Fake IAS officer: మూడుసార్లు ఫెయిలయ్యా…అయినా కుంగిపోలేదు…నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించి ఐఏఎస్ అయ్యానంటూ సోషల్ మీడియాలో సక్సెస్ స్టోరీ క్రియేట్ చేసుకుని మోసాలకు పాల్పడ్డ కిలాడీ లేడీ ఉదంతమిది. సంపన్న కుటుంబాలకు చెందిన యువకులకు వల వేస్తూ…కొందరిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు కొల్లగొడుతున్న సదరు మహిళ ఆట కట్టించారు. నల్గొండ జిల్లా పోలీసులు, విచారణలో ఆమె గతంలో పలు చోరీలకు కూడా పాల్పడినట్టు వెల్లడైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ మండలం లావుడి తాండాకు చెందిన సరిత ఎలియాస్ ప్రత్యూష తేలికగా డబ్బు సంపాదించటానికి ఐఏఎస్ అధికారిగా, డాక్టర్ గా అవతారమెత్తింది.
ఆ తరువాత మోసాలకు తెర లేపింది. పలువురు యువకులను ఉచ్ఛులోకి లాగి దండిగా డబ్బు గుంజిన సరిత ఏడాది క్రితం ఓ వైద్యున్ని బ్లాక్ మెయిల్ చేసి 5లక్షల రూపాయలు వసూలు చేసింది. మలక్ పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో చోరీలకు సైతం పాల్పడింది. ఈ మేరకు ఆయా స్టేషన్లలో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. చోరీ కేసులో మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు సరితను అరెస్ట్ చేశారు.
Alos Read: Fake iPhone Spare Parts: కోటి రూపాయల.. ఐఫోన్ నకిలీ విడిభాగాలు సీజ్!
విచారణలో నార్కెట్ పల్లి, నల్గొండ వన్ టౌన్ స్టేషన్ల పరిధుల్లో ఆమె ఛీటింగులకు కూడా పాల్పడినట్టు వెల్లడైంది. డబ్బు కోసం ఓ యువకున్ని బెదిరించి ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించినట్టుగా బయటపడింది. మూడు రోజుల క్రితం 100 నెంబర్ కు ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చి వనస్థలిపురం పోలీసులను ముప్పుతిప్పలు పెట్టినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో తాను డీఎస్పీ భార్యనంటూ పోలీసులనే బెదిరంచినట్టుగా వెల్లడైంది.
అంతకు ముందు ఓ యువతి హత్య జరిగిందంటూ హైదరాబాద్ లోని ఓ డీసీపీతోపాటు మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని ఓ ఇన్స్ పెక్టర్ కు ఫోన్లు చేసి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలింది. ఆ తరువాత తన మొబైల్ ను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టుగా వెల్లడైంది. ఇక, విద్యార్థినిని అని చెప్పుకొని వేర్వేరు హాస్టళ్లలో ఉన్న సరిత రూమ్మేట్స్ కు చెందిన నగదు, సెల్ ఫోన్లను తస్కరించింది. కొంతమంది యువకులను తాను డీఎస్పీ కూతురినని నమ్మించి అందినకాడికి దోచుకుంది.
Also Read: Serilingampalli: నకిలీ పత్రాలతో వేరొకరి స్థలంలో బిల్డింగ్ నిర్మాణం.. భవనం సీజ్!