TG New Ministers
Politics

TG New Ministers: ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచి జాక్ పాట్.. ఎవరీ వాకిటి, అడ్లూరి?

TG New Ministers: తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆదివారం జరిగింది. రాజ్‌భవన్‌లో మంత్రులుగా గడ్డం వివేక్‌ (Gaddam Vivek), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ (Adluri Laxman Kumar), వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఈ ముగ్గురి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ముగ్గురినీ ఎంపిక చేసింది. ఎస్సీ సామాజికవర్గం నుంచి గడ్డం వివేక్‌ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ), బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం కల్పించారు. అయితే ఇంకో ముగ్గురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నది. అప్పుడిక రెడ్డి, మిగిలిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీహరి, లక్ష్మణ్ ఇరువురూ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురి బ్యాగ్రౌండ్ ఏంటి? రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది..? ఇంతమంది ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలుగా ఉండగా ఈ ముగ్గురికే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం..

Read Also- Jogi Ramesh: వైసీపీకి జోగి గుడ్ బై.. ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే!

సర్పంచ్ నుంచి మంత్రి వరకూ!
1972లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించిన శ్రీహరి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది ఆయనకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం ఎన్ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడిగా ప్రారంభమైంది. 1990–93 వరకు మక్తల్ మండల ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1993–96 వరకు మక్తల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా, 2001లో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2010–14లో జడ్పీటీసీగా రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిచారు. జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా పనిచేశారు. 2022 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుటుంబం మొదటి నుంచీ సుమారు 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తోంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇచ్చినందుకు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. అసెంబ్లీ పార్లమెంట్ గడప దొక్కని కులాలు చాలా ఉన్నాయి. సర్పంచ్ స్థాయి నుంచి 30 ఏళ్ల నుంచి ఈ స్థాయికి చేరుకున్నాను. నా మీద పెద్దల ఉంచిన బాధ్యతను నిర్వర్తిస్తాను. రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని శ్రీహరి వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే అయిన తొలిసారే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం విశేషమని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీతోనే 1993 రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీహరి ఇప్పటి వరకూ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఈయన నిజాయితి, పార్టీకి చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర, కేంద్ర నాయకత్వం మంత్రిగా అవకాశం కల్పించింది.

Vakiti Srihari

Read Also- Samantha: నాగ చైతన్య నా ఫస్ట్ లవ్ అంటూ మళ్లీ ఓపెన్ అయిన సమంత

సామాన్య కార్యకర్త నుంచి..
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి మంత్రివరకూ ఎదిగిన వ్యక్తి. 1966లో పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లిలో జన్మించారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 1982లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత 1985లో పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి ఐటీఐ డిప్లమో పూర్తి చేశారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎకనామిక్స్ విభాగం హెడ్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం విద్యార్థి రాజకీయాల నుంచే ప్రారంభమైంది. 1982 నుంచి 1985 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 1994 వరకు ఎన్ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2009-2011 మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం తర్వాత మీడియాతో మాట్లాడిన అడ్లూరి.. ఈ అవకాశం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని రోజు అని, సామాన్య కార్యకర్తకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం అదృష్టం అని పేర్కొన్నారు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ఎస్‌యూఐ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. 32 లక్షల మంది 2011 జనాభా ప్రకారం మాదిగలు ఉన్నారు. ప్రస్తుతం 52 లక్షల మంది మాదిగలు ఉన్నారు. మా న్యాయమైన సమస్య అధిష్టానం ముందు పెట్టాం. జనాభా ప్రకారం హక్కులని రాహుల్ గాంధీ అన్నట్లు న్యాయం చేశారు. ఇంతటి గౌరవం దక్కింది అంటే.. జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన అవకాశం అని అడ్లూరి వ్యాఖ్యానించారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌తో ప్రస్థానం ప్రారంభించిన లక్ష్మణ్ అంచెలంచెలుగా ఎదిగారు. తన ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వత్తిడిలు వచ్చినా సరే అదరక, బెదరక నిలబడటంతో మెచ్చుకున్న అధినాయకత్వం విస్తరణలో భాగంగా కేబినెట్‌లోకి తీసుకున్నది.

Adluri Laxman

కాకా వారసుడిగా..
గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తి.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన ఇద్దరు కుమారులు గడ్డం వినోద్, గడ్డం వివేక్‌లు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చారు. 1963లో పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (ఆనర్స్) పట్టా పొందారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత డెక్కన్ క్రానికల్ దినపత్రికలో డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గడ్డం వివేక్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయాలకు ముందు, ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో బీఆర్ఎస్‌లో చేరారు. 2014-2018 మధ్య తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2019లో మళ్లీ పార్టీ మారి.. సొంత గూటికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2023లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌పై 3,700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా వివేక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం వివేక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. క్రీడా రంగంలో, మీడియా రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో గడ్డం ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, బలమైన సామాజిక వర్గం, అంతకుమించి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో.. వివేక్‌కు కేబినెట్‌లో హైకుమాండ్ చోటు కల్పించింది.

Gaddam Vivek

Read Also- Pawan Kalyan: సెలూన్‌ ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఓ రేంజిలో ఆడుకుంటున్నారుగా!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..