Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: ప్రైవేటు రంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!

Nara Lokesh: ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తాను అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నానని, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్-2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన 95 మంది, ఇంటర్మీడియట్‌లో (Intermediate) ప్రతిభ కనబర్చిన 26 మందికి మంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టామని.. ఇది సంస్కరణల్లో తొలి అడుగు మాత్రమేనన్నారు. ‘ మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవచేయాలి. మీ జూనియర్లకు గైడ్ చేయడం ద్వారా స్పూర్తినివ్వండి’ అని లోకేష్ పిలుపునిచ్చారు.

Read Also- Andhra Pradesh: ఏపీలో రోజురోజుకూ గాడి తప్పుతున్న లా అండ్ ఆర్డర్.. ఎందుకిలా?

మీ విజయాలు దేశానికి తెలియాలి..
‘ఈరోజు మీరుసాధించిన విజయాలు భారతదేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గం. జీవితంలో ఏం కోల్పోయినా చదువును ఎవరూ దూరంచేయలేరు. మీరంతా కష్టపడి బాగా చదివారు. హ్యాట్రిక్ సాధించిన పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు. మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నాం. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మీకు అద్భుతమైన ఫౌండేషన్ ఉంది. అవకాశాలను నిచ్చెనమెట్లుగా ఉపయోగించుకుని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటినుంచే అసలు పరీక్ష మొదలవుతుంది, దానిపేరే జీవితం. పరీక్ష పెట్టే భగవంతుడే జయించేశక్తి కూడా దేవుడు ఇస్తాడు. కష్టాలు అందరికీ ఉంటాయి, వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న వారే విజేతలుగా నిలుస్తారు. విద్యార్థులు ప్రశ్నించడం ద్వారా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. చంద్రబాబు వయసు 75సంవత్సరాలు. ఇప్పటికీ ఆయనలో ఎక్కడా వయోభారం కనపడదు. మా అందరికంటే స్పీడ్‌గా పరుగెడతారు. మహానాడు 3రోజుల్లో అందరం పడిపోయాం, బాబు మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేరు. ఆయన నుంచి ప్రతిఒక్కరూ క్రమశిక్షణ నేర్చుకోవాలి’ అని లోకేష్ తెలిపారు.

10th Students with Lokesh

విద్యార్థులారా… పక్కదారి పట్టొద్దు!
‘ కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు కొత్తజీవితం ప్రారంభవుతుంది. ఒకసారి మీరు పక్కదారి పడితే జీవితాలు నాశనమవుతాయి. మీ తల్లిదండ్రులు మీ ప్రవర్తన ఉండాలి. యువగళం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో ఓ తల్లి ఆవేదన చూశాక డ్రగ్స్ వల్ల జీవితాల నాశనం అవుతున్నాయని గుర్తించి డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ప్రారంభించాం. డ్రగ్స్‌పై మన ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. తప్పుచేస్తే మీతోపాటు తల్లిదండ్రులు ఇబ్బందిపడతారు. మంచిచెడులకు తేడా, తెలుసుకుని ముందుకువెళ్లాలి. పట్టుదల, క్రమశిక్షణ వల్ల మీరంతా ఈ స్థాయికి వచ్చారు. భారతదేశం గర్వపడేలా మీరంతా ఉన్నతస్థానాలకు చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని లోకేష్ సూచనలు, సలహాలు ఇచ్చారు.

Read Also- YS Jagan: అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌!

జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి!
‘ విద్యార్థులు జీవితంలో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. మంచి మెంటర్స్ ద్వారా స్పూర్తి పొంది, నిరంతరం నేర్చుకోండి. ముఖ్యమంత్రి మాకు పూర్తిస్వేచ్చ ఇస్తారు. ఎన్నికష్టాలు వచ్చినా అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. విద్యార్థులు జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అందుకు నేనే ఉదాహరణ. ఎన్నికల్లో పోటీకి టిడిపి ఎప్పుడూ గెలవని మంగళగిరిని ఎంచుకున్నా. 2019లో ఓడిపోయాను, అయినా పట్టుదలతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని ధైర్యంగా ముందుకు సాగా. అయిదేళ్లు కష్టపడి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించా. విద్యాశాఖ వద్దని చాలామంది చెప్పారు. ఎన్నికష్టాలు వచ్చినా ఫర్వాలేదని ఈ శాఖనే ఎంచుకున్నా. మార్పు మీ నుంచే రావాలి. మీరు డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ పై రాసినవి చూశాను. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు ప్రతిభ అవార్డు పొంది ఐఎఎస్ అధికారి అయి కమిషనర్ అయ్యారు. జీవితంలో మీ విజయానికి కారణమైన వారిని మరువద్దు. నా మెంటర్ రాజిరెడ్డి గారిని ఇప్పటికీ కలుస్తుంటా. మీ ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను మరువద్దు. కాలం మారినా గౌరవం తగ్గకూడదు. విద్యార్థులంతా బాధ్యతకలిగిన పౌరులుగా మెలగాలి. విద్యార్థులు జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు’ అని లోకేష్ సూచించారు.

10th Student

నూరుశాతం అక్షరాస్యతకు మిషన్..!
లిటరసీ రేటుపై ఇటీవల వచ్చిన రిపోర్టు చూసి ఆశ్చర్యపోయా. ఆంధ్రా.. దేశంలో అత్యంత దిగువన ఉంది. రాబోయే నాలుగేళ్లలో నూరుశాతం అక్షరాస్యత లక్ష్యంగా మిషన్ అక్షర ఆంధ్రను ప్రకటించాం. మంచివిధానాలతో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళతాం. భారత్ శాంతియుత దేశం. పెహల్గామ్ మారణాకాండకు సమాధానంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని ముష్కరులకు సరైన గుణపాఠం చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌లో మురళీనాయక్‌ను కోల్పోయాం. ఆయన తల్లిదండ్రులకు ఒకేఒక బిడ్డ. ఏదైనా జరిగితే భారత్ నా వెనుక నిలుస్తుందని చెప్పిన ధీరోదాత్తుడు మురళీ. అటువంటి జవాన్లు బార్డర్‌లో మనకోసం నిలబడుతున్నారు వారికి అండగా మనం నిలబడాలి. ప్రధాని ఏ పిలుపునిచ్చినా దేశభక్తిని చాటాలి. ఇప్పటివరకు 25 ఉగ్రదాడులు జరగ్గా, తొలిసారి మోదీజీ నేతృత్వంలో సరైన గుణపాఠం చెప్పాం’ అని లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా వందేమాతరం అంటూ లోకేష్ విద్యార్థులతో కలిసి నినదించారు.

Lokesh With Students

డ్రీమ్ వాల్‌పై విద్యార్థుల జీవిత లక్ష్యాలు..
ఈ సందర్భంగా డ్రీమ్ వాల్, యాంబిషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ పై విద్యార్థినీ, విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తీకరించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి దేశానికి సేవచేస్తానని భీమిని ఎపి మోడల్ స్కూలు విద్యార్థిని జి.జితు, ఐఎఎస్ అధికారిని అవుతానని జి.జగదీష్, టీచర్ నై ఉత్తమ పౌరులను తయారుచేస్తానని భీమిని కెజిబివి జూనియర్ కాలేజి విద్యార్థిని సిహెచ్ ప్రియాంక, ఇంజనీరింగ్ చదివి దేశాభివృద్ధిలో కీలకమైన రోడ్లు వేస్తానని బోదెల జ్యోత్స్న తమ జీవిత లక్ష్యాలను వాల్ పై రాశారు. డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని నిడగల్లు జడ్పిహెచ్ఎస్ స్కూలుకు చెందిన ఆర్. ప్రజ్ఞ, ఏఐ ఇంజనీర్ అవుతానని పాలకొండ తమ్మినాయుడు స్కూలుకు చెందిన వావిళ్లపల్లి గాయత్రి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదివి చాట్ జీపీటీ వంటి నవీన ఆవిష్కరణలు చేస్తానని పాలకొండ సత్యసాయి జూనియర్ కళాశాలకు చెందిన కొమరపు గుణశ్రీ తెలియజేశారు.

Read Also- Akhanda 2 Teaser: ఉగ్ర నరసింహుడి అవతారం.. ఈసారి బాక్సాఫీస్ గల్లంతే!

తల్లిదండ్రులను బాగా చూసుకుంటా!
గ్రాటిట్యూడ్ వాల్‌పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. తాను పీహెచ్‌డి చేసి పేరెంట్స్‌ను బాగా చూసుకుంటానని కోటిపాం జడ్పిహెచ్‌ఎస్‌కు చెందిన కె. లోకేష్ తెలుపగా, పాలకొండకు చెందిన ప్రహర్షిణి.. మంత్రి లోకేష్, కళాశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై ప్రత్యేకశ్రద్ధ వహించి, ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు రుణపడి ఉంటానని పాలకొండ సత్యసాయి కాలేజికి చెందిన కొమరపు గుణశ్రీ గ్రాటిట్యూడ్ వాల్‌పై రాశారు. వాల్స్‌పై విద్యార్థులు రాసిన మనోభావాలను ఆసక్తిగా చదివిన లోకేష్.. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికాశుక్లా, కళాశాల విద్య డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటిడిఎ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

Students

Read Also- Chandrababu: సీఎం చంద్రబాబు తియ్యటి శుభవార్త.. రెండ్రోజుల్లో డబ్బులే డబ్బులు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు