KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణకు హాజరు కావడానికి మరింత సమయం కోరారు. జూన్-5న కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే 11న హాజరయ్యేందుకు కమిషన్‌ను గులాబీ బాస్ అనుమతి కోరారు. 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghose Commission) ముందు హాజరవుతారని అధికారికంగా బీఆర్ఎస్ (BRS) అధికారికంగా ప్రకటించింది. కేసీఆర్ విజ్ఞప్తికి ఓకే చెప్పిన కమిషన్.. విచారణ తేదీని మార్చింది.
సారు ప్లాన్ ఇదేనా..?
కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది? ప్రాజెక్టుకు ఎస్టిమేషన్ ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఈ ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు నీరందించాం? అనే వివరాలు, వరి దిగుబడిలో సాధించిన విజయం, ఎన్ని జిల్లాల ప్రజలకు నీరందించిన వివరాలు, భూగర్భజలాలు పెరగడానికి ఎలా ప్రాజెక్టు దోహదపడింది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అనుసరించిన తీరును ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. అదే విధంగా తమ్మిడి హెట్టి దగ్గర నీటి లభ్యత ఉంటే ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదు? కాళేశ్వరం దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే వివరాలను కమిషన్‌కు వివరించాలని ఆయన అనుకుంటున్నారట. ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయకపోవడంతో యాసంగిలో రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం వివరించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమిషన్ ముందు ఏయే అంశాలు ప్రస్తావించాల్సిన అంశాలపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కమిషన్ విచారణ అనంతరం అవసరమైతే మీడియా ముందు సైతం వివరాలను వెల్లడించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరుపై కేసీఆర్, హరీశ్ రావు భేటీ అయిన విషయం తెలిసిందే.
Read Also- Kavitha: నిన్న కేసీఆర్‌కు, ఇవాళ సీఎంకు కవిత లేఖ.. ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్!
కర్త, కర్మ.. క్రియ..!
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సైతం నీరు లీకేజీ అవుతుందని, ప్రమాదం అంచులో ఉన్నాయని విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను, నిర్మాణ సంస్ఠల ప్రతినిధులను సైతం కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి, వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థికశాఖల అధికారులను సైతం విచారణ చేసింది. ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ విచారణ చేసింది. ఈ విచారణలో ఎక్కువ మంది కేసీఆర్ పేరే చెప్పినట్లు సమాచారం. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపిక, డైజన్ ఎంపికలో సైతం కేసీఆర్ చెప్పినట్లే చేశామని పేర్కొన్నట్లు తెలిసింది. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్ చేసినట్లు నిర్ధారణకు వచ్చి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు 400 పేజీల డాక్యుమెంటరీని సైతం సిద్ధం చేసింది. అయితే కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌ను విచారించిన తర్వాత తుది రిపోర్టును ప్రభుత్వానికి కమిషన్ అందజేయనున్నట్లు సమాచారం.
నేనొస్తున్నా..
ఇదిలా ఉంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానని మరోసారి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘ మాజీ మంత్రి హరీశ్ రావును నేను కలవలేదు. అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు పగటికలలు కంటున్నారు. ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదు. ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గత పాలనలో ఒక కుంటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. ప్రజల ఆశలను అడియాసలు చేసిన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్. తెలంగాణ ప్రజలకు దిక్సూచి బీజేపీ’ అని ఈటల తేల్చిచెప్పారు. కాగా, రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు.
Read Also- Sharmishta Panoli: ఒకే ఒక్క ట్వీట్‌తో జైలుపాలు.. ఎవరీ శర్మిష్ఠ పనోలి.. ఎందుకింత రచ్చ?