Land Encroachments: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో భూములకు విపరీత డిమాండ్ ఉంటోంది. దీంతో కబ్జాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు..పాగా వేస్తున్నారు. రాజకీయ, అధికార పలుకుబడితో కబ్జాల పర్వం నిత్యకృత్యంగా మారింది. కబ్జాలకు అడ్డు ఎవరు? అన్నట్లుగా స్థానిక కాంగ్రెస్ నేత ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అధికారుల కనుసన్నల్లోనే
ఓ కాంగ్రెస్ నేత దుండిగల్ ప్రాంతంలో బరితెగించి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ నోటరీలు సృష్టించడం..దౌర్జన్యంగా స్థలాలను ఆక్రమించి విక్రయించడం పరిపాటిగా మారింది. అడిగే వారు లేక..ఎక్కడ ఖాళీ జాగా ఉంటే.. అదంత నాదే అంటుండడంతో బాధితులు విస్తుపోతున్నారు. పేదల ఇళ్ల జాగాల్లో పాగా వేసి ఫేక్ నోటరీలు తెచ్చి కబ్జాల పర్వాన్ని యథేచ్చగా సాగిస్తున్నాడు.
AlSO Read: Maoists: పోలీసుల వాహనాన్ని.. పేల్చిన మావోయిస్టులు!
అతని అక్రమాలను చూసి.. దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు అతని కనుసన్నల్లోనే పనిచేస్తున్నారా..! అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సదరు నేత చేపట్టే అక్రమ నిర్మాణాలకు అడ్డుపడకుండా.. సెలవు దినాలలో పని చేసుకోమని సలహాలిచ్చి అక్రమ తంతుకు ఊతమిస్తున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దుండిగల్ సర్వేనెంబర్ 454లోని పల్లవి ఆశ్రమం వద్ద ఫేక్ నోటరీలతో ఆక్రమణలు మితిమీరిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థలాలను సైతం కబ్జా చేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
తమ ప్లాట్లను ఫేక్ సంతకాలు.. ఫేక్ నోటరీలు చేయించుకొని సదరు నేత దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం దుండిగల్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారే కరువయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ స్థలం కబ్జాపై తీవ్ర స్థాయిలో వత్తిడి రావడంతో తప్పని పరిస్థితిలో సోమవారం అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే ఇదే తరహాలో మిగతా వాటిపై కూడా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దుండిగల్‌లో ఆ నేత ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, ఇకనైనా అతని దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. ఫేక్ నోటరీలతో కబ్జా చేసిన స్థలాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Kavitha on CM Revanth: సీఎం రేవంత్‌పై కవిత ఫైర్.. వాటిపై తక్షణ చర్యలకు డిమాండ్