Kavitha: దళిత బిడ్డలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత వివక్షా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎస్సీ గురుకులాల్లో టాయిలెట్లు, హాస్టల్ గదులను విద్యార్థులతో క్లీన్ చేయించాలని ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులాల సెక్రటరీ అధికారులు, గురుకులాల ప్రిన్సిపాల్స్ కు ఆదేశాలు ఇస్తున్న ఆడియో క్లిప్ ను ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో విద్యార్థుల దుస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల్లో శానిటేషన్, స్వీపింగ్ పనులు చేసే వర్కర్స్ తొలగింపుపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో గురుకులానికి నెలకు శానిటేషన్, స్వీపింగ్ పనులు చేయడానికి రూ.40 వేల చొప్పున నిధులు ఇచ్చేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల నుంచి ఆ నిధుల విడుదలను ఆపేసి గురుకులాల విద్యార్థులతోనే శానిటేషన్, క్లీనింగ్ పనులతో పాటు కిచెన్ లోనూ పనులు చేయించాలని ఆదేశించడం దారుణమన్నారు. విద్యార్థులకు శ్రమవిలువ (డిగ్నిటీ ఆఫ్ లేబర్)ను నేర్పుతున్నామనే సాకుతో వారితో వెట్టిచాకిరీ చేయించడం మంచిది కాదన్నారు. చదువుకునే పిల్లలతో పనులు చేయించాలనే ఆదేశాలు ఇవ్వడమే దారుణమన్నారు. 240 గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్ లను విధుల నుంచి తొలగించి వారు చేసే పనులను సైతం విద్యార్థులతోనే చేయిస్తున్నారని మండిపడ్డారు. వంటశాల నిర్వహణ, మెస్ పనులు కూడా విద్యార్థులతో చేయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు.
Also Read:Rangareddy district: వన మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం.. అధికారులకు కలెక్టర్ కీలక అదేశాలు!
‘సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాంగ్ గ్రాండ్ నుంచి వచ్చారా? వెళ్లి కూర్చోగాని టేబుల్ పైకి ఫుడ్ రావడానికి.. క్లీనింగ్ సిబ్బంది అన్ని పనులు చేయడానికి ఉండటానికి.. విద్యార్థులు ఎందుకు పనులు చేయరు.. అది నా ఆర్డర్ అని చెప్పి చేయించండి? అని ఒక ఐఏఎస్ అధికారి ఆదేశాలు ఇవ్వడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇలాంటి వివక్ష నుంచి తప్పించడానికే కదా ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేసింది.. ఆ స్ఫూర్తిని విస్మరిస్తే ఎలా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ గురుకులాల్లో 1,200 మంది ఉద్యోగులను తొలగించిందని ఇది అన్యాయమన్నారు.
కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్తూ గురుకులాల్లో పని చేస్తున్న వారిని తొలగించి విద్యార్థులపై పని భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. పిల్లలందరినీ సమ దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం గురుకులాలను వివక్ష కేంద్రాలుగా మార్చడం దారుణమన్నారు. ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించే ప్రభుత్వ ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక వైఖరిని, ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నానని అన్నారు. వెంటనే విద్యార్థులతో పని చేయించడం ఆపివేయాలని.. ఐఏఎస్ అధికారిని విధుల నుంచి తప్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Mega Job Mela: మెగా జాబ్ మేళా.. 11,000 ఉద్యోగాల అవకాశాలు!
అదే విధంగా గురుకులాల్లో టీచింగ్ స్టాఫ్ తో వార్డెన్ డ్యూటీలు చేయించడం దారుణమన్నారు. విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి వారిని తీర్చిదిద్దాల్సిన డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలతో గురుకులాల్లో వార్డెన్ డ్యూటీలు చేయిస్తున్నారని తెలిపారు. టీచింగ్ స్టాఫ్ కు వంతుల వారీగా వార్డెన్ డ్యూటీలు వేస్తుండటంతో వాళ్లు తీవ్ర ఒత్తిడికి, మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. వెంటనే అన్ని గురుకులాల్లో వార్డెన్లను నియమించి టీచింగ్ స్టాఫ్ ను ఆ ఇబ్బందులను తప్పించాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
Also Read: CM Revanth Reddy: కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా పని చేయాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!