Plane Crash Tragedy: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) కన్నుమూసిన ప్యాసింజర్లు, సిబ్బంది విషాద గాథలు అందర్నినీ కలచివేస్తున్నాయి. విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమీత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఇద్దరూ చనిపోవడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పైలట్లు ఇద్దరికి కలిపి సుమారు 9,300 గంటలకు పైగా విమాన సర్వీసు అనుభవం ఉంది. కెప్టెన్ సబర్వాల్ ఒక్కరికే ఏకంగా 8,200 గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన వృత్తి పట్ల చూపించిన నిబద్ధత, ఇతరులతో నడుచుకునే విధానాలతో విమానయాన రంగంలో ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. అపారమైన గౌరవ ఉంది. ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవించేవారని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చెప్పారు. కెప్టెన్ సబర్వాల్ రిటైర్మెంట్ దశలో ఉన్నారని చెప్పారు.
Read this- Black Box: బ్లాక్ బాక్స్ దొరికింది.. విమాన విషాదంలో కీలక పరిణామం
నిన్ను చూసుకుంటా నాన్న..
కెప్టెన్ సబర్వాల్ ముంబైలోని పోవాయ్ అనే ప్రాంతంలో నివాసం ఉండేవారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల తన తండ్రితో కెప్టెన్ సబర్వాల్ పెను విషాదానికి కొన్ని రోజుల ముందు మాట్లాడారు. ‘‘నిన్ను జాగ్రత్తగా చూసుకునేందుకు త్వరలోనే జాబ్‌కు రిజైన్ చేయాలనుకుంటున్నాను నాన్న’’ అని ఆయన చెప్పారని శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండ్ వెల్లడించారు. కెప్టెన్ సబర్వాల్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాగా, కెప్టెన్ సబర్వాల్ కుటుంబానికి వైమానిక రంగం నేపథ్యం ఉంది. ఆయన తండ్రి డీజీసీఏ అధికారిగా పనిచేశారు. ఇక, సబర్వాల్ కజిన్లు ఇద్దరు పైలట్లుగా పనిచేస్తున్నారు. క్రమశిక్షణ విషయంలో వారిద్దరికీ సబర్వాల్ ప్రేరణగా నిలిచారు.
Read this- YS Jagan: చంద్రబాబుకు చెంపపెట్టు.. గట్టిగా బుద్ధి చెప్పిన సుప్రీంకోర్టు
ఎయిరిండియాకు అపారనష్టం
కెప్టెన్ సబర్వాల్ చాలా అనుభవజ్ఞుడని, ఆయన మరణం ఎయిరిండియాకు తీరని లోటు అని పైలట్‌కు సన్నిహితుడైన సంజీవ్ అనే వ్యక్తి చెప్పారు. ‘‘నేను రిటైర్డ్ వింగ్ కమాండర్ని. ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి ఎన్నో సార్లు పనిచేశాను. కెప్టెన్ సబర్వాల్ నిజంగా చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా శాంతంగా ఉంటారు. మృదుస్వభావి. నిజంగా అద్భుతమైన పైలట్. ఎప్పుడూ ఆయన గురించి ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. నడవడికిలోనూ, ఇతరులతో ప్రవర్తించడంలోనూ చాలా ప్రొఫెషనల్’’ అని సంజీవ్ కొనియాడారు.
మరో పైలట్‌ది చిన్నవయసు
ప్రమాదానికి గురైన విమానానికి కో పైలట్‌గా వ్యవహరించిన క్లైవ్ కుందర్‌కు సుమారు 1,100 గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన కుటుంబానికి కూడా వైమానిక రంగ నేపథ్యం ఉంది. కుందర్ తల్లి విమాన సిబ్బందిగా పనిచేశారు. ముంబై జూహూలోని బాంబే ఫ్లయింగ్ క్లబ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సు ద్వారా కుందర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. కుందర్ తొలుత నగరంలోని కళీనాలో ఉన్న ఎయిర్ ఇండియా కాలనీలో పెరిగాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తం బోరివలీ కాలనీకి మారారు. కుందర్ మరణంపై సోదరి క్లీనే కుందర్ స్పందించారు. ‘‘నాన్న క్లిఫోర్డ్, అమ్మ రేఖ ఇద్దరూ నాతో పాటు సిడ్నీలో ఉన్నారు. మా బ్రదర్ పరిస్థితిపై మాకు ఎలాంటి సమాచారం లేదు. మేము శుక్రవారం అహ్మదాబాద్ బయలుదేరుతున్నాం’’ అని ఓ మీడియా సంస్థకు క్లీనే చెప్పారు.