Shipla layout flyover: ఐటీ కారిడార్ లో అత్యంత రద్దీ, ట్రాఫిక్ తో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ రూట్ లో ట్రా ‘ఫికర్’ కు త్వరలోనే చెక్ పడనుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ రూట్ లో వాహానాలను మరింత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) కింద జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన శిల్పా లేఔట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్దమైంది. దీన్ని త్వరలో ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుండి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది, ప్రయాణ సమయంతో పాటు వాహనదారులకు ఇంధనం కూడా ఆదా అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రానున్న 20 ఏళ్ల ను దృష్టి లో పెట్టుకుని, అప్పటి వరకు పెరగనున్న ట్రాఫిక్ కు అనుగుణంగా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: MLC Kavitha: అవినీతితో సింగరేణిని అంతం చేయాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం!
ప్రాజెక్టు వివరాలు
ఈ ఫ్లైఓవర్‌ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన థర్డ్ లెవెల్ ఫ్లై ఓవర్. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్- 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్- 2 ఫ్లైఓవర్ నిర్మించారు.ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 29 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించారు.
వీటిలో ప్రధాన కార్యాలయం మొత్తం ఆరు ఆస్తుల నుంచి స్థలాలను సేకరింగా, మిగిలిన 23 ఆస్తుల నుంచి స్థానిక సర్కిల్, జోనల్ అధికారులు స్థలాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సేకరించిన మూడు ఆస్తుల సేకరణకు రూ. 5.48 కోట్లు, మరో మూడు ఆస్తులకు రూ. 4.80 కోట్లను నష్టపరిహారంగా చెల్లించగా, మిగిలిన ఆస్తులకు జోనల్ లెవెల్ లోనే నష్టపరిహారాలను చెల్లించగా, మరో మూడు ఆస్తులకు ఇంకా నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.
మెరుగుపడనున్న కనెక్టివిటీ
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఈ ఫ్లై ఓవర్ చాలా ఉపయోగకరంగా మారనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్ చిక్కుల లేకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే సౌకర్యం ఈ ఫ్లై ఓవర్ తో కల్గనుంది. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలీ వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలగనుంది.
పూర్వ కమిషనర్ ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ ఆర్. వి. కర్ణన్ లు తరుచూ ఈ ఫ్లై ఓవర్ పనులన పరిశీలిస్తూ ఎప్పటికపుడు డెడ్ లైన్లు విధించటంతో నిర్మాణం వేగంగా పూర్తయింది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినప్పటికీ, పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా అన్నిరకాల పనులు పూర్తి చేసి, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరో అడుగు ముందుకు పడినట్టవుతుంది. ఎస్ఆర్ డీపీ ద్వారా మొత్తం 42 పనులను ప్రతిపాదించి, ఆమోదించగా, ఈ ఫ్లైఓవర్ పూర్తయితే మొత్తం 37 ప్రాజెక్టులు పూర్తవుతాయి.
Also Read: Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్త పార్టీని ఆపేందుకేనా?
మూడు నెలల్లో పూర్తి కానున్న ఆర్వోబి
ఎస్ఆర్ డీపీ కింద పాతబస్తీలోని ఫలక్ నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కూడా చేపట్టారు. ఫలక్ నుమా ఆర్వోబీ, శాస్త్రీపురం ఆర్వోబీ పనులు రైల్వే పోర్షన్ రానున్నమూడు నెలల్లో అంటే ఆగస్టు నెలాఖరు కల్లా పూర్తి చేయాలని కమిషనర్ ఆర్. వి. కర్ణన్ అధికారులకు డెడ్ లైన్ విధించారు. జూలై నెలాఖరు కల్లా ఫలక్ నుమా ఆర్వోబీ, ఆగస్టు చివరి కల్లా శాస్త్రీపురం ఆర్వోబీ పనులను పూర్తి చేయాలని కమిషనర్ అధికారులు, ఇంజనీర్లకు టార్గెట్ విధించారు.
వచ్చే నెలలో హెచ్ సిటీ పనులు షురూ
ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త సర్కారు ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్ డీపీపనులన్నింటిని హెచ్ సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, రూ.7032 కోట్ల వ్యయంతో 58 పనులకు మంజూరీ కూడా ఇవ్వటంతో ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నట్లు, త్వరలోనే ఒప్పందం పూర్తి చేసుకుని, వచ్చే నెలా మొదటి వారంలో పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 58 హెచ్ సిటీ పనుల్లో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్ లు, ఆర్వోబీలు 4, రైల్వే అండర్ బ్రిడ్జి 3, రోడ్డు వెడల్పు 10 పనులను చేపట్టనున్నారు.
Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!