Tandur Sub-Registrar office: వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా రాత్రి సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఆశాఖలో కలకలం రేపుతున్నాయి. లే అవుట్ల క్రమబద్దీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ఆమోదం పొందని స్థిరాస్తి ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఇందులో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉండగా అధికార పార్టీకి చెందిన కీలక నేతల ప్రమేయం సైతం ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్న తరుణంలోనే తాండూరు వ్యవహారం వెలుగు జూడడంతో రెవిన్యూ శాఖ మంత్రి ఈ అక్రమ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. అక్రమాలపై సమగ్ర నివేదికను కోరినట్లు సమాచారం.
నిబంధనలు తోసిరాజని
నిబంధనలను పక్కకుపెట్టి తాండూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను చేయడం పట్ల ఆశాఖలోని అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ లో ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించి అన్ని రిజిస్ట్రార్లకు స్పష్టమైన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఏదైనా సర్వే నెంబరులో 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా10 శాతం ప్లాట్లు అమ్ముడు పోవాలి. మిగిలిన 90 శాతం ప్లాట్లను నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ నిబంధనలను తోసిరాజని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార లే అవుట్‌కు సంబంధించిన 220కి పైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయడం సంచలనం రేపుతోంది. అక్రమంగా చేసిన ఈ ప్లాట్లు అన్నీ సాయిపూరు, కోకట్ గ్రామాల పరిధిలో ఎటువంటి డిటీసీపీ అనుమతులులేని వ్యవసాయ భూములకు సంబంధించిన ప్లాట్లేనని తెలుస్తోంది. ఇందులో కొన్ని ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్ ఆమోదం కోసం దరఖాస్తు చేసినవి ఉండగా వాటికి ఇంకా అనుమతులు రాలేదు. కేవలం రశీదులు జతచేసి రిజిస్ట్రేషన్లు చేశారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన వాటిలో ఎల్‌ఆర్‌ఎస్ కు దరఖాస్తు చేయని ప్లాట్లు కూడా కొన్ని ఉన్నట్లు తెలుస్తోంది.
అంతా వ్యూహాత్మకమేనా
అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం అంతా వ్యూహాత్మకంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఒకరితర్వాత మరొకరు ఇలా ఇద్దరు అధికారులు సెలవుల్లో ఉన్నప్పుడు మరో వ్యక్తి ఇంఛార్జిగా ఉన్న సందర్భంలో అక్రమ రిజిస్ట్రేషన్ల తంతు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాండూరు సబ్ రిజిస్ట్రార్ సాయి కుమార్ ఏప్రిల్ 22 నుంచి మే 17 వరకు సెలవుల్లో ఉన్న సందర్భంలో వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి పవన్ కుమార్ ఇంఛార్జిగా వ్యవహరించారు. ఈయన కూడా మే 12 నుంచి 23 వరకు సెలవుల్లో ఉండడంతో ఆయన స్థానంలో చంపాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఫసియుద్దీన్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఫసియుద్దీన్ ఈనెల12 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించగా నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా 220కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Also Read: Bail to Lady Aghori: అఘోరీకి బెయిల్ మంజూరు చేసిన చెవెళ్ల కోర్టు..!
పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్కానింగ్
సాధారణంగా తాండూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి నిత్యం 10 నుంచి 15 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఏ రోజుకారోజు డాక్యుమెంట్ల స్కానింగ్ ప్రక్రియ జరుగుతుంటుంది. అయితే ఫసియుద్దీన్ విధులు నిర్వర్తించిన ఆరు రోజుల్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్కానింగ్ పెండింగ్‌లో ఉండడంతో దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీయగా అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటకు వచ్చింది. అనధికార లే అవుట్లకు సంబంధించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. ఇందులో ఫసియుద్దీన్‌తోపాటు కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల పాత్రపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి కేవలం ఫసియుద్దీన్‌పైననే సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అక్రమ తంతులో మరికొందరి అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇద్దరు అధికారులు సెలవుల్లో ఉన్నప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుజూస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలోనూ తాండూరు కార్యాలయంలోని అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా ఏసీబీ అధికారులు దాడులు జరిపి సబ్ రిజిస్ట్రార్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు నేటికీ గుణపాఠం నేర్చుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అక్రమ రిజిస్ట్రేషన్ల వెనుక రాజకీయ ప్రమేయం
పెద్ద మొత్తంలో జరిగిన అక్రమ రిజస్ట్రేషన్ల వెనుక రాజకీయ ప్రమేయంపై అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే ప్రాంతానికి చెందిన మరో ద్వితీయ శ్రేణి నేత పేరు కూడా విన్పిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీతోపాటు సదరు నేత కూడా అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో సదరు ద్వితీయ శ్రేణికి చెందిన నేతకు సంబంధించిన ప్లాట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవహారంపై రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఆరా తీసినట్లు తెలిసింది. ఇక్కడి తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతుండగా..పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.
Also Read: Water Crisis: గిరిజన తండాలో నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు!