GHMC: ఈ సారి వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికకు జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. వానకాలం కష్టాలను తగ్గించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే ఓ దఫా జీహెచ్ఎంసీ, సిటీ పోలీసు, హైడ్రా శాఖల ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్ల గురించి ప్రాథమికంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్లు, శిథిల భవనాలు, రోడ్ల మరమ్మతులు, వరద ప్రవాహా నివారణ వంటి ముఖ్య అంశాలపై జీహెచ్ఎంసీ ఈ సారి కాస్త ముందు నుంచే పోకస్ చేసింది. ఇందులో భాగంగా వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిషేధిస్తూ త్వరలోనే ఆదేశాలు జారీ చేసేందుకు కూడా సిద్దమైంది.
ఇప్పటికే వివిధ రకాల నిర్మాణ అనుమతులు తీసుకుని సెల్లార్లు తవ్విన యజమానులు, నిర్మాణదారులు వీలైంత త్వరగా సెల్లార్ లను పూర్తి చేసుకోవాలని సూచించింది. దీనికి తోడు వ్యక్తిగత నివాసాలు, అపార్ట్ మెంట్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని పనులు చేపట్టిన నిర్మాణదారులు కూడా వెంటనే తమ భవనానికి సంబంధించిన ప్రహరీ గోడలను నిర్మించుకోవాలని కూడా సూచించింది. ఈ రకంగా గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్ల జోనల్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ కానున్నట్లు సమాచారం. ఆరు జోన్లలో సుమారు 200 వరకు సెల్లార్లున్నట్లు, వీటి పనులు పురోగతి తో పాటు నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు అవసరమైతే క్షేత్ర స్థాయి పర్యటనలకు కూడా వెళ్లాలని రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Painting Scam: జీహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కాం..
శిథిలావస్థ భవనాలపై నజర్
వర్షాకాలానికి ముందే జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో ఉన్న శిథిలావస్థ భవనాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించాలని కొద్ది రోజుల క్రితం కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి తాజాగా సెల్లార్ల గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.గత కొద్ది సంవత్సరాల క్రితం వర్షాకాలంలో చిన్న పాటి వర్షానికే సెల్లార్లు, ప్రహరీ గోడలు కూలి పలువురు ప్రాణాలు కొల్పోయిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే జీహెచ్ఎంసీ ఇలాంటి ప్రమాద నివారణ చర్యలను చేపడుతుంది.
ఇందులో భాగంగా నాలుగు నెలల క్రితం ఎల్బీ నగర్ లో సెల్లార్ కూలిన ఘటనలో నలుగురు మృతి చెందిన ఘటనను దృష్టి లో పెట్టుకున్న జీహెచ్ఎంసీ సెల్లార్లపై వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా సెల్లార్లను, రిటైనింగ్ వాల్స్ లను నిర్ణీత గడువులోపు పూర్తి చేయని పక్షంలో, వాటి వల్ల జరిగే ప్రమాదాలకు యజమానులనే బాధ్యులను చేయాలని కూడా జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం.
సెల్లార్లపై సర్వే ఇలా
జీహెచ్ఎంసీ తాజాగా సెల్లార్లపై జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రతి సర్కిల్ లో జరుగుతున్న నిర్మాణాల్లో భాగంగా సెల్లార్లను స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు ఖచ్చితంగా ఫీల్డు లెవెల్ లో పరిశీలించాలని ఆదేశాల్లో పేర్కొంది. తీసుకున్న అనుమతుల ప్రకారమే సెట్ బ్యాక్ లను మెయింటేన్ చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని తనిఖీ చేసి నివేదికలను పంపాల్సి ఉంటుంది. సెల్లార్లలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీరు నిల్వకుండా యజమాని, నిర్మాణదారులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి. నిర్మాణం జరుగుతున్న సైటుకు చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేయటంతో పాటు ప్రమాద నివారణ ప్రమాణాలను పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించాలని జీహెచ్ఎంసీ సూచించింది.
ప్రమాద నివారణ చర్యలు, సెల్లార్ కు సెట్ బ్యాక్ లు పాటించని పక్షంలో నోటీసులు జారీ చేసి నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాల్లో సూచించింది. బిల్డర్, యజమాని నిర్లక్ష్యంతో ఏదైనా ప్రమాదం జరిగితే జారీ చేసిన అనుమతిని రద్దు చేయటంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న సర్వే త్వరలోనే ముగిసి, మొత్తం 30 సర్కిళ్లలో జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలతో పాటు సెల్లార్ల తవ్వకాలు, సెట్ బ్యాక్ లు, ప్రమాద నివారణ ప్రమాణాలు వంటి అంశాలకు సంబంధించిన నివేదిక అందనుంది. నివేదికను బట్టి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు.
Also Read: Minister Seethakka: వాల్టా చట్టం పై ప్రత్యేక డ్రైవ్.. కీలక అంశాలపై తీర్మానాలు!