Gang Arrested: పక్కాగా సేకరించిన సమాచారంతో మహేశ్వరం జోన్ ఎస్వోటీ అధికారులు బాలాపూర్ పోలీసులతో కలిసి అంతర్ రాష్ట్ర గ్యాంగును అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 తపంచాలు, 18 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎల్బీనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జరిపిన మీడియా సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఎస్వోటీ అదనపు డీసీపీ షాకీర్ హుస్సేన్ లతో కలిసి వివరాలు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ సిటీకి చెందిన మహ్మద్ జీషాన్ (28) వృత్తిరీత్యా క్షురకుడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్ (24) అతని స్నేహితుడు. 2016లో మహ్మద్ జీషాన్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ వలస వచ్చి రక్షాపురంలో స్థిరపడ్డాడు. మొదట ఓ హెయిర్ కటింగ్ సెలూన్ లో పని చేసి 2019లో రక్షాపురంలో సొంతంగా దుకాణం పెట్టాడు. దాంతోపాటు గోల్కొండ, బాలాపూర్ లలో మరో రెండు హెయిర్ కటింగ్ సెలూన్లను ప్రారంభించాడు. మూడేళ్ల క్రితం స్నేహితుడు మహ్మద్ అమీర్ ను పిలిపించుకుని తన వద్ద పనిలో పెట్టుకున్నాడు.
Also Read: Sabitha Indra Reddy: 2వేల ప్రభుత్వ స్కూళ్ల ను మూసేశారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
దురలవాట్లకు బానిసై…
ఇదిలా ఉండగా మహ్మద్ జీషాన్ కొంతకాలంగా మద్యం తదితర దురలవాట్లకు బానిసయ్యాడు. దాంతోపాటు జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. నడుపుతున్న షాపుల నుంచి సరిపోయినంత ఆదాయం రాకపోతుండటంతో స్వస్థలానికి వెళ్లి తపంచాలు, బుల్లెట్లు కొని తెచ్చి ఇక్కడ అసాంఘిక శక్తులకు ఎక్కువ ధరలకు అమ్మాలని పథకం వేశాడు. ఈ క్రమంలో మహ్మద్ అమీర్ ను వెంట తీసుకుని రాంపూర్ సిటీకి వెళ్లి తనకు తెలిసిన అర్షిఖాన్ ద్వారా అక్రమ ఆయుధాల వ్యాపారం చేసే వారిని కలిశాడు. వారి నుంచి 5 తపంచాలు, 18 బుల్లెట్లు కొని నగరానికి తీసుకొచ్చాడు.
ఉదయం బాలాపూర్ లోని తన హెయిర్ కటింగ్ సెలూన్ లో వాటిని భద్రపరచటానికి మహ్మద్ అమీర్ తో కలిసి బయల్దేరాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన మహేశ్వరం ఎస్వోటీ అధికారులు, బాలాపూర్ పోలీసులతో కలిసి రాయల్ కాలనీ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి తపంచాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై మారణాయుధాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Corporators: ఆగని కార్పొరేటర్ల ఆగడాలు.. భార్యల పదవులతో రెచ్చిపోతున్న భర్తలు!