siddipet man Suicide: అలవి కాని కోరికలతో యువత పెడదారి పడుతుంది. తమ ఆర్థిక స్తోమత గుర్తించకుండా మత్తుకు బానిసలై తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ పలువురు యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు బిఎండబ్ల్యూ కారు కొనివ్వాలని తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ జానీ 21 బొమ్మ కనకయ్య, కనకమ్మల చిన్న కుమారుడు. కనకయ్య కుటుంబానికి ఎకరంకు పైగా వ్యవసాయ భూమి ఉండగా కొంత ఇటీవల విక్రయించి ఇల్లు కట్టుకున్నారు.
కొద్దిపాటి భూమి మిగలగా తల్లిదండ్రులు పండ్ల తోటలో కూలీలుగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు జానీ బిఎండబ్ల్యూ కారు కొనివ్వాలని తల్లిదండ్రులను పదేపదే సతాయిస్తూ వచ్చాడు. అంత విలువైన కారు కొనలేమని సర్ది చెప్పినా వినకపోవడంతో గత్యంతరం లేక ఉన్న కాస్త భూమిని అమ్మి షిఫ్ట్ డిజైర్ కారు కొనివ్వాలని నిర్ణయించుకొని సిద్దిపేట లోని ఒక కారు షోరూంలో చూపించి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చెప్తే వినని కొడుకు ఏ అగాయిత్యానికి పాల్పడతాడో అన్న భయంతో స్తోమత లేకున్నా భూమిని అమ్మైనా కారు కొని వాళ్ళని తల్లిదండ్రులు భావించారు.
Also Read: Train Accident: గొర్రెలకు మేత కోసం చెట్టుపైకి ఎక్కారు.. కొమ్మ విరగటంతో ట్రాక్ పై పడ్డారు!
అయితే తనకు షిఫ్ట్ డిజైర్ కారు వద్దని బీఎండబ్ల్యూ కారు మాత్రమే కావాలని జానీ మొండికేశాడు. తను కోరిన కారును కొనివ్వడం లేదని మనస్థాపనతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు శనివారం తాగి ఆత్మహత్య పాల్పడగా గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాతకు గురయ్యాడు. జానీ మత్తకు బానిసగా ఆయన మరణం తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖాన్ని నింపింది.
నిరుపేద కుటుంబానికి చెందిన కొడుకు తల్లిదండ్రులను పెట్టిన ఇబ్బందులు ఏ పిల్లల తల్లిదండ్రులకు ఏర్పడ వద్దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. యువకులు పెడదారి పడుతున్నారని తల్లిదండ్రులకు, సమాజానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసలై స్తోమత లేని కోరికలు కోరి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఇబ్బందుల గురిచేస్తున్న యువకులలో మార్పు కోసం, మత్తుమందుల విక్రయాలను అరికట్టడం కోసం తగిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని పాలువురు పేర్కొన్నారు.
Also Read: GHMC officials: గట్టిగా వాన పడితే ఆగమాగమే.. టెండర్ల రద్దుకు అసలు కారణాలు ఇవేనా?