Russia Vs Ukraine: రష్యా, ఉక్రెయిన్ (Russia Vs Ukraine) మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదివరకు ఎన్నడూ ఎరుగని రీతిలో రాత్రి సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా సేనలు అతిపెద్ద దాడి చేశాయి. సుమారు 500 డ్రోన్‌లు, 20 క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరిట ఇటీవల మాస్కోపై ఉక్రెయిన్ బలగాలు భారీ డ్రోన్ దాడి చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రష్యా దాడికి పాల్పడిన విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ కూడా ధ్రువీకరించింది. శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో రష్యా నేరానికి పాల్పడిందని వ్యాఖ్యానించింది.
మధ్య, పశ్చిమ ప్రాంతాలే టార్గెట్
ఉక్రెయిన్‌లోని మధ్య, పశ్చిమ ప్రాంతాలే లక్ష్యంగా రష్యా బలగాలు దాడులకు తెగబడ్డాయని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. వేర్వేరు రకాల మొత్తం 479 డ్రోన్లు, 20 క్షిపణులు తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని వివరించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఈ దాడులు కొనసాగాయని పేర్కొంది. 277కి పైగా డ్రోన్లు, 19 క్షిపణులను కూల్చివేశామని వివరించింది. కేవలం 10 డ్రోన్లు లేదా మిసైల్స్ మాత్రమే లక్ష్యాలను తాకాయని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వివరించింది. రష్యా జరిపిన దాడుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడని స్థానిక మీడియా తెలిపింది.
Read this- RCB for Sale: సంచలన పరిణామం.. అమ్మకానికి ఆర్సీబీ?
ఎడతెగని డ్రోన్ దాడులు
రష్యా, ఉక్రెయిన్ కొంతకాలంగా పరస్పరం డ్రోన్ దాడులు చేసుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య సుమారు 1,000 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, అన్ని ప్రాంతాల్లోనూ భయంకరమైన డ్రోన్ దాడులు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం సాయంత్రమే మీడియాకు చెప్పారు. మంగళవారం రాత్రి రష్యా డ్రోన్ దాడికి ఒడెసా అనే ప్రాంతంలోని ప్రసవాల వార్డు ధ్వంసమైందని ఉక్రెయిన్ ప్రాంతీయ అధికారి ఒకరు చెప్పారు. బాధితులను అర్ధరాత్రి సమయంలో కీవ్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోని హాస్పిటల్స్‌కు తరలించాల్సి వచ్చిందని కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు.
Read this- Boy Swallows Bulb: బాబోయ్.. 9 నెలల చిన్నారి బొమ్మ ఫోన్‌తో ఆడుకుంటూ..
ఉక్రెయిన్ పౌరులకు అలర్ట్
రష్యా దాడులు కొనసాగుతున్నందున, దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, షెల్టర్ల కింద తలదాచుకోవాలని ఉక్రెయిన్ మిలిటరీ ఆ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. ‘‘శత్రువు డ్రోన్‌లు నగరంలోని వివిధ డిస్ట్రిక్ట్స్‌లోకి వరుసగా దూసుకొస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని కీవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ తిమూర్ చెప్పారు. గతవారం రష్యా 400లకు పైగా డ్రోన్లు, 40 క్షిపణులు ఉక్రెయిన్‌లోకి వచ్చాయని పేర్కొంది. ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’లో భాగంగా రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ మిసైల్ క్యారియర్లపై దాడి చేసిన తర్వాత రష్యా దాడులు పెరిగిపోయాయని పేర్కొంది.
రష్యా చేసిన భీకర దాడులను జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇలాంటి దాడులను కూడా ప్రపంచంలోని ఏ దేశమూ ఖండించకపోవడం నిజంగా దురదృష్టకరం. పుతిన్ కోరుకునేది కూడా ఇదే’’ అని మండిపడ్డారు. కాగా, ఈ దాడులను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమర్థించుకుంది. ఉక్రెయిన్ ఉగ్రవాద చర్యలకు ప్రతిఘటనగా ఈ దాడులు చేశామని సమర్థించుకుంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్‌ను ఉద్దేశించి రష్యా రక్షణ శాఖ ఈ వ్యాఖ్యలు చేసింది.