YS Jagan Questions Babu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: సీఎం చంద్రబాబును న‌డి రోడ్డుపై కొడ‌తారా?

YS Jagan: నడిరోడ్డుపై ద‌ళిత‌, ముస్లిం యువ‌కుల‌ను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చార‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రశ్నించారు. పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు? అని నిల‌దీశారు. కేసులు ఎవరి మీదా అయినా ఉండొచ్చని, ఆ వ్యహారాన్ని కోర్టులు చూసుకుంటాయ‌న్నారు. సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) 24 కేసులున్నాయని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. పోలీసులే (AP Police) చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా? ఇది ధర్మమేనా? పరువు, ప్రతిష్టలు తీసే హక్కు పోసులకు ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన జగన్ (YS Jagan Tenali Tour).. పోలీసుల చేతిలో చిత్ర హింసలకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నడిరోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ దాష్టికాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు గమనిస్తే, ప్రతి సంఘటనలో ఏ రకంగా చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం తీసుకువచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Read Also- YSRCP: ‘వెన్నుపోటు దినం’కు అడ్డంకులు వస్తే..?

YS Jagan Tenali

గొంతు నొక్కుతారా?
తనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే ఆ గొంతు అనగదొక్కే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు దగ్గరుండి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఏరకంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏ రకంగా వాళ్లను జైళ్లలో పెడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయిందనడానికి రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం మన కళ్లెదుటే కనిపిస్తున్న సత్యం. ఆ రకంగా రెడ్‌బుక్‌ (Red Book) రాజ్యాంగాన్ని నీవు ఉపయోగించుకోవడంతో పోలీసు వ్యవస్థ అదుపుతప్పితే ఎలాంటి వికృతరూపం దాల్చుతుందని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో జరిగిన ఘటనే సాక్ష్యం. రాష్ట్రంలో ఇంతటి భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో ఏం జరిగింది. ఎందుకింత అన్యాయమైన ఘటన జరిగిందో తెలుసుకునేందుకు అందరం కలిసికట్టుగా వెళ్దాం. పోలీసుల చేతిలో దెబ్బతిన్న రాజేష్‌ అనే పిల్లాడు, మరో పిల్లాడు చేబ్రోలు జాన్‌ విక్టర్, ఇంకో పిల్లాడు కరిముల్లా. వీరు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన అణగారిన వర్గాలకు చెందిన వారు. ఒకసారి ఘటన ఎలా జరిగిందో గమనించండి అని వైఎస్ జగన్ తెలిపారు.

YS Jagan

ఎవరా ఇద్దరు..?
రాకేష్‌ అనే పిల్లాడు తెనాలిలో ఉండడు. జూమాటో కంపెనీలో హైదరాబాద్‌లో పని చేస్తుంటాడు. వీళ్లంతా యంగ్‌ స్టర్స్, చిన్నతనంలో ఏదో పాత గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం ఈ పిల్లాడు తెనాలికి వచ్చాడు. ఈ పిల్లాడిని చూడటానికి ఇతని ప్రెండ్స్‌ వచ్చారు. ఇతడు కూడా పాలిటెక్నిక్‌ మెకానిక్‌ చదివాడు. ఇతన్ని చూడటానికి వచ్చిన ప్రెండ్స్‌ కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి జాన్ విక్టర్‌ వచ్చాడు. విక్టర్‌ అనే పిల్లాడు జూనియర్‌ అడ్వకేటు, బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రర్‌ అయ్యాడు. రాకేష్‌ను చూడటానికి తెనాలికి వచ్చాడు. అతని వెంటా కరిముల్లా అనే 21 ఏళ్ల యువకుడు వచ్చాడు. ఇత‌డు మెకానిక్‌. ఈ ముగ్గురు వచ్చే సమయానికి ఇదే ఐతానగర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. వీళ్ల ఏరియాకు వచ్చి ఎవరో ముక్కుముఖం తెలియని వ్యక్తి గొడవ పడుతుంటే వీళ్లు ఇన్వాల్వ్‌ అయి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఇదే వాళ్లు చేసిన తప్పు. జాన్‌ విక్టర్‌కు చెందిన బైక్‌ కీస్‌ సివిల్‌ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుల్‌ లాక్కునే కార్యక్రమం చేశాడు. ఫోన్‌ కూడా లాక్కునే కార్యక్రమం చేశాడు. మా కీస్, ఫోన్‌ ఎందుకు తీసుకున్నారని చెప్పి వాటిని వెనక్కి లాక్కున్నారు. అంతటితో ఆ కార్యక్రమం అయిపోయింది. ఎవరి దారికొద్ది వాళ్లు వెళ్లిపోయారు. జాన్‌ విక్టర్‌ కరిముల్లాతో కలిసి మంగళగిరికి వెళ్లిపోయాడు. రాకేష్‌ కూడా తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇది జరిగింది ఏప్రిల్‌ 24వ తేదీ. మళ్లీ మరుసటి రోజు ఏప్రిల్‌ 25వ తేదీ ఎంతటి దారుణం జరిగిందో గమనించండి. ఇదే కానిస్టేబుల్, ఈయనతో పాటు మరో కొందరు కానిస్టేబుల్స్‌ ఏకంగా మంగళగిరికి వెళ్లి జూనియర్‌ అడ్వకేట్‌ విక్టర్‌ను, కరిముల్లాను బైక్‌ల్లో కొట్టుకుంటూ తీసుకువచ్చారు. ఆ రోజు రాత్రింతా తెనాలి టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కొట్టారు. ఆ తరువాత ఏప్రిల్‌ 26వ తేదీన స్టేషన్‌కు దగ్గర్లో ఉన్న రోడ్డుపైకి తీసుకువచ్చి మళ్లీ కొట్టారు. రోడ్డు మీద షేమింగ్‌ చేస్తూ..వీళ్ల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ రోడ్డుపై పోలీసులు కొట్టారు. ఈ ఘటనలో తెనాలి టూ టౌన్‌ సీఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీసు స్టేషన్‌ సీఐ కూడా వీళ్లను కొట్టారు. ఆ రోజు అతికిరాతకంగా, నడిరోడ్డుపై వీళ్ల పరువు ప్రతిష్టలు తీస్తూ పోలీసులు కొట్టిన తీరు అంటూ ఘటనకు సంబంధించిన ఫోటోలు, కాళ్లకు తగిలిని బొబ్బలను మీడియాకు చూపించారు. ఆ తరువాత మరుసటి రోజు 27వ తేదీ మళ్లీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఐతానగర్‌లోని ఇంకో రోడ్డు సెంటర్‌లోకి తీసుకెళ్లి పట్టపగలే రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు. అంతేకాదు మూడు రోజులుగా వీరు పోలీసుల అదుపులోనే ఉన్నారు అని వైఎస్ జగన్ వెల్లడించారు.

YS Jagan With Media

మారణాయుధం ఎక్కడిది?
వీళ్లను నడిరోడ్డుపైకి తీసుకువచ్చి విక్టర్‌ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్‌వోలను పిలిచి మరణాయుధం విక్టర్‌ జేబులో ఉన్నట్లు పంచనామా రాయించారు. మరుసటి రోజు ఏప్రిల్‌ 28వ తేదీ వీళ్లను కోర్టులో హాజరు పరిచారు. ఇంతదారుణం వాళ్లను కొడితే కాళ్లకు బొబ్బలు పోయాయి. అయితే డాక్టర్‌ దగ్గర ఎలాంటి దెబ్బలు తగులేదని చెప్పి సర్టిఫికెట్‌ తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని జడ్జిగారికి చెబితే మళ్లీ ఎస్పీ ఆఫీస్‌కు తీసుకెళ్లి కరెంట్‌ షాక్‌ ఇస్తామని పోలీసులు బెదిరించారు. మనం ఏ సమాజంలో ఉన్నామని అడుగుతున్నాను. కోర్టులో ప్రవేశ‌పెట్టే ముందు వీళ్ల ముగ్గుర్నీ ఆస్ప్రత్రికి ఎందుకు తీసుకెళ్లాల్సి వ‌చ్చింది? త‌న‌ను పోలీసులు కొట్టార‌ని, గాయాలు కూడా ఉన్నాయ‌ని, వీరు ప‌దే ప‌దే గాయాలు చూపుతూ డాక్టర్లను అడిగితే వారెందుకు నోట్ చేయ‌లేదు? ఇన్ని గాయాలు క‌నిపిస్తున్నా వారు ఎందుకు నోట్ చేయ‌లేదంటే.. మెడికో లీగ‌ల్ కేసు అవుతుంద‌నే భ‌యంతోనే. మెడికో లీగ‌ల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్‌ను బెదిరించైనా ఉండాలి లేదా ప్ర‌లోభాల‌కు గురిచేసైనా ఉండాలి. ఏప్రిల్ 26న న‌డిరోడ్డుపై ఈ ముగ్గుర్నీ ఇలా కొడుతుంటే నెల రోజుల త‌ర్వాత ఈ వీడియో బయ‌ట‌కొచ్చింది. వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జ‌రుగుతున్న అన్యాయాల‌ను జీర్ణించుకోలేక మంచి వారైన పోలీసులు ఈ వీడియోను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఒకవైపున చ‌ట్టాల‌ను ఉల్లంఘించి అప‌హాస్యం చేసింది పోలీసులే. మ‌రోవైపున పోలీసులే వీరిని అభాసుపాలు చేస్తూ వీరి కుటుంబ గౌర‌వాల‌ను మంట క‌లుపుతూ చెయ్యకూడ‌ని ప‌నులున్నీ చేసి వీరి మీద రౌడీ ముద్ర వేస్తున్నారు. వారు చేసిన ప‌నులను జెస్టిఫై చేసుకోవ‌డం కోసం ఈ యువ‌కుల మీద సంఘ విద్రోహ శ‌క్తులుగా, నేర‌స్తులుగా గంజాయి బ్యాచ్‌గా, రౌడీలుగా వీరి మీద ముద్ర వేసే ప్రయ‌త్నం చేస్తున్నారు అని జగన్ మండిపడ్డారు.

Read Also- KCR: కాళేశ్వరం విచారణకు సమయం కోరిన కేసీఆర్.. పెద్ద ప్లానే ఉందే!

 

YS Jagan Tenali Tour

సంబంధమేంటి?
ఆ పాత కేసులకీ వీటికీ ఏంటి సంబంధం. ఈ జ‌రిగిన ఘ‌ట‌న‌కి పాత కేసులేమైనా ఉన్నాయేమో నాకు తెలియ‌దు. ఈ ఘ‌ట‌న సందర్భంగా యువ‌కుల‌ను ఇళ్ల నుంచి బల‌వంతంగా లాక్కొచ్చి వారిని దారుణంగా రోడ్డు మీద కొట్టి షేమింగ్ చేశారు. జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఇలా వ‌క్రీక‌రించి వ్యక్తిత్వ హ‌న‌నం చేస్తున్న పోలీసుల‌ను ఒకటే అడుగుతున్నా, విక్టర్ జూనియ‌ర్ అడ్వకేట్ కాదా అని అడుగుతున్నా. ఈ పాప రాకేష్ చెల్లెలు ఇంజ‌నీర్‌. రాకేష్ పాలిటెక్నిక్ మెకానిక‌ల్ చ‌దివాడు. అంటే, వీరిది చదువుకున్న కుటుంబం. చ‌దువుకున్న కుటుంబం నుంచి వ‌చ్చిన వారిని ఇలా రోడ్డు మీద‌కి తీసుకొచ్చి కొట్టి ప‌రువు తీయ‌డం ధ‌ర్మమేనా? పోలీసులు చెబుతున్నట్టు వీరికి ఇంత దారుణ‌మైన బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవ‌మే అయితే మంగ‌ళ‌గిరికి చెందిన వీరిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే అర్థం ఏంట‌ని పోలీసుల‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే పోలీసులు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని క‌దా? వీరి మీద న‌మోదైన కేసులు పెద్ద కేసులే కాద‌నే క‌దా అర్థం. అవ‌న్నీ వ‌క్రీక‌రిస్తూ ఇప్పుడు వాడుకుంటున్నార‌నే క‌దా అర్థం. మ‌రో వ్యక్తి క‌రీముల్లా. ఇత‌ని వ‌య‌సు 21 సంవ‌త్సరాలు. ఇత‌ని మీద ఎలాంటి కేసులు కూడా లేవు. విక్టర్‌, రాకేష్‌, క‌రీముల్లా.. ఈ ముగ్గురు మీద రౌడీ షీట‌ర్లుగా కేసు న‌మోదు చేసింది కూడా ఈ ఘ‌టన జ‌రిగిన త‌ర్వాత‌నే. ఈ ఇష్యూ పెద్దద‌వుతుంద‌ని తెలిసిన త‌ర్వాత‌నే వారి మీద రౌడీషీట‌ర్లుగా కేసు న‌మోదు చేశారు. పోలీసులు దుర్మార్గాల‌కు పాల్పడ్డార‌న్నది ఇంత ప్రస్ఫుటంగా క‌నిపిస్తోంది. వీరిని పరామ‌ర్శించి, జ‌రుగుతున్న అన్యాయాల మీద సంఘీభావం తెలపడానికి ఎవ‌రైనా వ‌స్తే చంద్రబాబు, ఆయ‌న ఎల్లో మీడియా, సోష‌ల్ మీడియా వీరిది గంజాయి బ్యాచ్ అని, వీరు రౌడీ షీట‌ర్లు అని వారి కుటుంబాల‌ను ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతూ ప‌రువు తీస్తున్నారు. గ‌తంలో కేసులు ఎవ‌రి మీద‌నైనా ఉండొచ్చు. గిట్టని వారు కేసులు పెట్టి ఉండొచ్చు. చేయ‌లేద‌ని వీరు చెబుతుండొచ్చు. చేశార‌ని కేసులు పెట్టిన వారు చెప్పొచ్చు. అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధ‌ర్మమేనా అని అడుగుతున్నా? పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్‌లు ఇస్తారు. ఇలా చేయ‌గ‌లిగే నైతికత పోలీసులకు ఉందా? అని అడుగుతున్నా? ఇలా చేయ‌డం ధర్మమేనా అని అడుగుతున్నా అని పోలీసులకు జగన్ సూటి ప్రశ్న సంధించారు.

Read Also- Nagarjuna: 45 ఏళ్లు వచ్చినా నాగ్ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదేం?

YS Jagan Tour

ధర్మమేనా.. అని అడుగుతున్నా?
చంద్రబాబు మీద 24 కేసులున్నాయి. అలా అని ఆయ‌న్ను న‌డిరోడ్డు మీద‌కు తీసుకొచ్చి త‌న్నడం ధ‌ర్మమేనా? అని అడుగుతున్నా. పాత కేసులు ఉన్నాయ‌ని తీసుకొచ్చి కొట్టడం పోలీసులు చేసిన ప‌నికి జస్టియ‌ఫ‌య‌బుల్ కాజ్ కాదిది. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోప‌ణ‌లు చేశారు. అది న్యాయం కాద‌ని అవ‌త‌లి వారు కోర్టుల్లో వాదిస్తారు. జడ్జిలు కోర్టుల్లో వాద‌న‌లు వింటారు. జడ్జి తీర్పునిస్తారు. అంతేకానీ గ‌తంలో వారిపై కేసులు ఉన్నాయి క‌దా? అని పోలీసులు వారిని తీసుకొచ్చి న‌డి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్ చేస్తూ వారి కుటుంబ ప‌రువును తీయ‌డం భావ్యమేనా? ఇది రాకేష్ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్‌రే. కాలు విరిగిపోయి లోపల రాడ్డు వేసి ఆపరేష‌న్ చేశారు. ఈ విష‌యం పోలీసుల‌కు చెబుతున్నా వారు వినిపించుకోకుండా రాకేష్ కాలిపై బూటు కాళ్లతో నిల‌బ‌డి తొక్కుతూ న‌డి రోడ్డు మీద దారుణంగా కొట్టడం ధ‌ర్మమేనా అని అడుగుతున్నా. ఈ మ‌ధ్య కాలంలోనే హ‌రికృష్ణ అనే వ్యక్తి మీద దాచేప‌ల్లిలో త‌ప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్స్‌లో ప‌డేస్తే వారి త‌ల్లిదండ్రులు , గ్రామ‌స్తులు వ‌చ్చి ఆందోళ‌న చేసి అత‌డిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హ‌రికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవ‌ని డాక్టర్లతో దొంగ స‌ర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఈ హ‌రికృష్ణ ఇప్పటికీ గాయాల‌తో బాధ‌ప‌డుతూనే ఉన్నాడు. రాజ‌మండ్రిలో పులిసాగ‌ర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్. ద‌ళిత యువ‌కుడిని పోలీస్ స్టేష‌న్‌లో రాత్రంతా అర్థన‌గ్నంగా నిల‌బెట్టారు. రాత్రంతా చిత్రహింస‌లకు గురిచేశారు. పోలీసులా వీరు రాక్షసులా? సోష‌ల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అత‌డి పరిస్థితి ఇది. మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా వైసీపీకి చెందిన సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌లు సుధారాణి, పాలేటి కృష్ణవేణిల‌ మీద ర‌క‌ర‌కాల పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోదు చేసి నెల‌ల త‌ర‌బ‌డి తిప్పుతూ వేధించారు. ఇదంతా చూశాక మ‌నం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అని ప్రజ‌లంతా ఆలోచ‌న చేయాలి అని జగన్ వ్యాఖ్యానించారు.

Tenali Incident

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా..
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సీఐలు, డీఎస్పీలు, ఎస్సైల‌ను క‌లెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మ‌ద్యం ద‌గ్గర్నుంచి, ఇసుక‌, మ‌ట్టి, పేకాట క్ల‌బ్బుల వ‌ర‌కు ఎమ్మెల్యేలు ద‌గ్గరుండి న‌డిపిస్తున్నారు. పోలీసులు వాటికి ర‌క్షణ క‌ల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వ‌సూలు చేసి.. పోలీసుల‌కింత‌, ఎమ్మెల్యేకి ఇంత‌, చంద్రబాబుకి ఇంత‌, లోకేష్‌కి ఇంత అని పంపకాలు జ‌రుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే జ‌రుగుతోంది. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు క‌నిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు ద‌గ్గర డ‌బ్బులు తీసుకుని ప‌ర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. ప‌ర్మిష‌న్ లేకుండా ఇల్లీగ‌ల్ ప‌ర్మిట్ రూములు క‌నిపిస్తున్నాయి. ప్రతి ప‌ర్మిట్ రూమ్‌కి, ప్రతి బెల్ట్ షాపు నుంచి పోలీసులు క‌మీష‌న్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మ‌ట్టి, సిలికా, క్వార్ట్జ్‌, లేట‌రైట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదీ వ‌ద‌ల‌కుండా వ‌సూళ్ల కార్యక్రమం జ‌రుగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిన పరిస్థితుల మధ్య, స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యారంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్యరంగం పూర్తిగా దివాళ తీసింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఏడాదిగా రూ.3600 కోట్ల బకాయిలు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ పేదవాడు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు అందుకునే పరిస్థితి లేదు. మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు, ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్‌ నాశనమైపోయింది. ఆర్‌బీకేలు నిర్వీర్యమైపోయాయి. సమయానికే రావాల్సిన ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రాని పరిస్థితి. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది. ఇంకోవైపు లా అండ్‌ఆర్డర్‌ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటి అన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లు గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో చెప్పిన 143 హామీలను వీళ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రప్రజలందరూ కూడా గళం విప్పమని మరొక్కసారి పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడానికి ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని రాష్ట్ర ప్రజలను వైఎస్ జగన్ కోరారు.

Read Also- Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..