GHMC street lights: గ్రేటర్ హైదరాబాద్ లోని స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నిన్నమొన్నటి వరకు స్ట్రీట్ లైట్ల నిర్వహణకు మెరుగైన విధానాన్ని అవలంభించాలని భావించిన జీహెచ్ఎంసీ మళ్లీ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు బుధవారం మేయర్, స్టాండింగ కమిటీ సభ్యులు, అధికారులు ఈ విషయంపై సమావేశం నిర్వహించి మళ్లీ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకే అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా మెరుగైన నిర్వహణ కోసమంటూ 2017లో సిటీలోని సుమారు 5.37 లక్షల స్ట్రీట్ లైట్ల నిర్వహణను ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) కు అప్పగించారు.
30 సర్కిళ్లలో ఈఈఎస్ఎల్ ఈ స్ట్రీట్ లైట్లను 15 ప్యాకేజీలుగా నిర్వహణ చేపట్టింది. ప్రతి నెల ఈఈఎస్ఎల్ కు జీహెచ్ఎంసీ సుమారు 80 కోట్లను చెల్లిస్తున్నా, నిర్వహణ మెరుగుపడకపోగా, మరమ్మతుల కోసం కనీసం 5 శాతం బఫర్ స్టాక్ ను కూడా పాటించటంలో ఈఈఎస్ఎల్ విఫలం కావటంతో జీహెచ్ఎంసీ ఈఈఎస్ ఎల్ ను ఈ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్దమైంది. జీహెచ్ఎంసీ కోరిన విధంగా ఈఈఎస్ఎల్ మెయింటేన్ చేయలేకపొవటం, గత నెలాఖరు కల్లా ఈఈఎస్ఎల్ అగ్రిమెంట్ ముగియటంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరో రెండు నెలల పాటు స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ బాధ్యతలను కొనసాగించి, అంతలోపు కొత్త విధానాన్ని సమకూర్చుకోవాలని అధికారులు భావించారు.
Also Read: Kalvakuntla Kavitha: దళిత బిడ్డలంటే కాంగ్రెస్ ఇంత వివక్షా?.. కవిత సంచలన కామెంట్స్!
ఇందులో భాగంగానే నగరంలోని సుమారు 5.37 లక్షల స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం సుమారు 32 వేల 271 సెంట్రల్ కమాండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) బోర్డులుండగా, ఒక్కో బోర్డులో 15 నుంచి 20 వరకు స్ట్రీట్ లైట్లున్నాయి. ఈ రకంగా ప్రతి 30 మీటర్లకు ఒక పోల్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సీసీఎంఎస్ బోర్డులు మినహా మిగలిని వేలాది స్ట్రీట్ లైట్లను నేటికీ మ్యానువెల్ గా నే మానిటరింగ్ చేస్తున్నారు. త్వరలోనే లైట్ల మెయింటనెన్స్ ప్రైవేటు సంస్థలకు అప్పగించిన తర్వాత మ్యానువెల్ గా నిర్వహణ చేస్తున్న లైట్లను కూడా సీసీఎంఎస్ పరిధిలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.
మూడు విధానాలకు ఈఓఐ
జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణను మరింత మెరుగుగా నిర్వహించేందుకు ఈఈఎస్ఎల్ అగ్రిమెంట్ ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు మెరుగైన మెయింటనెన్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెన్స్ (ఈఓఐ) కింద మూడు రకాలుగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేందుకు వీలుగా సంస్థలను ఆహ్వానించింది. ఇండివిజ్యూవల్ లుమినార్ కంట్రోల్(ఐఎల్ సీ), ఇండివిజ్యూవల్ లుమినార్ మానిటరింగ్ (ఐఎల్ ఎం) విధానాలతో పాటు స్కాడా నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కూడా ఈఓఐ సంస్థలను ఆహ్వానించింది.
ఈ టెండర్లకు నేటితో గడువు ముగియనుంది. వీటిలో ఒక్కో స్ట్రీట్ లైటు ప్రకారంగా నిర్వహణ, కొన్ని స్ట్రీట్ లైట్ల సామూహికంగా నిర్వహణ చేపట్టే ఆప్షన్లు కూడా ఉన్నాయి. అంతేగాక, స్ట్రీట్ లైటు వెలిగితేనే కరెంటు బిల్లు చెల్లించేలా, ఒక రోజు ఒక స్ట్రీట్ లైటు వెలగకుంటే రూ. 500 జరిమానా విధించేలా ఈ ఐఎల్ సీ, ఐఎల్ఎం విధానాలున్నాయి. ఈ టెండర్లను గురువారం ఓపెన్ చేయనున్న అ ధికారులు వీటిలో ఏ విధానాన్ని ఎంచుకుంటారు? ఏ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారన్నది క్లారిటీ రావల్సి ఉంది.
Also Read: KTR: కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నరాజకీయాలే చిల్లర.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు రెండు నెలల సమయం పట్టే అవకాశమున్నట్లు ముందే గుర్తించిన జీహెచ్ఎంసీ వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకుని స్ట్రీట్ లైట్ నిర్వహణను కొనసాగించేందుకు తాత్కాలికంగా రెండు నెలల బాధ్యతను మళ్లీ ఈఈఎస్ఎల్ కే అప్పగించింది. ప్రైవేటు సంస్థలకు లైట్ల మెయింటనెన్స్ అప్పగించిన తర్వాత ఈఈఎస్ఎల్ చేసిన తప్పిదాలను ఇప్పటికే నోటెడ్ చేసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి తప్పిదాలు పునరావృతం కావద్దనే నిబంధనను విధించి ప్రైవేటు సంస్థలకు బాధ్యతలను అప్పగించేలా ఒప్పందం చేసుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది.
Also Read: Jeedimetla police: మావోయిస్టుల పేర బెదిరింపు లేఖ.. ఇద్దరు నిందితుల అరెస్ట్!