– నగరంలో ఫ్లైఓవర్ల సుందరీకరణకు ప్లాన్
– అన్ని జోన్లలో ఎకో కంపెనీకే టెండర్లు!
– హెచ్ఎండీఏ నుంచి జీహెచ్ఎంసీకి రూ.150 కోట్ల బదిలీ
– ఉద్దేశం మంచిదే.. కానీ, దోచిపెట్టడం అలవాటుగా మారింది ?
– జీవోలకు విరుద్ధంగా ఎలిజిబులిటీ అంటూ రాగాలు
– కమీషన్స్‌కు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న
ఎస్ఈ, ఈఈ, జోనల్ కమిషనర్లు
– 65 రూపాయల పనికి రూ.110 నుంచి రూ.170 ఖర్చు!
– పెమ్మసాని శ్రవణ్‌కే ప్రాధాన్యత ఎందుకు?
గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చారన్న శ్రవణ్
నాణ్యత లేక వర్షం నీటికే పాడవుతున్న పెయింటింగ్స్
సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి…
రూ.150 కోట్లు కేటాయించిన హెచ్ఎండీఏ
-కోట్ల ప్రజా ధనం కొట్టేసే స్కెచ్‌పై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్: మహానగరంలో ప్లైఓవర్స్ అన్నింటికీ ఇన్నోవేటివ్‌గా కలర్స్ వేస్తున్నారు. సంప్రదాయం ఉట్టేపడేలా, కళ్లకు ఇంపుగా అనిపించేలా కలర్‌ఫుల్ చిత్రాలను వేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొన్నాళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఉద్దేశం మంచిదే. మాసిపోయిన గోడలు , చెత్త చెదారం సర్సిల్స్ ఉండొద్దని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అమ్రపాలి ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే రూ.150 కోట్లు జీహెచ్ఎంసీకి బదలాయింపు జరిగింది. వివిధ జోన్లలో ఉన్న ఫైఓవర్స్‌కు పెయింటింగ్ వేసేందుకు టెండర్లు పిలిచారు. రూ.50 లక్షల వరకు జీవో 94 ప్రకారం అర్హతను చూడకుండానే నాణ్యతను ప్రామాణాకంగా తీసుకుని పనులు కట్టబెట్టే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్‌కు ఉంది. జోనల్ వారీగా పంచడంతో ఆ జోన్లలో ఉన్న ఈఈలను, సూపరింటెండెంట్ ఇంజినీర్స్‌ను బుట్టలో వేసుకుని ఎకో డిజైనర్స్ స్టూడియో వాళ్లు టెండర్లలో ఎలిజిబులిటీ అనే పదంతో ఎవరికీ రాకుండా వారికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారు ఇలా చేసినందుకు అధికారులకు కమీషన్లు దక్కాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి అర్హత కల్పిస్తే 50 నుంచి 60 శాతం తక్కువకు వచ్చేది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ రూ.110 నుంచి రూ.170 వరకు చెల్లించాల్సి వస్తున్నది.
ఒక్క వానకే ఖతం
ఏడాది క్రితం ప్రారంభించిన ఈ పెయింటింగ్ సరిగ్గా ఉండడం లేదు. డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తేనే రూ.65కి స్క్వేర్ ఫీట్ వేయొచ్చు. మన ఇంటి లోపల పెయింటింగ్ వేయిస్తే రూ.35. డ్యామ్ ప్రూఫ్‌తో వేయించినా మార్కెట్‌లో రూ.55 మించి కాదు. అయితే, ఫ్లై ఓవర్స్ పెయింటింగ్ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నా నాణ్యత లేదు. డ్యామ్ ప్రూఫ్ వేసి పెయింట్ వేస్తే కలకాలం ఉంటుంది. అది చేయకుండా మమ అనిపించడంతో మాసబ్ ట్యాంక్ ప్లైఓవర్ పెయింటింగ్ కొన్నాళ్లకే మసకబారింది.
అధికారులే రేట్లు పెంచి ఇస్తున్నారా?
నిజానికి GHMC లో కొన్ని టెండర్స్ తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెమ్మసాని శ్రవణ్ కుమార్ చౌదరి తనకే అన్నీ దక్కేలా చక్రం తిప్పారు . ఈయన జోనల్ కమిషనర్స్‌ను గుప్పిట్లో పెట్టుకుని జీవో నెంబర్ 66 ఆఫ్ 2014, 94 ఆఫ్ 2003కి విరుద్ధంగా, క్లాజ్ 5 నుంచి క్లాజ్ 3కి మార్చేశారు. జీహెచ్ఎంసీలో ఒక వర్క్ పెండింగ్‌లో ఉండగా మరో వర్క్ అప్పగించరు. కానీ, వీరు టెండర్లలో పాల్గొనే ముందు పెండింగ్ వర్క్స్ ఏమీ లేవని రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. అందుకు ఆర్టీఐతో సమాచారం ఉన్నా, మళ్లీ ఎలిజిబులిటీ పేరుతో మరింత అనుభవం పెంచేసి ఎక్కువ రేటుకు వారికే ఇచ్చేశారు. ఇందుకు చార్మినార్ జోనల్ కమిషనర్ , శేరిలింగంపల్లి ఎస్‌ఈ శంకర్ సహాయ సహకారాలతో వివిధ జోన్లలోని అధికారులను మేనేజ్ చేసి శ్రవణ్‌కే 50 శాతం రేటు పెంచి దొచిపెట్టడం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. ఎస్టీ రిజర్వేషన్స్ అయినా కొన్ని ప్లైఓవర్స్‌కు గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో శ్రీదేవి లునావత్‌కు వచ్చేలా చేసి స్క్వేర్ ఫీట్‌కు రూ.60 కమీషన్‌తో వేరే వాళ్లకు అప్పగిస్తున్నారు. సఖీనా అర్టీస్ లాంటి వాళ్లకు రూ. 40 కే సబ్ లీజ్ ఇచ్చి దర్జాగా తక్కువలో తక్కువ కోట్లు కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. దీనిపై సరైన వివరాల కోసం అధికారులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.
బిల్లులు టకటకా పడిపోతున్నాయి
మొత్తం రూ.150 కోట్ల టెండర్లలో వీళ్లు చేసిన పనియే 90 శాతం ఇప్పటికే 80 శాతం బిల్లులు క్లియర్ అయినట్లు తెలుస్తున్నది. ఏండ్లకు ఏండ్లు గడిచినా బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్లకు క్లియర్ చేయని అధికారులు, ఈ పెయింటింగ్ టెండర్లకు మాత్రం చేసిన 80 శాతం పనులకు ఇచ్చేశారు. కాగితాల పైనే టెండర్లు తీసుకుని సబ్ లీజ్‌కు ఇచ్చి పనులు చేస్తున్న శ్రవణ్ కుమార్‌కు 60 శాతంలో 20 శాతం అధికారులకు కమీషన్ ఇస్తే ఇట్టే పాస్ అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లు కాకుండా గత ప్రభుత్వం ల తన్నితే కూలే విధంగా తాత్కాలిక మెరుపులతో, నాణ్యత లేని పెయింటింగ్ వేసి చేతులు దులుపుకుంటున్న ఎకో డిజైన్ స్టూడియోపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. కలర్స్ అద్దె ఈ టెండర్లలో ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలి.
స్వేచ్ఛ వరుస కథనాలు
టెండర్ల మాటున దోచుకుంటున్న కంపనీల బాగోతాలు, కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారుల లీలలపై ‘స్వేచ్ఛ’ ఎప్పటికప్పుడు కథనాలు ఇస్తుంది. పూర్తి వివరాలతో స్వేచ్ఛాయుతంగా వారి బాగోతాలను బయటపెడుతుంది.
అవును.. నిజమే! (బాక్స్)
‘ మాకు టెక్నికల్‌గా చాలా సపోర్టు ఉంది. అలారెడ్డి మూడు వారసత్వాలు కలిగిన, చాచా నెహ్రూ పార్క్‌కు పెయింటింగ్స్ వేసిన వాళ్లు మాతో పార్టనర్స్‌గా ఉన్నారు. అందుకే ఎక్కువగా పనులు దక్కుతున్నాయి. 90 శాతం పనులు మాకే వస్తున్నాయి. గోడలకు ఏ రేటు ఉంటుందో ఫ్లైఓవర్లకు కూడా అదే రేటు తీసుకుంటున్నాం. ఫ్లై ఓవర్స్ మాకు ఇవ్వడం వల్ల ఈ పనులు చేయాల్సి వస్తోంది. మాసబ్ ట్యాంక్‌లో ఫ్లై ఓవర్ నుంచి నీళ్లు పడి పెయింట్ పోయిన మాట వాస్తవమే. ఇకపైన ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. మేము సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నది నిజమే. రూ.60 నుంచి 70 వరకూ సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నాం. కొంత మందిని కూలికి పెట్టి కూడా చేయిస్తున్నాం. పనులు త్వరగా పూర్తి కావాలని సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము రూ.220కు కూడా చేసిన రోజులు ఉన్నాయి. మన ఊరు-మన బడి స్కీమ్‌లో, మిగతా టెండర్లలో రూ.220, రూ.200, రూ.170కు కూడా చేశాము. ఈ ప్రభుత్వంలో వివిధ పెయింట్లలో చాలా తగ్గించి ఇచ్చింది. గతంలో తక్కువ వర్క్ ఇచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎక్కువ వర్క్ ఇచ్చి తక్కువ డబ్బులు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక్క పెయింట్స్ లో మాత్రమే మొత్తం రూ.22 కోట్ల వర్క్ చేశాం’. ఇలా 150 కోట్లలో మేక్ ఎక్కువ దక్కాయి. నేను తెలంగాణలో ఉంటున్న , నా ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఇక్కడి అడ్రస్ ఉంది . కాబట్టి నేను ఆంధ్ర అయినా ఇక్కడి వాడినే అంటూ శ్రవణ్ కుమార్ ‘స్వేచ్ఛ’కు వివరించారు.