Bhatti Vikramarka : తెలంగాణ రైజింగ్.. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా(ఐసీఏఐ), హైదరాబాద్ శాఖల ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఏర్పాటుచేసిన సీఏ విద్యార్థుల జాతీయస్థాయి సదస్సులో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు అనేక పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారిందన్నారు.
ఐటీ, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్స్ టైల్ పార్క్ వంటి వాటితో అభివృద్ధిలో ప్రపంచ పటంలో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుందని వివరించారు. సీఏ కోర్స్ పూర్తి చేసుకుని వస్తున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు. భారతదేశ ఆర్థిక, ధన, వినియోగ నైతికతకు మూల స్తంభంగా ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా (ఐసీఏఐ) నిలుస్తోందన్నారు.
చార్టెడ్ అకౌంటెంట్లు నైతికతకు కట్టుబడి ఉండాలని, టెక్నాలజీ ఆటోమేషన్ శరవేగంగా పెరుగుతున్న ఈ యుగంలో మీ నిజాయితీయే మీకు అత్యంత విలువైన ఆస్తి అని పేర్కొన్నారు. మీ పని ఎల్లప్పుడూ నిజాయితీ, సమన్యాయం బాధ్యతను ప్రతిబింబించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. 1949 లో పార్లమెంటు చట్టంతో స్థాపించబడిన ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియన్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సంస్థ ఆర్థిక క్రమశిక్షణ, వృత్తిపరమైన విలువలు, ప్రజల నమ్మకానికి ఒక నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దేశవ్యాప్తంగా 4.26 లక్షలకు పైగా సభ్యులు, దాదాపు పది లక్షల మంది విద్యార్థులతో ఒక బలమైన ఆర్థిక శక్తిగా మారారని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. ఇందులో హైదరాబాద్ బ్రాంచ్ పాత్ర మరింత విశిష్టమైనదని, 14,500 మందికి పైగా సభ్యులు, 31,000 మందికిపైగా విద్యార్థులతో ఇది ఐసీఏఐ కి విలువైన ఆభరణంగా నిలిచిందన్నారు.
Also Read: Air India Flight Crashed: కుప్పకూలిన ఎయిర్ఇండియా విమానం.. ఫ్లైట్‌లో 242 మంది ప్రయాణికులు!
ప్రపంచవ్యాప్తంగా సేవలందించే ప్రతిభావంతులైన వృత్తి నిపుణులను ఐసీఏఐ తయారు చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ బాధ్యతలు బ్యాలెన్స్ సీట్లకే పరిమితం కావు.. మీరు అభివృద్ధికి భాగస్వాములు, ప్రజల నమ్మకానికి రక్షకులు అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. భారతదేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
చిరు వ్యాపారుల అభివృద్ధికి తోడ్పడాలి:
సీఏలు తమ ప్రతిభను కేవలం సంపాదనకే కాకుండా సేవకు వినియోగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సోషల్ ఆడిట్లు చేయండి.. చిన్న వ్యాపారాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి.. ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో సొంత సంస్థలను స్థాపించి ఉద్యోగులుగా మాత్రమే పరిమితం కాకుండా.. ఉద్యోగ దాతలుగా మారాలన్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని డిప్యూటీ సీఎం సీఏ విద్యార్థులకు సూచించారు. కష్టపడి సాధించాల్సిన ఉన్నత మార్గాన్ని ఎంచుకున్నందుకు సిఏ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సీఏ గా ప్రయాణం అంత సులభమైనది కాదన్నారు. మీ విజయం కేవలం మీకు మాత్రమే చెందదు.. అది భారతదేశ పురోగతికి చేయూతనిస్తుందని సీఏలను ఉద్దేశించి పేర్కొన్నారు. సీఏ లు వృత్తి గౌరవాన్ని ఎప్పటికీ నిలబెట్టాలని తాను కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.