Batasingaram Fruit Market: రంగారెడ్డి జిల్లాలోని బాట సింగారం పండ్ల మార్కెట్ ప్రస్తుత మామిడి సీజన్‌లో ఎప్పటిలాగే ఆల్ టైం రికార్డును సృష్టిస్తోంది. ఈ ఏడాది కూడా మార్కెట్‌కు మామిడి పోటెత్తడంతో గత యేడాది కంటే అత్యధిక టర్నోవర్‌తో మామిడి విక్రయాలు జరుగుతున్నాయి. ఇంకా సీజన్ ఉండగానే ఇప్పటివరకు రూ.266 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక్కడి నుంచి ఉత్తరాది 20 రాష్ట్రాలకు మామిడి ఎగుమతులు జరుగుతున్నాయి. సీజన్ పూర్తయ్యేసరికి మార్కెట్ కమిటీకి సైతం పెద్ద ఎత్తున ఆదాయం సమకూరనున్నది.
ఆరంభం నుంచే జోరు
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాట సింగారం మార్కెట్ మామిడి పండ్ల క్రయ విక్రయాలకు పేరుగాంచింది. మార్కెట్‌కు ప్రతి యేడా మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభం నుంచే మామిడి జోరు కొనసాగుతోంది. ఓ వైపు వేసవి ఎండలు..మరోవైపు వడగాలులు, అకాల వర్షాల భయంతో రైతులు మామిడి కాయలను పెద్ద ఎత్తున మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రైతులు, కమీషన్ ఏజెంట్లు, చిరు వ్యాపారులతో మార్కెట్ ప్రాంగణం అంతా మామిడి క్రయ విక్రయాలతో కళకళలాడుతోంది. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ మార్కెట్‌కు వచ్చే మామిడి జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్‌కు 10 రకాల మామిడి కాయలు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడకు వచ్చే మామిడిలో అగ్రభాగం బంగినపల్లిది కాగా తరువాత స్థానాల్లో తోతాపురి, దసేరి, రసాలు, నాటి, హిమాయత్, కేసరి, సుందరి, మల్లిక తదితర రకాలుంటున్నాయి.
Also Rrad: Abdullahpur Met mandal: కబ్జాలపై కలెక్టర్ సీరియస్.. నాకేం సంబంధం లేదన్న ఎమ్మెల్యే!
గతేడాదితో పోలిస్తే అధికంగా రాక
గతేడాదితో పోలిస్తే ఈసారి మార్కెట్‌కు మామిడి అధికంగా తరలివస్తోంది. ఫలితంగా ఈ ఏడాది మార్కెట్ మామిడి క్రయ విక్రయాల్లో రికార్డులను నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని గుంటూరు, నూజివీడు, కర్నూలు, కొల్లాపూర్, సంగారెడ్డి, మల్లాపురం, సూర్యాపేట, సిద్దిపేట్, కరీంనగర్, రాయచూర్, కల్యాణ దుర్గం, నందిగామ తదితర ప్రాంతాలను రైతులు మామిడిని మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే 834 ట్రక్కుల్లో 1,840 టన్నుల మామిడి మార్కెట్‌కు వచ్చింది. గత యేడాది మే 20 వ తేదీ వరకు 85,311 టన్నుల మామిడి రాగా ఈ ఏడాది మే 20 వరకు 42,245 ట్రక్కుల్లో 93,953 టన్నులు వచ్చింది. గత యేడాది ఇదే సమయానికి రూ.247కోట్ల వ్యాపారం జరగగా..ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.266కోట్ల వ్యాపారం జరిగింది. ఈ లెక్కన గడ్డి అన్నారం మార్కెట్ కమిటీకి ఇప్పటిదాకా రూ.2.66కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడి నుంచి మామిడిని గ్రేడింగ్ చేసి నిబంధనల మేరకు ప్యాక్ చేసి కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాలకు కూడా ఇక్కడి మార్కెట్ నుంచి మామిడి ఎగుమతి అవుతుండడం విశేషం. మార్కెట్‌కు వచ్చే మామిడిలో 70 శాతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా మిగతాది స్థానికంగా విక్రయమవుతోంది.
సజావుగా వ్యాపారం జరిగేలా చర్యలు: మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్
గతేడాది కంటే ఈసారి అధికంగా మార్కెట్‌కు మామిడి వస్తోంది. రైతులు, ట్రేడర్లు ఎవరూ ఇబ్బందులు పడకుండా పాలకవర్గం అంతా సమన్వయంతో తగు చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపారం సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లనే ఇక్కడి మార్కెట్‌లో వ్యాపారం చేసేందుకు అన్ని వర్గాలు ఆసక్తిని చూపిస్తున్నాయి. గతంలో కంటే ఈ ఏడాది వ్యాపారం ఎక్కువగా జరగడంతో మార్కెట్ కమిటీకి అధిక ఆదాయం రానుంది. ఇప్పటివరకు 2.66 కోట్ల ఆదాయం సమకూరింది.
Also Read: Revenue Department: రెవెన్యూ శాఖలో మరో మార్పు.. ధరణిలో లేని ఈ ఛాన్స్ !