Private Schools: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కార్పోరేట్, ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా..అనుభవజ్ఞులైన టీచర్లు అసలే లేకున్నా..కనీస వసతులు కల్పించకున్నా.. యథేచ్చగా అడ్మిషన్ల దందాను సాగిస్తున్నాయి. బ్రోచర్లు చూపించి పాతిక వేలతో మొదలుపెట్టి..రూ.2లక్షల వరకూ ఫీజుల రూపంలో దంటుకుంటున్నారు. ఈ విషయం విద్యా శాఖాధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మొదలైన అడ్మిషన్ల దందా
అందినకాడికి దోచెయ్..అన్నట్లుగా ప్రైవేటు స్కూళ్ల వ్యవహారం ఉంటోంది. ఈ క్రమంలో విద్యాశాఖ నిబంధనలను సైతం ఆయా పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయి. పాఠశాల ఏర్పాటుకు సంబంధించి 24శాఖల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌వోసి) తీసుకోవాలి. ముఖ్యంగా భవన్ రిజిస్ట్రేషన్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మద్యం దుకాణాలు, ప్రార్థనా మందిరాలకు పాఠశాలలు దూరంగా ఉండాలి.
Also Read: Bhoodan Land Case: ఈడీ కేసును కొట్టేయలేం.. భూదాన్ భూములపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
అయితే చాలా పాఠశాలలను కేవలం ధనార్జనే ధ్యేయంగా నెలకొల్పుతున్నారు. బీఈడీ, డీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తిచేయని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు. విద్యాశాఖ ప్రమాణాలను పాటించకుండా, వివిధ శాఖల నుంచి అనుమతి తీసుకోకుండా అడ్మిషన్ల దందాను సాగిస్తున్నప్పటికీ తమకేమీ పట్టనట్లుగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు.
చందానగర్‌లోని రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇదే తరహాలో నిబంధనలకు పాతరేసి అడ్మిషన్ల దందాను సాగిస్తోంది. భవనానికిగాని, స్కూల్‌కు ఎటువంటి అనుమతులు లేకున్నా అడ్మిషన్లను నిర్వహిస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తరహా పాఠశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేకం ఉండగా..వాటిపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.
ఆగని ఫీజుల దోపిడీ
ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టగా..విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ స్థాయిలోనే కొన్ని స్కూళ్లు రూ.లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. స్కూళ్లకు రకరకాల పేర్లు పెట్టి ఐఐటీ, నీట్ కోచింగ్ ఇస్తున్నామని ఫీజులను దండుకుంటున్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనేకమార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఆచరణకు రావడం లేదు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ఫీజుల దోపిడీని నియంత్రిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా..ఇప్పటివరకు కార్యాచరణ మొదలుకాకపోవడంతో ఈ సంవత్సరం ఆచరణ సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే చట్టాన్ని చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని, ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేశాక చట్టం చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు