Bhopal Bridge: సాధారణంగా ఒక వంతెన నిర్మించడానికి ప్రభుత్వం, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. వేలాది వాహనాలు ఆ వంతెన గుండా ప్రయాణించనున్న నేపథ్యంలో.. డిజైనింగ్ పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో నిర్మించిన ఓ వంతెన విషయంలో ఈ జాగ్రత్తలేవి పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. బ్రిడ్జి నిర్మించిన తీరును వాహనదారులు, నెటిజన్లు పెద్ద ఎత్తున తప్పు బడుతున్నారు. దీంతో ఆ వంతెన వివాదం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వంతెనలో 90 డిగ్రీల మలుపు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కొత్తగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వివాదాలకు కేంద్రంగా మారింది. వంతెనలో 90 డిగ్రీల మలుపు ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఈ వంతెన కోసం ప్రభుత్వం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. అయితే బ్రిడ్జిపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రయాణించే వాహనాలు ఒకేసారి 90 డిగ్రీల మలుపు తీసుకుంటే ప్రమాదాలు జరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.
#WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal's Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e
— ANI (@ANI) June 12, 2025
అయోమయంలో ప్రభుత్వం
భోపాల్‌లోని ఐష్‌బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ఈ వంతెనను నిర్మించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనాదారులు సుదీర్ఘంగా వేచి ఉండాల్సిన అవసరం తీరుతుందని అంతా భావించారు. కానీ వంతెనపై వస్తున్న విమర్శలు చూసి అటు అధికారులతో పాటు.. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్లు అయోమయంలో పడ్డారు. దీనిపై మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ రాకేష్ సింగ్ (PWD Minister Rakesh Singh) స్పందించారు. వంతెనపై వస్తోన్న ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని.. వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
బ్రిడ్జ్ అలా కట్టడానికి కారణమిదే
మరోవైపు వంతెన వివాదంపై పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ వి.డి. వర్మ (V D Verma) స్పందించారు. సమీపంలో మెట్రో ఉన్నందున వంతెన నిర్మాణానికి అవసరైన భూమి పరిమితంగా మారిపోయిందని చెప్పారు. బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. రైల్వే క్రాసింగ్ వేరు చేస్తున్న రెండు కాలనీలను కలిపే ఉద్దేశ్యంతోనే ఈ వంతెన నిర్మించినట్లు వర్మ తెలిపారు. అయితే ఈ బ్రిడ్జి మీదకు భారీ వాహనాలను అనుమతి ఉండబోదని.. తేలిక పాటి వెహికల్స్ ను మాత్రమే పంపిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Plane Crashes In India: దేశాన్ని కుదిపేసిన ఘోర విమాన ప్రమాదాలు.. ప్రతీ ఘటన తీవ్ర విషాదమే!
రాజకీయంగానూ దుమారం
రైల్వే క్రాసింగ్ వంతెన వ్యవహారం మధ్య ప్రదేశ్ లో రాజకీయంగానూ వివాదస్పదమవుతోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఎంపీ జితూ పట్వారీ (Jithu Patwari) దీనిపై స్పందిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP)పై విమర్శలు గుప్పించారు. PWD డిపార్ట్ మెంట్ వంతెన డిజైన్ ను ఏ విధంగా అంగీకరించిందని ప్రశ్నించారు. దీన్ని బట్టే వారి ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని సెటైర్లు వేశారు. ప్రభుత్వం నిద్ర మత్తు వదిలి.. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ధనంతో ఇలాంటి వంతెన నిర్మించి.. నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని పట్టుబట్టారు.