Jeedimetla police: మావోయిస్టుల పేర బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 నాటు బాంబులు, ఓ బెదిరింపు లేఖతోపాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారుడైన కూన రాఘవేందర్ గౌడ్ షాపూర్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈనెల 22న రాఘవేందర్ పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన తండ్రి ఫోన్ చేసి ఇంటి ముందున్న తులసిచెట్టును దుండగులు ధ్వంసం చేశారని, ఎరుపు రంగు రుమాలులో ఓ ఉత్తరాన్ని కారు ముందు అద్దం వైపర్ కింద పెట్టి వెళ్లారని అతనికి చెప్పాడు.
వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన రాఘవేందర్ లేఖను చూడగా మావోయిస్టులు రాసినట్టుగా లెటర్ కనిపించింది. అందులో 50లక్షల రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో తులసిమొక్కను ధ్వంసం చేసినట్టుగా రాఘవేందర్ పై దాడి చేస్తామన్న బెదిరింపు అగుపించింది. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన జీడిమెట్ల సీఐ మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేంసాగర్ తోపాటు కానిస్టేబుళ్లు నరేశ్, రవి నాయక్, వెంకటేశ్ లతో కలిసి విచారణ ప్రారంభించారు. రాఘవేందర్ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. వీటి ఆధారంగా ప్రస్తుతం షాపూర్ నగర్ లో నివాసం ఉంటున్న గన్నవరం నివాసి ఎర్రంశెట్టి రాజు (33), గన్నవరం ప్రాంతానికే చెందిన కందురెల్లి రాజు (24)లు ఈ నేరానికి పాల్పడినట్టుగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చేపట్టి బుధవారం ఉదయం హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Rajendra Prasad: ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ అప్పట్లో లేదు.. పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యింది అందుకే!
ఆర్థిక సమస్యల నుంచి…
విచారణలో ఆర్థిక సమస్యల నుంచి బయట పడటానికే మావోయిస్టుల పేర బెదిరింపులకు పాల్పడినట్టు నిందితులు వెల్లడించారు.ఉపాధిని వెతుక్కుంటూ కొంతకాలం క్రితం షాపూర్ నగర్ కు వచ్చి స్థిరపడ్డ ఎర్రంశెట్టి రాజు ఓ ప్రైవేట్ కంపెనీల పని చేశాడు. అతని పని తీరు సరిగ్గా లేకపోవటంతో మూడు నెలల క్రితం కంపెనీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఇటువంటి పరిస్థితుల్లోనే కందురెల్లి రాజు అతని వద్దకు వచ్చాడు. ఇద్దరికీ ఆర్థిక సమస్యలు ఉండటంతో వాటి నుంచి బయట పడటానికి మావోయిస్టుల పేర బెదిరించి డబ్బు వసూలు చేయాలని పథకం వేశారు.
ఇందులో భాగంగానే కూన రాఘవేందర్ గౌడ్ కు బెదిరింపు లేఖ పంపించారు. అయితే, తాము ఆశించిన స్పందన రాకపోవటంతో ఇద్దరు కలిసి గన్నవరం వెళ్లిపోయారు. అక్కడ నాటు బాంబులను తయారు చేసి వాటిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు. రాఘవేందర్ ఇంటి బయట బాంబులను పేలిస్తే డబ్బు ఇస్తారని భావించారు. ఈ కుట్రను అమలు చేయటానికి ముందే పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు.
Also Read: Kalvakuntla Kavitha: దళిత బిడ్డలంటే కాంగ్రెస్ ఇంత వివక్షా?.. కవిత సంచలన కామెంట్స్!