోతోంది. ఒక ఏడాది 7వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయింది. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాకుండానే సముద్రంలోకి నీరు వృథాగా పోతోంది’ అని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి వరద నీటిని దేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం వంటి జిల్లాలకు తరలించడం ద్వారా నీటి కష్టాలను తీర్చడానికి ఉద్దేశించబడిందని నిమ్మల చెప్పారు.
Read Also- Kaleshwaram : కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్..
రండి.. రారండి..
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ఆల్ పార్టీ ఎంపీలకు తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరగనుంది. ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర అధికారులు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తున్నామని.. వారి విలువైన సూచనలను కోరుతున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను జలశక్తి మంత్రిత్వ శాఖలు, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ ప్రాజెక్ట్ 1980 నాటి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ నిభందన ఉల్లంగించినట్టే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల నీటి హక్కులను ప్రభావితం చేస్తుంది’ అని ఉత్తమ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను, ముఖ్యంగా హరీష్ రావు ఆరోపణలను ఉత్తమ్ తోసిపుచ్చారు. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ మౌనంగా లేదని, చట్టపరంగానే ముందుకెళ్తున్నామని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేసింది.. తెలంగాణకు నష్టం కలిగించింది బీఆర్ఎస్సేనని మంత్రి ఆరోపించారు. నాడు వైఎస్ జగన్- కేసీఆర్ మధ్య ఉన్న అవగాహనతోనే తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి దోచిపెట్టారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుందని, ఈ అంశంలో వెనక్కి తగ్గేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.