Bhoodan Land Case: నాగారం భూదాన్ భూముల కుంభకోణంలో ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన అభియోగాలున్న భూ కుంభకోణానికి సంబంధించిన నేరంగా దీనిని గుర్తించినట్టుగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సూచించింది. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన దస్తగిరి అనే వ్యక్తి గత యేడాది నాగారం గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించటం ద్వారా సేల్ డీడ్లు చేయించుకున్నారంటూ మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు ఖదీరున్నీసా, మహ్మద్ మునవర్ ఖాన్ తోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంపై ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఇటీవల సీఆర్పీఎఫ్ పోలీసుల బందోబస్తుతో యాఖుత్ పురా, మీర్ పేట తదితర ప్రాంతాల్లో ఉన్న ఖదీరున్నీసా, మహ్మద్ మునవర్ ఖాన్, షర్ఫాన్, ఎం.ఏ.సుకూర్ తదితరుల ఇళ్లపై దాడి జరిపారు. మొయినాబాద్ లో ఉన్న మహ్మద్ మునవర్ ఖాన్ కు చెందిన ఫార్మ్ హౌస్ లో కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో భూదాన్ భూముల సేల్ డీడ్స్ కు సంబంధించి పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Aslo Read; Notice to Jhansi reddy: కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షాక్!..హైకోర్టు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
స్క్వాష్ చేయాలంటూ…
కాగా, కేసులో కీలక నిందితులుగా ఉన్న ఖదీరున్నీసా, మహ్మద్ మునావర్ ఖాన్ లు తమపై ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు జడ్జి జస్టిస్ నర్సింగ్ రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వంద కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు ఇమిడి ఉన్న నేపథ్యంలో కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వలు జార చేయవద్దని కోర్టును కోరారు.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయటానికి ఈడీకి సమయం ఇవ్వాలని అడిగారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రజా ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు ఉన్న ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సూచిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.