Lover Twist: ఈ రోజుల్లో ప్రేయసిని మెయింటెయిన్ చేయడమంటే అంత ఈజీ కాదేమో మరి. ఇంకా చెప్పాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని అని కొన్ని ఘటనలను బట్టి చెప్పక తప్పని నెలకొన్నాయి. సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌లు, ఇలా ఒకటా రెండా అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. డబ్బు లేకుండా జరిగే పనులేవీ కనిపించడం లేదు. చేతిలో మనీ లేకపోవడంతో తన ప్రేయసి కోరిక ఇలాంటి కోరికలు తీర్చలేకపోవడాన్ని ఓ ప్రియుడు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను సంతోష పెట్టడమే లక్ష్యంగా సొంతింటికే కన్నం వేశాడు ఆ ప్రబుద్ధుడు.
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్‌కు చెందిన జయంత్ అనే యువకుడు నేరుగా తన సొంత ఇంటిలో చోరికి పాల్పడ్డాడు. ఏకంగా, 16 తులాల బంగారం చోరీ చేశాడు. జయంత్ హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. అయితే, చేతిలో డబ్బు లేకపోవడంతో ఆమె కోరికలు తీర్చలేకపోయాడు. ఇంకేమంది ఇంట్లో దొంగతనం చేశాడు.
Read this- Honeymoon Case: భర్తను చంపేశాక.. వెలుగులోకి ‘సోనమ్’ క్రిమినల్ ఆలోచనలు
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న చందంగా కొడుకే దొంగ అని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. ఇంట్లో నగలు చోరీకి గురయ్యాయంటూ జయంత్ తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా ఇంటి మనిషే దొంగ అని తేల్చారు. జయంత్ చోరీకి పాల్పడ్డట్టు గుర్తించారు. అతడి వద్ద నుంచి 16 తులాల బంగారం, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
బయట ఎక్కడో దొంగతనం చేయడం ఎందుకు అనుకున్నాడో, లేక బయట వర్కౌట్ కాదని అనుకున్నాడో ఏమో కానీ, ఇంటికే కన్నం వేయడంపై తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కలవారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం తులం బంగారం దాదాపు లక్ష రూపాయలకు చేరువైంది. అంటే, ఏకంగా రూ.16 లక్షల విలువైన నగలను దొంగిలించాడు.
Read this- Strawberry Moon: రేపే స్ట్రాబెర్రీ మూన్.. ఆకాశంలో ఏం జరగబోతోంది?
లవర్‌కు బంగారం ఇష్టం
సొంతింట్లోనే ఎందుకు దొంగతనం చేశావని పోలీసులు ప్రశ్నించగా, జయంత్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. తన లవర్‌కు బంగారం అంటే ఇష్టమని, నగలు కావాలని అడిగిందని, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంట్లోకి చోరికి పాల్పడ్డట్టు తెలిపాడు. దొంగతనం చేసేటప్పుడు వేలి ముద్రలు, ఇతర ఆనవాళ్లు పడకుండా జయంత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పట్టుబడకుండా దొంగతనం ఎలా చేయాలని గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ పకడ్బందీగా ఈ చోరీ చేశాడు. పైగా ఫిర్యాదు చేసేందుకు తండ్రితో పాటు పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లాడు. తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఏడుస్తూ అందరినీ నమ్మించాడు. అయితే, దొంగతనం జరిగిన రోజు జయంత్ అర్ధ రాత్రి తన ప్రేయసికి ఫోన్ చేసి మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా పూర్తి స్థాయిలో కూపీ లాగగా జయంత్ బాగోతం బయటపడింది. దొంగతనం చేశాడు కాబట్టి కేసు ఉపసంహరించుకోవడం కూడా సాధ్యమవ్వకపోవచ్చే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.