GHMC officials: వర్షాలు మొదలయ్యాయి. ఈసారి వర్షాకాలం కాస్త ముందుగానే రానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం అలసత్వం వీడటం లేదన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం కన్నా ఈసారి వర్షాలు మరింత దంచి కొట్టే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించటం, దానికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం తోడు కావటంతో ఈ సారి కూడా వర్షాకాలంలో మునక తప్పదన్న ఆందోళన లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమవుతుంది. నాలాల్లోని పూడికతీత, నాలాల విస్తరణ, ఆధునీకరణపై జీహెచ్ఎంసీ అధికారుల తీరు మారటం లేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే నాలాల్లోని పూడికను తొలగించాల్సి ఉండగా, ఈ సారి కూడా వర్షాకాలం ప్రారంభం కాకపోయినా,వర్షాలు దంచి కొడుతున్నాయి.
ఇంకా నాలాల్లోని పూడికతీత పనులు మొత్తం పూర్తి కాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 1003 కిలోమీటర్ల పొడువున చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు ప్రవహిస్తున్నాయి. వీటిలో దాదాపు 953 కి.మీ.ల పొడువున భారీగా పూడిక పేరుకుపోయి, వరద నీటి ప్రవాహానికి అడ్డుగా వస్తున్నట్లు గుర్తించారు. వీటిలో సుమారు 358 కిలోమీటర్ల పొడువున మేజర్ నాలాలు ప్రవహిస్తుండగా, 645 కిలోమీటర్ల పొడువున చిన్న, మధ్య తరహా నాలాలు ప్రవహిస్తున్నాయి.
Also Read: Fake Documents: నకిలీ ఇండ్ల పట్టాల దందా.. రెచ్చిపోతున్న అక్రమార్కులు!
ఈ సంవత్సరం ఈ నాలాల్లోని పూడికను తొలగించేందుకు మొత్తం 203 పనులకు గాను రూ.55.04 కోట్లను కేటాయించారు. ఇప్పటి వరకు నాలా పూడికతీత పనుల్లో దాదాపు 99 శాతం పూర్తి చేశామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా, వాటిల్లో పారదర్శకంగా పనులు జరిగినవి అంతంతమాత్రమేనన్న ఆరోపణలున్నాయి. నగరంలోని ప్రధాన నాలాలైన బల్కాపూర్ నాలా, బేగంపేట నాలా, ముర్కీ నాలా, హుస్సేన్ సాగర్ నాలాతో పాటు పికెట్ నాలాలు చిన్న పాటి వర్షానికే పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా వీటి పక్కనే నిర్మించిన ఇండ్లు, షాపుల్లోకి నీరు ప్రవహిస్తుంది. మొత్తం పూడికతీత పనులు 203 కాగా, వీటిలో 130 పనులకు ఒకసారి, మిగిలిన పనులకు పలు సార్లు టెండర్ల ప్రక్రియ చేపట్టడంతో ఈ సారి కూడా నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోవటమే ఈసారి మునకకు మరో కారణం కానుంది.
కిర్లోస్కర్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు
సుమారు 24 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తిన తర్వాత ప్రతి సంవత్సరం వానా కాలంలో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునుగుతున్నా, జీహెచ్ఎంసీ గుణపాఠం నేర్వటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ స్టడీ చేసి చేసిన పలు సిఫార్సులను కూడా అమలు చేయటంలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమవుతుందన్న విమర్శలున్నాయి. ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా, అప్పట్లో వరదల నివారణ కోసం కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తూతుమత్రంగా చేపడుతూ, ఏటా పూడిక పేరిట కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.
ప్రతి ఏటా నాలా పూడికతీత పనులకు వేసవి కాలానికి ముందు నిధులు కేటాయించి, వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని కిర్లోస్కర్ కమిటీ సూచించినా, పనులు మాత్రం అధికారులు, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. పలు సందర్భాల్లో నాలా పూడికతీత పనుల విషయంలో విజిలెన్స్ కూడా జోక్యం చేసుకోవల్సి వచ్చింది. నాలాల్లోనుంచి తీసిన పూడికను డంపింగ్ యార్డుకు తరలించేందుకు వినియోగించిన వాహానాల నెంబర్లు, ఎంత పూడిక తీసుకెళ్లారన్న నిబంధన కూడా విధించటంతో గతంలో ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో రోడ్లపై తిరగని వాహానాల నెంబర్లు, ద్విచక్ర, ఆటో వాహానాల నెంబర్లను కూడా వేసి బిల్లులను డ్రా చేసిన పూడిక స్కామ్ వెలుగుచూడటంతో పలువురు ఇంజనీర్లపై కేసులు నమోదైనా, నేటికీ నాలా పూడికతీత పనులు పారదర్శకంగా, సక్రమంగా జరగకపోవటం గమనార్హం.
Also Read: Ganja Seized: 1.26కోట్ల గంజాయి డ్రగ్స్ దహనం.. 20 కిలోల గంజాయి కుల్ఫీలు స్వాధీనం!
మొత్తం పనులు 203
ఈ సారి వర్షాకాల ఏర్పాట్లలో భాగంగా రూ.55.04 కోట్లతో మొత్తం 203 పనులుగా ఆయా సర్కిళ్లలోని నాలాలను పరిగణలోకి తీసుకుని జోన్ల వారీగా ప్రత్యేకంగా కేటాయించినా, ఆశించిన స్థాయిలో పనులు ముందుకు కదలటం లేదన్న వాదలున్నాయి. ఎల్బీనగర్ జోన్ లో 5 పనులు, చార్మినార్ జోన్ లో 85, ఖైరతాబాద్ జోన్ లో 61 పనులుగా, శేరిలింగంపల్లి జోన్ లో 7, కూకట్ పల్లి జోన్ లో 6, సికిందరాబాద్ జోన్ లో 39 పనులుగా విభజించి పనులు చేపట్టారు.
అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు కారణంగా నాలా పూడికతీతకు కేటాయించిన రూ. 55.04 కోట్లకు గాను, 202 పనులు పూర్తయినట్లు, ఇందుకు గాను 99 శాతం బిల్లులను క్లెయిమ్ చేసినట్లు సమాచారం. వీటిలో ఇంకా వివిధ దశల్లో ఉన్న పనులకు కూడా కాంట్రాక్టర్లు బిల్లులను క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
Also Read: Trending video: వామ్మో.. తల మీద నిప్పు వెలిగించి టీ చేస్తున్న ఓ యువకుడు.. చూస్తే షాకవ్వాల్సిందే!