Tollywood: థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంపై రాద్ధాంతం ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి, ఈ ప్రతిపాదన చేసింది కూడా జనసేన నేత అత్తి సత్యనారాయణ అంటూ పెద్ద ఎత్తునే ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి జనసేన తప్పించింది. ఇందులో నిజానిజాలెంత? అని నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. ఒక్క రోజు వ్యవధిలోనే మీడియా ముందుకొచ్చిన జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగింది? థియేటర్ల బంద్ వెనుక ఎవరెవరు ఉన్నారు? దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరనేది తేల్చి చెప్పేశారు.
Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!
తమ్ముడిని కాపాడుకోవడానికి..
‘ థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రస్తావించలేదు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే నిర్మాత దిల్‌రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి, అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు, అభాండం వేశారు. ఏప్రిల్-19న తూర్పు గోదావరిలో ఇదంతా జరిగింది. ఎపిసోడ్ అంతా అక్కడ్నుంచే వచ్చిందని, మొత్తం అంతా తిప్పి నా మీదే పెట్టడానికి ప్రయత్నించారు. ఇదంతా నిర్మాత దిల్‌రాజు.. అతని తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు. థియేటర్ల బంద్ గురించి శిరీష్ రెడ్డి ప్రకటించారా? లేదా? అనేది ఆన్ రికార్డ్ ఉంది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకించడంతో ఆశ్చర్యపోయారు. ఎవరు ఏమనుకున్నా సరే.. నా మాట, ఏసియన్ ఫిలింస్ సురేష్ ఒక్కటే అని ఆయన చెప్పారు. జూన్1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆయనే. వాళ్ల తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి నా మీద, మా పార్టీ మీద రుద్దడానికి ఇదంతా చేశారు. ఇవన్నీ వాస్తవమా? కాదా? అన్నది ఆన్ ది రికార్డ్‌లో చూడండి. ఆయన (శిరీష్) తొడకొట్టి మరీ చెప్పారు. మూడు సెక్టార్ల మీటింగ్‌లో కూడా ఇదే మాట అన్నారు. ఒకటో తారీఖు నుంచి బంద్ చేస్తున్నాం అని చెప్పారు’ అని సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also- Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?
దమ్ముంటే నిరూపించు..
‘ ఏప్రిల్-19న ఇక్కడ పుట్టిందని ఏమీ తెలియని నంగనాచిలాగా, అమాయకుడిలాగా మాట్లాడుతున్నారు. దిల్‌రాజు కమల్ హసన్‌ను మించిపోయారు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. దురుద్దేశంతోనే నా పేరు చెప్పారు. కొన్ని సమావేశాలు ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా జరిగాయి. మే-21 జరిగిన సమావేశంలో ఎవరేం మాట్లాడారు? ప్రకటనలో ఎవరి పేరు ఫస్ట్ ఉన్నది? శిరీష్ రెడ్డి అంటే దిల్‌రాజు తమ్ముడు కాదా? రెండో వ్యక్తి సునీల్. వాళ్లిద్దరూ పార్టనర్స్. వీళ్లంతా కలిసి ఈ మీటింగ్‌లో ఎగ్జిబిటర్లు అందరూ నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వగానే జనసేన పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చారు. హరిహర వీరమల్లు సినిమాపై నేను ఎలాంటి కుట్రలు చేయలేదు. పవన్ కళ్యాణ్ నాకు దేవుడు.. ప్రాణం. అలాంటి వ్యక్తి సినిమాను నేనెందుకు ఆపుతాను? దమ్ముంటే దిల్‌రాజు చేసిన ఆరోపణలను రుజువు చేయాలి. దిల్‌రాజు నైజాం నవాబులా ఏలుదామని అనుకుంటున్నాడు. త్వరలోనే నిజ నిజాలు తెలుస్తాయి, తప్పకుండా బయటికొస్తాయి’ అని సత్యనారాయణ తేల్చి చెప్పారు.
వదలను.. కోర్టుకెళ్తా..!
‘ థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకునే సమయానికి వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌కు విధేయుడిగానే ఉంటాను. దిల్‌రాజుపై తప్పకుండా నేను కోర్టుకు వెళ్తాను. నా రాజకీయ భవిష్యత్‌పై ఆయన దెబ్బ కొట్టారు. ఆ నలుగురు మరెవరో కాదు.. దిల్‌రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునిల్ నారంగ్. ఈ నలుగురే థియేటర్ల బంద్ కుట్ర వెనుక ఉన్నారు. ఆ నలుగురికీ పవన్ కళ్యాణ్ తొక్క, తోలు తీసేస్తారు. నా ప్రాణం ఉన్నంత వరకూ పవన్‌తోనే ఉంటాను. దిల్‌రాజును ఇప్పుడు కమల్ హాసన్ అంటున్నారు. నా పార్టీ నాకు అగ్నిపరీక్ష పెట్టింది. ఇది ముమ్మాటికీ దిల్‌రాజు కుట్ర. ఈ విషయాలన్నీ నేను పార్టీకి వివరంగా చెబుతాను. రాజమండ్రి జనసైనికులు నాకు ఏర్పడిన ఈ పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. ఇది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, జనసేన నన్ను అర్థం చేసుకుంటుందని భావిస్తున్నా’ అని సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై దిల్‌రాజు ఎలా స్పందిస్తారు? దీనిపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపై అటు ఏపీ రాజకీయాల్లో.. ఇటు టాలీవుడ్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Read Also- Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్‌కు బదులిచ్చిన పవన్.. థియేటర్ యాజమాన్యాలపై బిగ్ బాంబ్!