Andhra Pradesh: అవును.. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ లా అండ్ ఆర్డర్ (Law And Order) గాడి తప్పుతోందనే భావన సామాన్యుడిలో కలుగుతోంది. ఇందుకు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలే ఉదాహరణ అని ప్రజలు చెబుతున్న పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు రోజులో ఎన్నెన్ని సంఘటనలు జరుగుతున్నాయో.. వెలుగులోకి వస్తున్నవి కొన్ని అయితే.. రానివి ఇంకోన్నో? అనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నాయి. అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియా (Social Media) వేదికగా ఒక్కొక్కరు వీడియోల్లో చెబుతుంటే మనం ఉన్నది ఆంధ్రాలోనేనా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? అంటే కొన్ని చోట్ల ఖాకీలపై దాడులు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తుండటం గమనార్హం. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయంటే అర్థమేంటి? అని రాష్ట్రంలోని మేథావులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఈ రెండు మూడ్రోజుల్లోనే జరిగిన దారుణ ఘటనలు ఒకసారి చూద్దాం రండి..
అనంత దారుణం!
అనంతపురం నగరంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఇంటర్ సెకండియర్ విద్యార్థిని తన్మయి (20) హత్యకు గురైంది. అనుమానాస్పద స్థితిలో కాలిన గాయాలతో చనిపోయిన విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పరిధిలోని మణిపాల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. వారం రోజుల క్రితం తన కుమార్తె కనిపించట్లేదని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. అయితే ఇలా విగతజీవిగా పడి ఉన్న కూతురుని చూసి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే.. అనుమానితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా మీడియాకు వెల్లడించారు. బీర్ బాటిల్‌తో తలపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయని.. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ వెల్లడించారు. మందు బాబులకు అడ్డగా మారిన ముళ్ళపొదల్లో తన్మయి మృతదేహం ఉండడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. బైక్‌పై తీసుకొచ్చిన నరేష్, అతనితో పాటు మరికొందరు కలిసి హతమార్చరా? లేదంటే ఈ ప్రాంతంలో మద్యం సేవించే వారు అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో.. ఆలస్యంగా వెలుగులోకి!
అనంత దారుణాన్ని మరువక ముందే రాష్ట్రంలో ఘోర ఘటన వెలుగుచూసింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు, హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడగా, చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు పరిచయం చేసింది. ఉపాధి చూపిస్తానని నమ్మబలికి ఇంటికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నూకరాజు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై శనివారం నాడు తల్లిదండ్రులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించి.. నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోలీసులు పోక్సో నమోదు చేశారు.
మహిళా కానిస్టేబుల్‌పై దాడి
5 నెలల గర్భిణీ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌పై దుండగులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లిలో చోటుచేసుకున్నది. మద్యం మత్తులో ఉన్న దుండగులు.. భార్య భర్తలపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గూడవల్లి ఆనంద్, సునీత దంపతులు, విజయవాడ రైల్వే ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి దుండగులు ఢీకొట్టారు. సునీత గర్భవతిగా ఉండడంతో బండి దిగి అతనితో భర్త ఆనంద్ వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో ఉన్న దుండగుడు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ చెప్పుతో కొట్టారు. దీంతో రెచ్చిపోయిన ఆ దుండగుడు 10 మంది రౌడీ గ్యాంగును పిలిపించి భార్యభర్తలపై దాడి చేయించాడు. తన భార్య గర్భవతి అని, వదిలేయమని ప్రాధేయపడ్డా కనికరించకుండా బండరాళ్లతో దాడి చేశారని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడేందుకు వచ్చిన స్థానికులు, వాహనదారులను చంపేస్తామని బెదిరించారని మహిళ కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర గాయాలపాలై దంపతులు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘ 5 నెలల గర్భవతినని చెప్పినా వినకుండా దాడి చేశారు. మద్యం మత్తులో మా వాహనాన్ని ఢీకొట్టి మాపైనే దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు, వాహనదారులను చంపేస్తామని బెదిరించారు. 10-15 మంది రౌడీ గ్యాంగ్‌ను పిలిచి, రాళ్ళతో నన్ను నా భర్తను కనికరం లేకుండా కొట్టించాడు’ అని సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
నడిరోడ్డుపై వీరంగం..
విజయవాడలో నడి రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. క్రీస్తురాజపురం, ఆల్ఫా టీ క్యాంటీన్ వద్ద మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు తెగబడ్డారు. యువకులు బీర్ సీసాలను ప్రజల మీదకు కూడా విసరడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు యువకులను పోలీసులు అదుపులోని తీసుకున్నారు. ఈ మధ్యనే బెజవాడలో మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో యువకులు దాడులకు తెగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తునే వైరల్ అయ్యింది కూడా. ఇక టీడీపీ (TDP) కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలు.. ఇటు ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. నడిరోడ్డుపైన దాడి చేసుకున్న.. కత్తులతో దాడి చేసుకున్న సందర్భాలు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎందుకిలా?
బీహార్ కన్నా దారుణంగా ఏపీలో శాంతి భద్రతలు మారిపోయాయని వైసీపీ ఆరోపిస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పడంతో ఆడబిడ్డలకి పూర్తిగా రక్షణ కరువైందని ప్రజా సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. ఇదేనా చంద్రబాబు తమరి అనుభవం.. ఆ బాధిత కుటుంబాలకు ఏం చెబుతారు? ఎలాంటి న్యాయం చేస్తారు? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు కుప్పకూలాయని, రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఈ మధ్యనే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూడా ఆరోపించారు. మరోవైపు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలపై అణచివేతకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటివి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందనేది తెలియజేస్తుంది. ఇకనైనా నేరాలకు పాల్పడిన వారిపట్ల పోలీసులు కఠిన శిక్షలు, చర్యలు తీసుకుంటే మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కావని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో సామాన్యుడు మొదలుకుని మరీ ముఖ్యంగా మహిళల్లో నెలకొన్న ఈ భయాందోళనను పోగొడుతూ.. ప్రభుత్వం కఠిన శిక్షలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఏం చేయాలి?
సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాత్రం పెట్టుబడులు ఆకర్షించడానికి, రాష్ట్ర అభివృద్ధికి సమర్థవంతమైన శాంతిభద్రతలు చాలా ముఖ్యమని పదే పదే చెబుతున్నారు కానీ, అవన్నీ ఆచరణలోకి రావట్లేదు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉందో ఇప్పటి వరకూ చూశాం. కానీ ఈసారి ఎందుకిలా జరుగుతోందో ఆయనకే తెలియాలి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కేంద్రంగా మారింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. అంతేకాదు.. రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా పని చేయగల వాతావరణం పోలీసులకు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం నియంత్రణపైనా గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. ఇవన్నీ ఒకెత్తయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి నేరాలు ఘోరాలు జరిగితే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారనేది మనందరికీ తెలిసిందే. అందుకే ఏపీలో కూడా అలాంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం చాలానే ఉందని చెప్పుకోవచ్చు.
Read Also- YS Jagan: అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్!