Ganja Seized: 1.26 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ ను ఎక్సయిజ్ అధికారులు దహనం చేశారు. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని తొమ్మిది ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 102 కేసుల్లో అధికారులు 171.34 కిలోల గంజాయిని సీజ్ చేశారు. దాంతోపాటు 21.03 కిలోల గంజాయి చాక్లెట్లు, 20 కిలోల గంజాయి కుల్ఫీలు, 320.6 గ్రాముల హాష్ ఆయిల్, 51 గ్రాముల ఓజీ కుష్, 17.66 గ్రాముల ఎండీఎంఏ, 12 గ్రాముల కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
డిస్పోజల్ అధికారిగా ఉన్న హైదరాబాద్ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ కే.ఏ.బీ.శాస్త్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఏఈఎస్లు శ్రీనివాస రావు, మోహన్ బాబు తదితరులు జీజే మల్టీ కౌవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఈ మాదక ద్రవ్యాలను దహనం చేశారు.
Also Read: Fake Documents: నకిలీ ఇండ్ల పట్టాల దందా.. రెచ్చిపోతున్న అక్రమార్కులు!
గంజాయి డ్రగ్స్ సీజ్
స్టేట్ ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు హైదరాబాద్ లోని వేర్వేరు చోట్ల దాడులు జరిపి గంజాయితోపాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్ పేటలో సోనూ బాయి అనే మహిళ గంజాయి విక్రయాలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఏ టీం సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని 1.162 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
కాగా, ఇదే కేసులో నిందితునిగా ఉన్న సతీష్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అమీర్ పేటలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు తెలియటంతో ఎస్టీఎఫ్ బీ టీం ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి దాడులు జరిపారు. శోభన్, ప్రజ్ఞ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వీరి నుంచి ఆరు ఎల్ఎస్డీ బ్లాస్ట్స్, రెండు ఎస్టీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి అమీర్ పేట ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Medak District SP: మొబైల్ ఫోన్ రికవరీ లో.. తెలంగాణ మొదటి స్థానం!