Rowdy Sheeter Arrested: ప్రత్యర్థి హత్యకు కుట్ర చేసిన రౌడీషీటర్ తోపాటు అతని గ్యాంగ్ సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 కొబ్బరి బొండాం కత్తులతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీషరీఫ్ నివాసి మొహమ్మద్ జాబేర్ (43) పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉంది. ఇక, ట్రై కమిషనరేట్లలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యలకు కుట్ర తదితర అభియోగాలపై 12 కేసులు నమోదై ఉన్నాయి.
Also Read: Bhatti Vikramarka: ప్రపంచ పటంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది..
రౌడీషీటర్ మొహమ్మద్ ముర్తుజా అలీ
కాగా, గతంలో జాబేర్ మాజీ రౌడీషీటర్ మొహమ్మద్ ముర్తుజా అలీ గ్యాంగులో పని చేశాడు. ఆ తర్వాత విభేదాలతో అతని నుంచి విడిపోయాడు. అప్పటి నుంచి ముర్తుజాను చంపటానికి కుట్రలు చేస్తున్నాడు. ఈ క్రమంలో 2019లో షాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత కూడా ముర్తుజా చంపటానికి కుట్రలు చేస్తూ వస్తున్నాడు. దీనికోసం జమీర్ ఖాన్, సయ్యద్ షా అబ్దుల్ జబ్బార్, మొహమ్మద్ రహమాత్, సయ్యద్ షా అబ్దుల్ మన్నన్, మొహమ్మద్ నాసిర్, మౌసీన్, అజహార్ లతో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు.
12 కొబ్బరి బొండాం కత్తులను సమకూర్చుకున్నాడు. మూర్తుజాను హత్య చెయ్యటానికి రెక్కీ చేస్తూ వస్తున్నాడు. ఈ సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేంద్ర, బండ్లగూడ సీఐ గురునాథ్, ఎస్సైలు మహేష్, నర్సింలు, ఆంజనేయులు, నవీన్ తోపాటు సిబ్బందితో కలిసి జాబేర్ తోపాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మౌసీన్, అజహర్‌ల కోసం గాలిస్తున్నారు.