Warangal Museum: ఓరుగల్లు రాజధానిగా పాలన సాగించిన కాకతీయుల కాలం నాటి కళాసంపద, రాజరికం నాటి రాజులు ఉపయోగించిన ఆయుధాలు, రాతి ఫిరంగులు, తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, శిలా శాసనాలు.. ఇలా ఎన్నో చారిత్రాత్మక ఆనవాళ్లకు నిలయమైన వరంగల్ మ్యూజియం నిరాదరణకు గురి అవుతుంది. కాకతీయుల పాలన రాజుల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆధారాలెన్నో కనుమరుగు అయ్యే స్థితికి చేరుకున్నాయి. దశాబ్ధాల కిందట నిర్మించిన మ్యూజియం బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
మ్యూజియంను వరంగల్ కోటకు తరలించేందుకు పనులు చేపట్టిన గత సర్కారు మధ్యలోనే చేతులెత్తేసింది. సకాలంలో నిధులు విడుదల చేయక భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. చారిత్రక ఆనవాళ్లన్నీ శిథిల భవనంలోనే మగ్గుతున్నాయి. దీంతో కాకతీయుల కాలంనాటి ఆనవాళ్లు, పురాతన వస్తువుల సందర్శించుకునే భాగ్యం సందర్శనకు పర్యాటకులకు లేకుండా పోతుంది.
Also Read: Dhoop Deep Naivedyam Scheme: 250 ఆలయాలకు.. ప్రభుత్వం నోటిఫికేషన్!
1,200కుపైగా కళాఖండాలు, చారిత్రాత్మక ఆధారాలు
చరిత్ర ఆధారాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలో కేంద్ర పురావస్తు ప్రదర్శన శాల(మ్యూజియం)ను గతంలో ఏర్పాటు చేశారు. 1985 మార్చి 29న అప్పటి ఉమ్మడి ఏపీ గవర్నర్ డా.శంకర్ దయాళ్ శర్మ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత 1991 ఫిబ్రవరి 25న అప్పటి సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించారు.
అందులో ఆదిమానవుల ఆయుధాలు, చోళులు, చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి వస్తువులు, ఉపకరణాలు, రాజులు యుద్ధాలకు ఉపయోగించిన కత్తులు, ఢాలులు, రాతి ఫిరంగులు, శిల్పాలు, చరిత్ర ఆధారాలు తెలిపే శిలా శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు, పురాతన నాణేలు, పింగాణి వస్తువులు.. ఇలా అన్నీ కలిపి 1,200 కుపైగా చరిత్ర ఆధారాలు మ్యూజియంలో భద్రపరిచారు. విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. అయితే పాత భవనం శిధిలావస్థకు చేరుకుంది.
శిధిలావస్థలో పాత భవనం… అసంపూర్తిగా కొత్త భవనం…
1991 లో ప్రారంభించిన మ్యూజియం భవనం అనతికాలంలోనే శిథిలావస్థకు చేరింది. చాలాచోట్లా గోడలు బీటలువారి, కొన్నిచోట్ల పెచ్చులూడింది. బిల్డింగ్ సెజ్జలు కూలిపోయే దశకు చేరుకుని ప్రమాదకంగా మారింది. మ్యూజియం సిబ్బంది కర్రలు సపోర్ట్ పెట్టి కూలకుండా టెంపరరీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎప్పుడు పెచ్చులూడుతాయో తెలియక అక్కడి సిబ్బంది కూడా బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో విధులు నిర్వర్తిస్తున్నారు.
వరంగల్ మ్యూజియం శిథిలావస్థకు చేరుకోవడంతో చారిత్రాత్మక ప్రదేశం అయిన వరంగల్ కోటలోకి మ్యూజియం తరలించేందుకు పురావస్తుశాఖ గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మ్యూజియం నిర్మాణానికి రూ.3.85 కోట్లు, పురాతన వస్తువులన్నీ షిఫ్టింగ్, వాటికి సంబంధించిన షోకేజ్లు, బిల్డింగ్ లో నీళ్లు, కరెంట్, సీసీ కెమెరాలు సహా పలు సౌకర్యాల కల్పన కోసం మరో రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. ఈ మేరకు గత ప్రభుత్వం 2015లో వరంగల్ కోటలో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.3.85 కోట్లు మంజూరు చేసింది.
కానీ సకాలంలో బిల్లులు రిలీజ్ చేయక పనులు దాదాపు ఏడేండ్ల పాటు ఆగుతూ సాగుతూ వచ్చాయి. చివరకు 2022 మార్చిలో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. కాగా ఓల్డ్ మ్యూజియం నుంచి ఇక్కడికి పురాతన వస్తువులు, శిల్పాలు, శాసనాలు, ఇతర చారిత్రక ఆనవాళ్లన్నింటినీ తరలించి భద్రపరచాల్సి ఉండగా.. ఆ ఏర్పాట్లకు అవసరమైన రూ.2.5 కోట్లు మాత్రం గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పాత మ్యూజియం భవనం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతుండగా, కొత్త బిల్డింగ్ వినియోగంలోకి రాక నిరుపయోగంగా మారింది.
Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!
ప్రమాదం పొంచిఉండడంతో సందర్శన నిలిపివేత
నిత్యం వందలాది మంది పర్యాటకులు, విద్యార్థుల సందర్శనలతో వరంగల్ పురావస్తు ప్రదర్శనశాల కిటకిటలాడేది. అదే లైన్ లో ప్రతాపరుద్ర నక్షత్రశాల, మ్యూజికల్ గార్డెన్, భద్రకాళి టెంపుల్ ఉండటంతో ప్రతిరోజు వేలాది మంది మ్యూజియంను సందర్శించేవాళ్లు. కానీ ఇప్పుడు మ్యూజియం ముందు భాగంలో జీడబ్ల్యూఎంసీ బిల్డింగ్ నిర్మాణం కోసం గుంత తీశారు. ఆ పక్కనే నక్షత్రశాల, మ్యూజికల్ పార్క్ కూడా బంద్ అయ్యాయి.
అంతేగాకుండా దారి కూడా సరిగా లేకపోవడంతో అక్కడ మ్యూజియం ఉందనే విషయాన్నే చాలామంది మరిచిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోటలో అసంపూర్తిగా ఉన్న మ్యూజియం భవనాన్ని అన్ని రంగులతో తీర్చిదిద్ది మ్యూజియంలోకి అన్ని చారిత్రాత్మక ఆనవాళ్లను కళా సంపదను తరలించి సాధ్యమైనంత త్వరగా పర్యాటకులు విద్యార్థుల సందర్శనకు వీలుండేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం
కాకతీయుల కాలం, రాజుల పాలన కాలం నాటి ఆనవాల్లు, చారిత్రాత్మక శిల్పకళా సంపదను వరంగల్ కోటకు తరలించేందుకు గతంలోనే పురావస్తు శాఖ పక్షాన ప్రభుత్వానికి నివేదించాం. దాకిని అంగీకారం తెలిపిన ప్రభుత్వం రూ.3.85 కోట్లతో వరంగల్ కోటలో భవన నిర్మాణం చేపట్టింది. పాత మ్యూజియం లోని శిల్ప సంపద చారిత్రాత్మక పురాతన వస్తువులన్నీ తరలించేందుకు భవనంలో భద్రత, మౌలిక వసతుల కల్పనకు దాదాపు రూ.2.5 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యి పనులు పూర్తి కాగానే మ్యూజియం తరలింపునకు తగిన చర్యలు చేపడుతామని పురావస్తుశాఖ వరంగల్ ఏడీ మల్లు నాయక్ అంటున్నారు.
Also Read: Konda Vishweshwar Reddy: కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్ దే..ఎంపీ సంచలన కామెంట్స్!