Plane Crash: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు మృతుల జ్ఞాపకాలను గుర్తుచేసుకొని భోరున విలపిస్తున్నారు. విమాన ప్రమాదంలో మృత్యువాతపడ్డ అర్జున్ పటోలియా (Arjun Patolia) విషాదగాథ హృదయాలను కదిలించేలా ఉంది. లండన్‌లో నివాసం ఉండే అర్జున్ భార్య భారతి కొన్ని రోజుల క్రితమే చనిపోయారు. అనారోగ్య కారణాలతో కన్నుమూయగా, తన చితాభస్మాన్ని తాను పుట్టిన గ్రామంలోని చెరువులో కలపాలనేది ఆమె చివరి కోరిక. భారతి కోరికను తీర్చేందుకు అర్జున్ పటోలియా ఈ నెల ప్రారంభంలో గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా వదీనా గ్రామానికి వెళ్లారు.
గ్రామంలో భారతి కర్మలను నిర్వహించారు. ఆ తర్వాత ఆమె స్మారకార్థం గ్రామంలో కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వచ్చిన పనులు పూర్తి కావడంతో, లండన్‌లో తన కోసం వేచిచూస్తున్న ఇద్దరు కూతుళ్లు (ఒకరికి 8, ఇంకొకరికి 4) కోసం ఆయన గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరారు. విమానం ఎక్కిన నాన్న ఇంటికి రాలేడని ఆ చిన్నారులకు తెలియదు పాపం. ఫ్లైట్ బయలుదేరిన 5 నిమిషాలకే ప్రమాదం జరగడంతో ఒక్కరు మినహా అందరూ చనిపోయిన విషయం తెలిసిందే.
అర్జున్ మరణ వార్త విని ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. నెల రోజుల వ్యవధిలోనే దంపతులు చనిపోవడంతో ఆడబిడ్డలు ఇద్దరూ అమ్మానాన్న లేనివారు అయ్యారని వాపోతున్నారు. అర్జున్ మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉందని ఇరుగుపొరుగువారు చెప్పారు. అర్జున్‌కు తండ్రి లేరని, అతడి తల్లి సూరత్‌లో నివసిస్తున్నారని వివరించారు.
Read this- Hyderabad Tragedy: రైల్వే ట్రాక్‌పై కూతురిని కాపాడబోయి.. కన్నీళ్లు పెట్టించే ఘటన
ఘోర విషాదం..
గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదం దేశంలో జరిగిన అతిపెద్ద విమాన దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. 12 మంది సిబ్బంది కాగా, మిగతా వారంతా ప్రయాణికులే. విమానంలో ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న 32 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం 672 అడుగుల ఎత్తులో పైకి వెళ్లే గమనాన్ని కోల్పోయింది. దీంతో, విమానాశ్రయానికి చాలా దగ్గరలోనే ఉన్న మేఘనీ నగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లోని హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వైద్య విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే చనిపోయారు.
Read this- Plane Crash Tragedy: నాన్నకు మాటిచ్చి కానరాని లోకాలకు
మృత్యుంజయుడు
ఎయిరిండియా ప్రమాదంలో 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్-ఇండియన్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 11ఏ సీటులో కూర్చుకోవడంతో ఆయన దానిని ఓపెన్ చేసి బయటపడ్డాడు. మిగతా 241 మంది ప్రయాణికులు మరణించారని ఎయిరిండియా ధృవీకరించింది. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ విషాదంపై ఎయిర్ ఇండియా యాజమాన్య సంస్థ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం స్పందించారు. టాటా గ్రూప్ చరిత్రలో ఇది అత్యంత చీకటి రోజులలో ఒకటి అని ఆయన అభివర్ణించారు. ‘‘ఇది చాలా కఠినమైన క్షణం. గురువారం జరిగిన విమాన ప్రమాదం వర్ణించలేనిది. మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. దుఃఖంలో ఉన్నాం. మనకు తెలిసిన ఒకే వ్యక్తిని కోల్పోతేనే ఆ విషాదం చెప్పలేనిది. అలాంటిది, ఒకేసారి ఇంతమంది చనిపోవడం నిజంగా పూడ్చలేని నష్టం. టాటా గ్రూప్ చరిత్రలో ఇదొక చీకటి రోజు. ఈ సమయంలో మాటలు ఓదార్పునివ్వలేవు. కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి దేవుడి ధైర్యం ఇవ్వాలని కోరుతున్నాను. బాధితులకు అన్ని విధాలా సాయంగా ఉంటాం’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
Read this-Ram Mohan Naidu: అయ్యా.. రామ్మోహన్ ఆ మ్యూజిక్, కటింగ్స్ ఏంటి.. సినిమానా?